Share News

ఆరోగ్య చింతామణి

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:40 PM

తెలుగులో బడాచోర్‌ అనదగిన వ్యక్తిని, అవతలివారికి అర్థం కాకుండా ఉండేందుకు బటానీ అంటారు.

ఆరోగ్య చింతామణి
Green Peas Batani, Health

తెలుగులో బడాచోర్‌ అనదగిన వ్యక్తిని, అవతలివారికి అర్థం కాకుండా ఉండేందుకు బటానీ అంటారు. ‘‘లో లొటారం పై బటారం’’ అనే సామెతలో కనిపించే ‘బటారం’ అనే పదానికి పెద్దది, గొప్పది అనే అర్థం ఉంది. దీన్ని బట్టి బటానీ అంటే, పైకి ఉత్తముడు అని వినిపిస్తుంది గానీ అంతరార్థం పెద్ద దొంగఅని!

నిజానికి బటానీలు చిన్నవేగానీ, లోపల చాలా శక్తివంతమైనవి. అందుకని బటానీ పేరు ఈ దుష్ట అర్థం తగలకుండా మనవాళ్లు కొద్దిగా మార్చి బఠానీ అంటుంటారు. పోర్చు గీసు మూలాలు ఈ బటానీ పేరు పుట్టటానికి కారణం కావచ్చు. మధ్యధరాసముద్ర తీర ప్రాంతాల్లో వేల ఏళ్ళ నుంచి దీన్ని పండి స్తున్నా, మనకు 7, 8 వందల ఏళ్ళ నుంచి మాత్రమే అలవాటైన ఆహార ద్రవ్యమిది.

హిందీలో దీనిని మటర్‌ అంటారు.మరాఠీలో వటానా, తమిళంలో పటానీ, తెలుగు, కన్నడ, తుళు భాషలలో బఠానీ అనే పేర్లు ప్రాచు ర్యంలో ఉన్నాయి. రేణుక, ముండచణక, కలాయ అనే పేర్లతో వైద్య గ్రంథాల్లో బఠానీ వివరాలున్నాయి. ఎర్రశనగలు ఎండితే ముడ తలు పడతాయి. అయితే బఠానీ గింజలు గుండ్రంగా, బోడిగుండులాగా నునుపుగా ఉంటాయి. అందుకే వాటిని ముండ చణక (గుండు శనగలు) అని పిలిచారు. గ్రీన్‌ పీ అని ఆంగ్లంలో పిలిచే ఈ గింజల్ని పైసమ్‌ సెటైవం అంటారు. తెలివైన రైతులు అంతర పంటగా బఠానీలను పండిస్తారు ఈ మొక్క నేలలో నత్రజనిని స్థిరీకరిస్తుందని!


మన దేశంలో బఠానీ విస్తారంగా పండు తోంది. కానీ, సామాన్యుడికన్నా ధనాధికులే ఎక్కువగా వాడుతున్నారు. లేత ఆకుపచ్చ బఠానీ కాయల్లో ప్రోటీన్లు, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. చిక్కుడు కాయల్లాగానే బఠానీ కాయల్ని కూడా కాయ తోలుతో సహా వండుకుంటే తగినంత ఫైబర్‌ కలసిన ప్రొటీన్లు తీసుకోవటానికి వీలవుతుంది. కాయల్ని వలిచి లోపలి బఠానీ గింజల్ని తీసి ఆకుపచ్చరంగు నీళ్ళలో నానబెట్టి కూరగాయల మార్కెట్లో అమ్ముతుంటారు. అలాంటి విషపూరితమైన గింజల్ని కొనాల్సిన అవసరం లేదు. లేత బఠానీ కాయల్ని కొనుక్కొని తరిగి కూరగా వండుకోవటం ఉత్తమం.


book7.2.jpg‘‘పొలానికి ఎరువుగా, కంటికి మేలుచేసేదిగా, కండరాలకు బలకరంగా, ఆహార పీచుద్వారా పేగులకు శక్తిదాయకంగా పనిచేసే బఠానీ గురించి మనం ఆలోచించాల్సింది చాలా ఉంది.

ఆకుపచ్చ బఠానీలో పిండి పదార్థాలు ప్రొటీన్లు దండిగా ఉండటాన తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. చలవనిస్తాయి. అరి కాళ్లు అరిచేతులూ మంటలు తగ్గుతాయి. తేలికగా అరుగుతాయి. నీటిని పీల్చుకునే గుణం కలిగి ఉంటాయి. అందుకని విరేచనాల వ్యాధిలో నీటి శతాన్ని తగ్గిస్తాయి. ఇతరఆహార ద్రవ్యాలతో కలిపి వండుకుని తినటం వలన రుచిని పెంచుతాయి. పుష్టినిస్తాయి. ఎదిగే పిల్లలకు ఇవి శరీరనిర్మాణానికి బాగా సహకరిస్తాయి.


100 గ్రాముల లేత బఠానీలో సుమారు 5 గ్రాముల వరకు ప్రొటీన్‌ ఉంటుంది. అందువల్ల శాకాహారుల కోసం ఇది మంచి ప్రొటీన్‌ మూలం. నేటి కాలంలో పీ ప్రొటీన్‌ పేరుతో ఈ ఆకుపచ్చ బఠానీల పౌడర్లను బాగా అమ్ముతున్నారు.

వయస్సు పెరిగేకొద్దీ వచ్చే దృష్టి సమస్యలను తగ్గించడంలో ఇవి తోడ్పడతాయి. కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలో బఠానీల పాత్రపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఆహార పీచు బఠానీ గింజల్లో కన్నా కాయ తొక్కుల్లో ఎక్కువగా ఉంటుంది. గింజల్ని మాత్రమే తిన్నందువలన తీపి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, షుగరు రోగులకు హానికారకం. కడుపు ఉబ్బరం కూడా కలిగించవచ్చు. వాతవ్యాధుల్ని పెంచే అవకాశం ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుకొని దీన్ని వాడితే మంచిది.

  • డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

షారుక్‌ నా ఫస్ట్‌ క్రష్‌

బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 12:40 PM