ఒక్క రాత్రిలో అది సాధ్యం కాదు.. భారత్పై యూఎస్ మంత్రి వ్యాఖ్య
ABN , Publish Date - Oct 18 , 2026 | 10:04 AM
రష్యా చమురు దిగుమతులకు ఒక్క రాత్రిలో స్వస్తి పలకడం భారత్ వంటి దేశాలకు సాధ్యం కాదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా చమురు దిగుమతులకు అడ్డుకట్ట పడేలా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తే కలిగే ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా తెలిపారు. ఈ ఆంక్షలతో అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని అధ్యక్షుడు ట్రంప్ అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. 60 రోజుల పాటు ట్రంప్ ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రష్యా చమురు దిగుమతులను రాత్రికి రాత్రి నిలిపివేయడం భారత్ వంటి దేశాలకు అసాధ్యమని మంత్రి రూబియో అభిప్రాయపడ్డారు.
‘సమస్య ఏంటంటే.. ఇవి రష్యాకే పరిమితమైన ఆంక్షలు కావు. రష్యా చమురును దిగుమతి చేసుకునే భారత్ వంటి దేశాలపై సుంకాలు విధించాల్సి ఉంటుంది. కాబట్టి, సుంకాల ప్రభావంపై అధ్యక్షుడు ట్రంప్ 60 రోజుల పాటు అధ్యయనం చేస్తారు. ఇరాన్ యుద్ధం, హూతీల దాడులు, రష్యా యుద్ధం వంటివి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాల వల్ల అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో ట్రంప్ అంచనా వేస్తారు’ అని మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. రష్యా చమురును దిగుమతి చేసుకునే దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా ఇటీవల లిండ్సే ఓ గ్రాహమ్ సుంకాల చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
‘సుంకాలకు మినహాయింపులు ఇచ్చే నిబంధనలు కూడా ఆ చట్టంలో ఉన్నాయి. సుంకాల ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు వీలుగా మినహాయింపులను చట్టంలో చేర్చాము. సుంకాలతో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి. భారత్ వంటి దేశాలు కేవలం రష్యా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చమురును కొనుగోలు చేస్తున్నాయి. స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. కానీ రష్యాపైనే అవి అధికంగా ఆధారపడ్డాయి. రాత్రికి రాత్రి రష్యా దిగుమతులకు స్వస్తి పలకడం భారత్కు సాధ్యం కాదు. అంతేకాకుండా, భారత్ అమెరికాకు మిత్రదేశం, కీలక భాగస్వామి కూడా. కాబట్టి, ఈ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ కొంత సమయం తీసుకున్నారు’ అని మంత్రి మార్కో రూబియో తెలిపారు.
లిండ్సే ఓ గ్రాహమ్ సుంకాల చట్టం ప్రకారం, రష్యా చమురుకు బ్రేకులు వేసేలా ఇతర దేశాలపై అమెరికా 100 శాతం వరకూ సుంకం విధించే అవకాశం ఉంది. భారత్, చైనాపై ఈ ఆంక్షల ప్రభావం అధికమని విశ్లేషకులు ముందే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఈ సుంకాల నుంచి మినహాయింపు ప్రకటించారు. ఈ చర్యలతో రష్యా లాభపడుతుందని కొందరు ట్రంప్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కారు చర్యల వెనుక కారణాలను మంత్రి మార్కో రూబియో వివరించే ప్రయత్నం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
రణరంగంగా మారిన ఫ్రాన్స్.. వేల మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు
మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..