వంటలు: గుంటకలగర ఆకుల పచ్చడి
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:18 AM
ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. తినే ప్రతీ వంటకం శరీరానికి ఏదో ఒక మేలు కలిగించేదిగా ఉండాలనే ఆలోచన మనది.
ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. తినే ప్రతీ వంటకం శరీరానికి ఏదో ఒక మేలు కలిగించేదిగా ఉండాలనే ఆలోచన మనది. వంటింట్లో కనిపించే చాలా ఆకుకూర లకు రుచి ఆరోగ్యాలతో సంబంధం ఉంది.గుంటకలగర అలాంటి ఆకుకూరల్లో మేటి.
కారం, చేదు రుచులు కలిగిన గుంటకలగర మొక్క ఆకులు కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తాయని, శరీరానికి మేలు చేస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. పేగుల్లో కలిగే బాధలు, వాపులు, నీరసం, చర్మవ్యాధుల్లో ఇది ఉపయోగపడ్తుంది.
కళ్లకు మేలు చేసే ఆకుకూరల్లో గుంటకల గర, పొన్నగంటి ప్రసిద్ధి చెందినవి. గుంటకల గర అంటే కంటికి చలువనిచ్చే ఔషధం అని!
గుంటకలగరతో కళ్లకు పెట్టుకునే కాటుక తయారు చేస్తారు. కళ్లకు చలువ కలుగు తుంది! ఇన్ఫెక్షన్ వచ్చి కళ్ళు ఎర్రబడటాన్ని కళ్ళకలక అంటాం. అలాంటి కలకను తగ్గించే కూర కాబట్టి కలకకూర కలగర అయి ఉండొచ్చు. కలగర అనే పదాన్ని పైరు, పెరుగుదల, కలుపు, కాపు అనే అర్థాల్లో వాడుతుంటారు. నీళ్ళ కుంటల దగ్గర పెరుగుతుంది కాబట్టి, గుంటకలగర అన్నారు. మెట్ట ప్రాంతాల్లోనూ పెరిగే కలగర ఉంది, దాని ఆకులు గిడసబారి ఉంటాయి. అయితే గుంటకలగరే శ్రేష్ఠం.
గుంటకలగరకు మన కేశాలతో కూడా అనుబంధం ఉంది. ఆముదంగానీ, నువ్వుల నూనె గానీ మంచిది దొరికితే, దాంతో సమా నంగా గుంటకలగర రసం తీసుకుని... నూనె మాత్రం మిగిలేలా కాచి రోజూ తలకుపట్టిస్తూ ఉంటే వెంట్రుకల కుదుళ్ళు బలపడతాయి. జుట్టు నల్లగా, నున్నగా పెరుగుతుంది. వెంట్రుకలు నెరవకుండా ఉంటాయి. ఎక్లిప్టిన్ అనే రసాయనమే దీన్ని కేశరంజకం చేస్తోంది
గుంటకలగరతో ఆమ్ల (ఉసిరికాయ) రసం కూడా కలిపి కాచినట్లయితే అదే భృంగామలక తైలం. ఇది ఎవరికి వారు ఇంట్లో చేసుకోగలిగే తైలమిది. ఆయుర్వేద ఔషధంగా తయారు చేసేప్పుడు వీటిలో ఇంకా అనేక మూలికలు కలుపుతారు.
ఔషధంగా ఉపయోగించే గుంటకలగర ఆకుల్ని ఆకుకూరగా కూడా మన పూర్వీకులు తినేవారు. గుంటకలగరను తియ్యకూరగా వండుకోవచ్చు. పులుసుకూరగానూ చేసుకోవచ్చు. గోంగూర ఆకులు గానీ చుక్కకూర ఆకులుగానీ, చింత చిగురుగానీ, గుంటకలగర ఆకులతో సమానంగా తీసుకుని ఆరనిచ్చి వేగించి నిలవపచ్చడి పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు కాస్త ఇవతలకు తీసుకుని ఎత్తుకెత్తు ధనియాలపొడి, వేగించిన ఉల్లిముక్కలు కలిపి తాజాగా తాలింపు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది.
గుంటకలగర ఆకుల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఆమ్ల (ఉసిరికాయ) కూడా దీనితోపాటుగా తీసుకుంటూ ఉంటే, ఇనుము తేలికగా శరీరానికి వంటబడ్తుంది.
గుంటకలగర ఆకుల్ని ఎండించి మిక్సీపట్టి ఓ సీసాలో భద్రపరచుకోండి. అరచెంచా పొడిని తేనెతో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతులో గరగర తగ్గుతాయి.
రక్తహీనతతో బాధపడేవారికి ఈ పొడిని తేనెతో తీసుకుని రోజూ ఒక ఉసిరికాయ జ్యూసు తాగుతుంటే ఇనుము వంటబట్టి రక్తహీనత తగ్గుతుంది.
కామెర్లు ఏ కారణం చేత వచ్చినా పచ్చి ఆకుల రసాన్ని, జీలకర్రపొడితో కలిపి ఖాళీ కడుపున పావు కప్పు మోతాదులో రోజూ రెండుపూటలా తాగుతూ ఉంటే కామెర్లు త్వరగా నయం అవుతాయి. లివర్ వ్యాధులన్నింట్లోనూ ఇది ఉపయోగపడే ఉపాయం.
ఎండిన గుంటకలగరాకులతో టీ కాచుకుని రోజూ తాగుతుంటే, సొరియాసిస్ లాంటి చర్మవ్యాధుల్లో పనిచేస్తుంది.
ఆధునిక పరిశోధకులు కూడా గుంటకలగర ఆకులు లివర్ని కాపాడేవిగానూ, విరేచనం అయ్యేలా చేసేవిగానూ, నొప్పులు తగ్గించేవిగానూ, బీపీని తగ్గించేవిగానూ, వైరస్లకు వ్యతిరేకంగా పనిచేసేవిగానూ గుర్తించి పరిశోధనలు సాగిస్తున్నారు.
అష్టాంగ హృదయం అనే ఆయుర్వేద గ్రంథం ఒక నెలపాటు గుంటకలగర ఆకు రసాన్ని తాగుతూ, విధిప్రకారం పథ్యం చేస్తే, నూరేళ్ళ ఆయుష్షు కలుగుతుందంటూ ‘శతం జీవితమాప్నువంతి’ అని పేర్కొంది.
డా. జి.వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు
Read Latest AP News And Telangana News And International News And Telugu News