ధర్మ విజయ దర్శని... విజయదశమి
ABN , Publish Date - Oct 18 , 2026 | 10:47 AM
యుగయుగాలుగా అధర్మంపై ధర్మం విజయం సాధించిన చరితకు నిలువెత్తు దర్పణం విజయదశమి పర్వదినం.
యుగయుగాలుగా అధర్మంపై ధర్మం విజయం సాధించిన చరితకు నిలువెత్తు దర్పణం విజయదశమి పర్వదినం. భారతదేశంలో అత్యంత వైభవంగా, శ్రద్ధాసక్తులతో జరుపుకునే అతి పెద్ద హిందూ పండుగలలో ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.
ఆశ్వయుజ మాస శుక్ల పక్ష పాడ్యమి
నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా జరుపుకుని, పదో రోజున ‘విజయదశమి’ వేడుకను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో విభిన్న ఆచారాలతో జరుపుకునే ఈ పండుగ, సమాజానికి ఒక గొప్ప నైతిక సందేశాన్ని అందిస్తుంది. విజయదశమి వెనుక అనేక పురాణ గాథలు, చారిత్రక అంశాలున్నాయి.
మహిషాసుర మర్దనం: లోక కంటకుడైన మహిషాసురుడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి ముక్కోటి దేవతల శక్తుల కలయికతో దుర్గాదేవి ఆవిర్భవించింది. సింహవాహని అయిన ఆ తల్లి మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు హోరాహోరీగా పోరాడి, పదో రోజున (దశమి) అతడిని వధించి లోకాలను రక్షించింది. అందుకే ఆమెకు ‘మహిషాసురమర్దిని’ అనే పేరు వచ్చింది. ఆ విజయానికి గుర్తుగానే విజయదశమి జరుపుకుంటారు.
శ్రీరాముని విజయం: త్రేతాయుగంలో లంకేశ్వరుడైన రావణాసురుడు సీతమ్మను అపహరించినప్పుడు, శ్రీరాముడు రావణుడిపై దండయాత్ర చేశాడు. ఈ విజయదశమి రోజునే రాముడు రావణుడిని సంహరించి విజయం సాధించాడని రామాయణం చెబుతోంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజున రావణ దహనం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఇదే.
అర్జునుని శమీ పూజ: ద్వాపర యుగంలో పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాత వాసం చేశారు. అజ్ఞాతవాస సమయంలో తమ ఆయుధాలను విరాటరాజు రాజ్య పొలిమేరలలో ఉన్న ఒక జమ్మి (శమీ) చెట్టుపై దాచిపెట్టారు. అజ్ఞాతవాసం ముగిసిన రోజైన విజయదశమి నాడు, అర్జునుడు జమ్మి చెట్టు నుంచి ఆయుధాలను తీసి, వాటికి పూజ చేసి, కౌరవ సైన్యంపై విజయం సాధించాడు.
దేవీ నవరాత్రుల వైభవం
విజయదశమికి ముందు వచ్చే తొమ్మిది రోజులు దుర్గాదేవిని రకరకాల రూపాల్లో అలంకరించి పూజిస్తారు. ఈ రూపాలన్నీ యుగయుగాలుగా అధర్మబద్ధులైన అసురులను అణచిన ఆ తల్లి అవతారాలే. తెలుగు రాష్ర్టాలలో ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతాయి. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. బాలాత్రిపురసుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపురసుందరి, మహాచండీ, సరస్వతి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి వంటి రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఆ రోజు అక్షరాభ్యాసాలు చేయడం విశేషంగా భావిస్తారు. విజయదశమి రోజున కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు పాటిస్తుంటారు.
శమీ పూజ (జమ్మిచెట్టు పూజ): విజయదశమి సాయంత్రం గ్రామాల్లో, నగరాల్లో ప్రజలందరూ జమ్మి చెట్టు ఉన్న చోటుకు చేరుకుని పూజలు చేస్తారు. శమీ వృక్షాన్ని దర్శించుకుని, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ...’’ అనే శ్లోకాన్ని పఠిస్తూ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. జమ్మి ఆకులను ఇంట్లోని పూజా మందిరంలో లేదా నగదు దాచే పెట్టెల్లో ఉంచితే శుభం జరుగుతుందని నమ్మకం.
పాలపిట్ట దర్శనం: విజయదశమి రోజున పాలపిట్టను చూడటం శుభప్రదంగా భావిస్తారు. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు వారికి పాలపిట్ట కనిపించి విజయ సంకేతాన్ని ఇచ్చిందని పురాణగాథ. అందుకే దసరా నాడు పాలపిట్టను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
ఆయుధ పూజ (వాహన పూజ): ఈ రోజున వృత్తి పనివారలు తమ పనిముట్లను, వ్యాపారస్థులు తమ ఖాతా పుస్తకాలను, సైనికులు తమ ఆయుధాలను, సామాన్యులు తమ వాహనాలను శుభ్రం చేసి పూజిస్తారు. తాము చేేస వృత్తి పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను చాటుకునేందుకు ఇది ఒక గొప్ప సందర్భం. కొత్త వ్యాపారాలు, పనులు ప్రారంభించడానికి ఈ రోజు అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. విజయదశమి నాటి ‘ఈశాన్య దిక్కు’ ప్రయాణం విజయాలను చేకూరుస్తుందని నమ్మకం. అయితే విజయదశమికి ముందు రోజున మహర్నవమి నాడు ఆయుధపూజ ప్రత్యేకంగా జరుగుతుంది. అదే పూజ కొందరు విజయదశమి నాటి ఉదయం కూడా జరుపుకుంటుంటారు.
విజయదశమి బాహ్యమైన సంబరాలకు, పూజలకు మాత్రమే పరిమితమైనది కాదు. దీని వెనుక గొప్ప అంతరార్థం ఉంది. మానవుడిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను, అహంకారాన్ని (రాక్షస ప్రవృత్తిని)
అణచివేసి... దైవచింతన, ధర్మం, న్యాయం అనే సద్గుణాలను పెంపొందించుకోవడమే నిజమైన విజయదశమి. చెడు ఎంత శక్తివంతమైనదైనా, తాత్కాలికంగా ఎంత ప్రభావం చూపినా... అంతిమంగా విజయం మాత్రం సత్యానిదే, ధర్మానిదే అని ఈ పండుగ చాటి చెబుతుంది. విజయదశమి అనేది భారతీయుల సాంస్కృతిక వైభవానికి, సంప్రదాయాల రక్షణకు నిదర్శనం. ‘విజయం’ సాధించాలనే సంకల్పాన్ని ఇచ్చే ఈ పర్వదినం మానవాళికి ఎప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుంది.
శ్రీమల్లి 98485 43520