మూడ్‌ను మార్చే పరిమళాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 09:30 AM
తాజా పరిమళం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. ఆ పరిమళం ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది.
తాజా పరిమళం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. ఆ పరిమళం ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. మానసిక అలసటను దూరం చేసి, ప్రశాంతతను అందించడంలో రకరకాల పరిమళాలు తోడ్పడతాయి. ఇంట్లోనే అరోమాథెరపీ అందించేందుకు డిఫ్యూజర్లు ఉంటే చాలు. వాటి నుంచి వెలువడే సువాసనలు ఇళ్లంతా పరుచుకుంటాయి. అలాంటి డిఫ్యూజర్ పరిమళాల విశేషాలవి...
ఆధునిక జీవనం ఉరుకులు పరుగులతో, డెడ్లైన్లతో, డిజిటల్ ఆటంకాలతో సతమతమవుతోంది. చాలామంది ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. దీనికి అరోమాథెరపీ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు. మొక్కల నుంచి తీసిన నూనెలను డిఫ్యూజర్‌లో వేసి ఇంట్లో పరిమళాలు వెదజల్లేలా చేసుకోవచ్చు.
విశ్రాంతికి సరైనది...
ప్రశాంతతను అందించడంలో ‘లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్’ను మించింది లేదు. అరోమాథెరపీ నూనెలలో అత్యంత ప్రాచుర్యం పొందిన నూనె ఇది. దీని పరిమళం ఒత్తిడిని ఇట్టే తగ్గిస్తుంది. మెదడుకు విశ్రాంతి లభించేలా చేయడంలో సహాయపడుతుంది. నిద్రకు ముందు లావెండర్ పరిమళం పీలిస్తే, మానసిక ప్రశాంతత లభించి నిద్రలోకి జారుకోవడానికి సాయపడుతుంది. సాయం వేళల్లో లావెండర్ ఆయిల్ డిఫ్యూజర్‌ను ఉపయోగించాలి. చామంతి, దేవదారు నూనెలతో కలుపుకొని కూడా ఉపయోగించొచ్చు.
పడకగదిలో ప్రశాంతత
రాత్రి బెడ్‌పైకి చేరుకున్నాక నిద్రపట్టక ఇబ్బంది పడటం చాలామంది ఎదుర్కొనే సమస్యే. రకరకాల ఆలోచనలతో మనసంతా డిస్టర్బ్‌గా ఉంటుంది. అలాంటివారు పడకగదిలో చామంతినూనె వేసిన డిఫ్యూజర్‌ను ఉపయోగిస్తే అద్బుతమైన ఫలితం కనిపిస్తుంది. దీనివల్ల పడకగదిలో నిద్రకు అవసరమైన వాతావరణం ఏర్పడిందన్న భావన కలుగుతుంది. వెంటనే నిద్రలోకి జారుకుంటారు. మానసిక ప్రశాంతతను అందించడంలో చామంతి నూనెను మించింది లేదు. పడకగదిలో ప్రశాంతమైన వాతావరణం కోసం ఇది బెస్ట్ ఆప్షన్.
ధ్యానానికి అనుకూలం
సాధారణంగా గంధం వాసన మనసుకు ఎంతో హాయినిస్తుంది. శుభకార్యాలు, పూజా కార్యక్రమాల్లో గంధం వినియోగం ఎక్కువగా ఉంటుంది. గంధం చెక్క నుంచి తీసిన నూనెను డిఫ్యూజర్‌లో వేసి ధ్యానం చేసే సమయంలో వినియోగించొచ్చు. ఈ సువాసన మానసిక ఆలోచనలను స్థిమితం చేస్తుంది. మానసిక విశ్రాంతిని అందిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శాండల్‌వుడ్ డిఫ్యూజర్స్ను వాడుతుంటారు. ఈ పరిమళంతో ధ్యానానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ధ్యాన కేంద్రాలలో వాడటం మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఆఫీసులో పని ఒత్తిడితో అలసిపోయి, ఇంటికి చేరుకున్నాక శాండల్ డిఫ్యూజర్ ఆన్ చేసి రిలాక్స్ అయితే మంచి ఫలితం ఉంటుంది.
ఆద్యంతం ఉల్లాసభరితం...
ఉల్లాసాన్ని, ప్రశాంతతను అందించడంలో బెర్గమోట్ ఆయిల్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. బెర్గమోట్ను బేరిపండు, పుల్ల నారింజపండు అని పిలుస్తారు. ఈ నూనె నుంచి వెలువడే తాజా సిట్రస్ పరిమళాలు ఒత్తిడిని దూరం చేసి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. సాయంకాలం వేళ ఈ పరిమళాలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది. లివింగ్‌రూమ్‌లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
దేవదారు... తీరే వేరు
సెడార్వుడ్ ఆయిల్... తెలుగులో దేవదారు నూనె అంటారు. తాజా చెక్క వాసనను వెదజల్లే సెడార్వుడ్ ఆయిల్ డిఫ్యూజర్ విశ్రాంతి మోడ్‌లోకి తీసుకెళుతుంది. వెంటనే నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. ధ్యానం చేసుకునే సమయంలో ఈ డిఫ్యూజర్‌ను వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ నూనెలో ఉండే సహజ సమ్మేళనాలు మనసుకు, శరీరానికి విశ్రాంతి లభించేలా ప్రోత్సహిస్తాయి. దీని సువాసనలు మెదడును నెమ్మదిగా నిద్రపుచ్చుతాయి.
భావోద్వేగాల సమతులం
ఆకు సంపంగి నూనెను రిలాక్సేషన్ కోసం అరోమాథెరపీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తియ్యటి పరిమళాలు వెదజల్లే ఆకు సంపంగి నూనె పరిమళంతో భావోద్వేగాలు సమతుల్యమవుతాయి. ఒత్తిడి దూరమవుతుంది. రాత్రుళ్లు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ డిఫ్యూజర్‌ను వాడటం మంచి ఎంపికగా చెబుతారు. ఆకు సంపంగి నూనె పరిమళాలు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ దూరమవుతాయి. మూడ్ బూస్టర్‌గా ఉపయోగపడుతుంది. ఈ సువాసనలు రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
డీప్ రిలాక్సేషన్...
వెటివర్ అనేది ఒక సుగంధ మొక్క. దీనినుంచి సేకరించిన నూనె వెదజల్లే పరిమళాలు డీప్ రిలాక్సేషన్‌ను అందిస్తాయి. ఆలోచనల అలజడిని తగ్గించడంలో ఈ పరిమళం బాగా ఉపకరిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్నవారు పడకగదిలో వెటివర్ ఆయిల్ డిఫ్యూజర్‌ను వాడితే మంచి ఫలితం ఉంటుంది.
మూడ్‌ను మార్చేస్తుంది
మల్లెల గుబాళింపు మూడ్‌ని మార్చేస్తుందన్న విషయం తెలిసిందే. అరోమాథెరపీలో జాస్మిన్ ఆయిల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భావోద్వేగ ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ఈ పరిమళం బాగా ఉపయోగపడుతుంది. రిలాక్సేషన్‌తో పాటు ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం జాస్మిన్ డిఫ్యూజర్‌ను వాడతారు. ఈ సువాసన నరాల వ్యవస్థను శాంతపరుస్తుంది.
ఆధ్యాత్మిక పరిమళం
శతాబ్దాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సాంబ్రాణి వాడకం ఉంది. సాంబ్రాణి పరిమళం ఇంటి వాతావరణాన్ని ఆధ్యాత్మికమయం చేస్తుంది. ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్‌ను తెలుగులో సాంబ్రాణి నూనె అని పిలుస్తారు. ఈ నూనెను డిఫ్యూజర్‌లో వాడటం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. మనసుకు ఉల్లాసం కలుగుతుంది. ఈ సువాసన వల్ల శ్వాసపరమైన సమస్యలు తొలగిపోతాయి. ముక్కు దిబ్బడ పోతుంది.
ఏకాగ్రత, చురుకుదనం...
పుదీనా వాసన ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది. మానసిక అలసటను దూరం చేస్తుంది. దీన్ని పెప్పర్మెంట్ ఆయిల్ అని పిలుస్తారు. ఈ నూనెను డిఫ్యూజర్‌లో ఉపయోగించడం వల్ల వెలువడే పరిమళాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. ఈ సువాసనలు ముక్కు దిబ్బడను తగ్గిస్తాయి. ఇంట్లో కీటకాల బెడద తగ్గిపోతుంది. మూడుచుక్కల పెప్పర్మెంట్ ఆయిల్ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది.
నొప్పుల నుంచి ఉపశమనం
‘రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్’ను ఇంట్లో లేదా ఆఫీసులో ఉపయోగించడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జ్ఞాపకశక్తికి అవసరమైన ఎసిటైల్కోలిన్ రసాయన విచ్ఛిన్నాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజ్మేరీ అరోమాథెరపీ శరీరంలోని ప్రధాన స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజ్మేరీని ఆక్యుప్రెషర్‌తో కలిపి ఉపయోగించినప్పుడు నొప్పి 30 శాతం వరకు తగ్గినట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
మంచి పరిమళం గది వాతావరణాన్ని మారుస్తుంది. డిఫ్యూజర్లు సువాసనను నిరంతరంగా విడుదల చేస్తాయి, దీంతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
ఇంట్లో మంచి పరిమళాలను వెదజల్లడమే కాకుండా, కొన్ని ఆయిల్స్ గాలి నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. అలా్ట్రసోనిక్ డిఫ్యూజర్లు గాలిలో తేమను పెంచుతాయి.
అరోమాథెరపీలో పరిమళాల సహాయంతో ఒత్తిడిని తగ్గించడం, మానసిక స్థితిని మెరుగుపరచడం, నిద్రకు సహాయపడడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. సరైన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను డిఫ్యూజర్‌లో ఉపయోగించడం ద్వారా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.
ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉండే పరిమళంలాగే మంచి పరిమళాలను వెదజల్లే నూనెలను డిఫ్యూజర్‌లో వాడటం వల్ల ఇంట్లోనూ విలాసవంతమైన వాతావర ణం ఏర్పడుతుంది.
ఇలా వాడాలి...
గది పరిమాణాన్ని బట్టి డిఫ్యూజర్‌లో మూడు నుంచి ఆరు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి.
నిద్రపోవడానికి అరగంట ముందు డిఫ్యూజర్‌ను ఆన్ చేసుకోవాలి. సువాసన గది అంతటా వ్యాపించడానికి ఈ సమయం సరిపోతుంది.
ఒక్కటే నూనె కాకుండా రెండు లేదా అంతకన్నా ఎక్కువ నూనెలను కలపడం ద్వారా చక్కని పరిమళం వచ్చేలా చేసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు
Read Latest AP News And Telangana News And International News And Telugu News