ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌బడ్ టిప్.. చివరకు..
ABN , Publish Date - Oct 18 , 2026 | 09:57 AM
ఇటీవల కావేరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇప్పుడది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కావేరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇప్పుడది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కావేరి ఎక్స్‌ప్రెస్‌లో రాత్రిపూట ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎడమ చెవిలో ఇయర్‌బడ్ సిలికాన్ టిప్ ఇరుక్కుపోయింది. దానిని తీయడానికి ఆయన ప్రయత్నించగా అది మరింత లోపలికి వెళ్లిపోయింది. దాంతో ఆ ప్రయాణికుడికి చెవి మూసుకుపోయినట్టుగా, కొద్దిగా మంటగా అనిపించింది. మెల్లగా ఆందోళన మొదలైంది. ఏం చేయాలో తెలియక కంగారు పడడం ఆయన వంతైంది. సహాయం కోసం ఆ ప్రయాణికుడు రైల్యే హెల్ప్‌లైన్ 139కి కాల్ చేశారు. తన సమస్యను వివరించారు.
అయితే తదుపరి స్టేషన్లో రైల్వే సిబ్బంది ఒక వైద్యుడితో సిద్ధంగా ఉన్నారు. రైలు రాగానే ప్రయాణికుడిని కలిశారు. ఆయన చెవిని పరీక్షించిన వైద్యుడు సిలికాన్ టిప్‌ను నొప్పి లేకుండా తొలగించారు. ఆ తరువాత వైద్యుడు, రైల్వే సిబ్బంది వెళ్లిపోయారు. ఈ అనుభవాన్ని సదరు ప్రయాణికుడు సోషల్ మీడియా యాప్ రెడ్డిట్‌లో పంచుకున్నారు. తనకు అర్ధరాత్రి వేళ కూడా వైద్య సహాయం అందించినందుకు రైల్వే సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ‘నాకు ఆ సమయంలో చాలా ఆందోళన కలిగింది. నా ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకోవాల్సి వస్తుందేమో అని భయం వేసింది. కానీ రైల్వే సిబ్బంది నాకోసం ముందుకొచ్చారు. నేను రాత్రివేళ సహాయం కోసం అభ్యర్థించినా వారు స్పందించారు. వైద్య సేవలను తక్షణమే అందించారు’ అంటూ ఆయన కొనియాడారు.
కాగా ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. వేగంగా స్పందించిన రైల్వే సిబ్బందిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం సేవలు అందిస్తున్నందుకు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ పోస్ట్‌ను భారతీయ రైల్వే అధికారిక ఖాతా కూడా రీపోస్ట్ చేసింది.
ప్రయాణ సమయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే రైల్వే హెల్ప్‌లైన్ 139కు కాల్ చేయాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. తమ సిబ్బంది వేగంగా సహాయం అందిస్తారని చెబుతున్నారు.
ఇవీ చదవండి
భర్తతో గొడవపడి బావిలోకి దూకిన భార్య.. చివరకు ఏం జరిగిందంటే!
99 ఏళ్ల వయసులో విమానంపై సాహసం.. గిన్నిస్ రికార్డు సృష్టించిన బామ్మ