Share News

99 ఏళ్ల వయసులో విమానంపై సాహసం.. గిన్నిస్ రికార్డు సృష్టించిన బామ్మ

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:50 PM

సాధారణంగా 99 ఏళ్లు బతకడమే కష్టం. ఒకవేళ బతికినా లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యే పరిస్థితి. అయితే బ్రిటన్‌కు చెందిన హెల్గా డఫీ మాత్రం విమానం గాల్లో ఉన్నప్పుడు దాని రెక్కలపై డేంజరస్ స్టంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

99 ఏళ్ల వయసులో విమానంపై సాహసం.. గిన్నిస్ రికార్డు సృష్టించిన బామ్మ
Guinness World Records

ఇంటర్నెట్ డెస్క్: వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించారు బ్రిటన్‌కు చెందిన 99 ఏళ్ల హెల్గా డఫీ. చిన్న విమానం రెక్కలపై వింగ్ వాక్ పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వయసులో వింగ్ వాక్ చేసిన మహిళగా గుర్తింపు పొందారు. గ్లౌసెస్టర్‌షైర్‌లోని సిరెన్‌సెస్టర్ సమీపంలో ఉన్న ఆర్‌ఎఫ్‌సీ రెండ్‌కోంబ్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ సాహసోపేత విమాన ప్రయాణం జరిగింది. ఎంతో ధైర్యం.. జాగ్రత్త అవసరమయ్యే ఈ విన్యాసాన్ని డఫీ విజయవంతంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 97 ఏళ్ల వయసులో వింగ్ వాక్ చేసి రికార్డు సృష్టించిన బెట్టీ బ్రోమేజ్ గురించి వార్తల్లో చూసిన డఫీకి ఈ సాహసం చేయాలనే ఆలోచన వచ్చింది. రెక్కలపై నడవడం ఒక విచిత్రమైన అనుభూతి అని ఆమె అభివర్ణించారు.


హెల్గా డఫీ సాధించిన ఈ ఘనత కేవలం గిన్నిస్ రికార్డుకే పరిమితం కాలేదు. ఆమె చేసిన సాహసం ద్వారా విల్ట్‌షైర్.. బాత్ ఎయిర్ అంబులెన్స్ స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు కూడా సేకరించారు. ఈ సంస్థ డఫీ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. ఆమె మేనకోడళ్లు జాకీ రోజ్, జూలీ ప్రీస్ ఈ అరుదైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. తమ దృష్టిలో డఫీ ఎప్పటినుంచో కొత్తగా, భిన్నంగా ఏదైనా చేయాలనే తపన ఉన్న స్వతంత్ర వ్యక్తి అని వారు తెలిపారు. ఏడుగురు పిల్లల్లో పెద్దదైన డఫీ, తన దివంగత తండ్రి ఈ విజయాన్ని చూసి ఎంతో గర్వపడేవారని భావించారు. ఈ కార్యక్రమం ద్వారా డఫీ 1,300 పౌండ్లకు పైగా విరాళాలు సేకరించినట్లు సంస్థ ప్రతినిధి సామ్ కాన్వే తెలిపారు. విమాన ప్రయాణం పూర్తయిన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ఆమెకు అధికారిక ధ్రువపత్రాన్ని అందజేశారు.


100 ఏళ్ల వయసులో మరోసారి రికార్డు కోసం ప్రయత్నం?

డఫీ సాధించిన రికార్డుపై గతంలో అదే ఘనత సాధించిన బెట్టీ బ్రోమేజ్ కూడా స్పందించారు. తన వారసురాలికి అభినందనలు తెలిపినప్పటికీ, ఆ రికార్డును తిరిగి సాధించాలనే ఆలోచనను సరదాగా వెల్లడించారు. ఇప్పటికే ఆరు వింగ్ వాక్‌లు పూర్తి చేసిన బ్రోమేజ్, తనకు 100 ఏళ్లు వచ్చినప్పుడు మరోసారి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. 99 ఏళ్ల వయసులోనూ తన కలను నిజం చేసుకున్న డఫీ కథ, ధైర్యానికి వయసు అడ్డంకి కాదనే సందేశాన్ని అందిస్తోంది.


ఈ వార్తలూ చదవండి

రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Updated Date - Oct 17 , 2026 | 08:58 PM