Share News

పోగు చేయాల్సింది.. డబ్బు కాదు జ్ఞాపకాల్ని!

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:05 PM

ఉన్నది ఒకటే జీవితం... అది తెలిసి కూడా ప్రతీ ఒక్కరూ, ప్రతీరోజూ పరుగుల యంత్రంగా మారుతున్నారు. మరోవైపు క్యాలెండర్లలో పేజీలు మారుతున్నాయి.

పోగు చేయాల్సింది.. డబ్బు కాదు జ్ఞాపకాల్ని!
Lifestyle

ఉన్నది ఒకటే జీవితం... అది తెలిసి కూడా ప్రతీ ఒక్కరూ, ప్రతీరోజూ పరుగుల యంత్రంగా మారుతున్నారు. మరోవైపు క్యాలెండర్లలో పేజీలు మారుతున్నాయి. సంపాదనలో పడి, జీవితాన్ని ఆస్వాదించడమే మరచిపోతున్నారు చాలామంది. ‘రిటైరయ్యాక అన్నీ చేద్దాం’ అనుకుంటారు... కానీ అప్పుడు డబ్బు, సమయం ఉన్నా, శరీరం సహకరించకపోవచ్చు. అందుకే ‘పోగు చేయాల్సింది డబ్బు కాదు... జ్ఞాపకాల్ని’ అంటోంది ‘డై విత్‌ జీరో’ జీవన విధానం. జీవితాన్ని సరికొత్తగా ఆవిష్కరించే ఈ నయా జీవనమంత్రం ఏమిటో చూద్దాం...

  • మానస, ఆదర్శ్‌ల పెళ్లయ్యి ఇరవై ఏళ్లు. ఈ సందర్భంగా ఒక లాంగ్‌ట్రిప్‌ వేద్దామని మానస కోరింది. ‘ఆఫీసులో అన్ని రోజులు సెలవు దొరకదు... రిటైరయ్యాక వెళదామ’ని పోస్ట్‌పోన్‌ చేశాడు ఆదర్శ్‌.

  • ‘ముంబయిలో ఫ్లాట్‌ కొనుక్కోవాలని అనుకుంటున్నా. ఓ ఇరవై లక్షలు సర్దుబాటు చేస్తారా?’ అని హైదరాబాద్‌లో నివసిస్తున్న తండ్రిని అడిగాడు సాకేత్‌. ‘నా తదనంతరం ఈ ఇల్లు, ఆస్తి అంతా నీదేగా..’ అని దాటవేశాడు తండ్రి.

  • డబ్బు సంపాదనే ధ్యేయంగా అహోరాత్రులు శ్రమించి, పెద్ద పారిశ్రామికవేత్తగా మారాడు భిక్షపతి. అయితే ఈ బిజీలో పడిపోయి, వెనక్కి తిరిగి చూసుకునే సరికి డెబ్భై ఐదేళ్లొచ్చాయి. ఎప్పటినుంచో ప్రపంచమంతా తిరగాలనే ఆయన కోరికకు ఒకరోజు గుండెపోటు పుల్‌స్టాప్‌ పెట్టింది.


సందర్భాలు వేర్వేరుగా అనిపిస్తున్నా... కాస్త జాగ్రత్తగా గమనిస్తే... ఓ పనిని వాయిదావేయడం కనిపిస్తుంది. మొదటి దాంట్లో ఉద్యోగ విరమణ, రెండు, మూడు అంశాల్లో మరణం ప్రధాన పాత్ర పోషించాయి. అంటే చాలామంది మధ్య వయసు నుంచే ఆనందంగా సెలవులు గడపడాన్ని, డబ్బు ఖర్చుపెట్టడాన్ని వాయిదా వేస్తున్నారు. పదవీ విరమణ తర్వాతే ప్రణాళికలు రచిస్తున్నారు. అన్నీ చేయాలని కలలుగంటున్నారు. అయితే తమ ప్రణాళికలు, కలలు సాకారం చేసుకోవాలనుకునే ముందు... ఎంతకాలం జీవిస్తారనేది ఎవరు చెప్పగలరు? సుదూరంలో ఉన్న రోజుల గురించి కాకుండా... ఈ క్షణంలో జీవిస్తూ, మంచి అనుభవాలను, జ్ఞాపకాలను పెంచుకోవాలని... దానికి డబ్బు ఓ సాధనంగా మారాలంటోంది ‘డై విత్‌ జీరో (డీడబ్ల్యుజెడ్‌)’ జీవన విధానం.


వృథానే కదా?

అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బిల్‌ పెర్కిన్స్‌ రాసిన పుస్తకమే ‘డై విత్‌ జీరో’. ‘జీవితమంతా కష్టపడుతూ ఒక్కో పైసా కూడబెట్టారు. ధనవంతులయ్యారు. ఆఖరుకు ఆ డబ్బును ఖర్చుపెట్టకుండానే పోతే... ఆ డబ్బు వృథాతో పాటు, మీ కష్టానికీ ఫలితం లేకుండా పోయిందనేగా’ అంటూ బిల్‌ పెర్కిన్స్‌ కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.

జీవితాన్ని యువ, మధ్య వయసు, వృద్ధాప్యం అని మూడు దశలుగా విభజిస్తే, ‘సమయాని’కి సంబంధించి మిలియనీర్‌ యువకుడు. ఆరోగ్యం ఉంటుంది, కానీ డబ్బు ఉండదు. అదే నడివయస్కుల చెంత ఆరోగ్యం, సంపద ఉంటాయి. కానీ సమయం ఉండదు. అదే వృద్ధాప్యంలో సంపద, సమయం ఉంటుంది కానీ ఆరోగ్యం సహకరించదు. అందుకే ఈ దశలను బట్టే జీవితాన్ని మలుచుకోవాలన్నది ఈ నయా ఫిలాసఫీ. అన్నీ రిటైరయ్యాకే అంటే... అప్పుడు వృద్ధాప్యం వల్ల ఏమీ చేయలేరు. అందుకే చిన్న వయసు నుంచే జీవితాన్ని అనేక అనుభవాలతో పరిపుష్టం చేసుకోవాలని ఈ పుస్తకం ప్రేరేపిస్తోంది.


book6.8.jpgతొమ్మిది నియమాలివే...

పుట్టిన ప్రతీ మనిషి గిట్టక మానరు. ఈ భూమ్మీద ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదు. అందుకే సంపాదించే ప్రతీ పైసను అర్థవంతంగా ఆస్వాదిస్తూ జీవించేలా ఈ పుస్తకం కొత్త పాఠాల్ని నేర్పిస్తుంది. డబ్బును జీవైకశక్తిగా పేర్కొనే బిల్‌ పెర్కిన్స్‌ ఈ పుస్తకంలో అందుకోసం తొమ్మిది నియమాలను ప్రతిపాదించారు.

  • పాజిటివ్‌ జీవితానుభవాలను పెంచుకోవాలి: అందరమూ బతకాలి. ఓ చెట్టులా, ఓ పక్షిలా, ఓ జంతువులా కాకుండా మనిషిలా బతకాలి. మీకు ఏం చేస్తే సంతోషం కలుగుతుందో తెలుసుకుని ఆ పని చేయండి. యాత్రలు, పర్యటనలు, కొత్త అలవాట్లు, అల్లికలు, భాషలు నేర్చుకోవడం... లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. దీనికి డబ్బును ఖర్చుపెట్టండి. నెట్‌వర్త్‌ను పెంచుకోవాలనే కాకుండా... అనుభూతుల్ని పెంపొందించుకోవడానికి ప్రతీ ఒక్కరూ ప్రయత్నించాలి.


book6.jpg

  • చిన్న వయసులోనే ఇన్వెస్ట్‌ చేయాలి: పెద్ద కారు కొనాలి, బంగ్లా కట్టుకోవాలి, పిల్లలు ప్రసిద్ధ విద్యాసంస్థల్లో చదువుకోవాలి... దీనికంతా చాలా డబ్బు కావాలి. కాబట్టి, ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేసి, డబ్బు సంపాదించాలనే తపన ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇవన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది. అంతవరకు మీరు జీవించడం మానుకోరాదు. అందుకే చిన్న వయసు నుంచే అనుభూతులను పొందడం గురించి దృష్టిపెట్టాలి.

  • సున్నా బ్యాలెన్స్‌ అన్నదే లక్ష్యం: పొదుపు చేయడం ఓ అలవాటుగా ఉండాలి. కానీ చాలామంది అదో నియమంగా ఫాలో అవుతారు. తమ గురించి మర్చిపోతారు. ఉద్యోగం అంటే గౌరవం, రోజూ ఆఫీసుకు ఎంతో హుషారుగా కూడా వెళుతున్నారు. అచ్చం ఇలాగే ఎవరికి వారు తమ కోసం డబ్బును ఖర్చుపెట్టడానికి వెనకాడొద్దు. ఎప్పటికప్పుడు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను ఇష్టమైన వాటి కోసం ఖర్చుపెడుతుంటే... జీరో బ్యాలెన్స్‌ను సాధించవచ్చు.


  • అన్ని సాధనాలను ఉపయోగించాలి: ఇప్పుడే అంతా ఖర్చుపెడితే రిటైరయ్యాక చేతిలో డబ్బు ఉండదు. అనారోగ్యం దరిచేరితే ఎలా? ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది. డబ్బులేకపోతే ఎలా?... ఈ ప్రశ్నలు ఎవరికైనా వస్తాయి. అయితే. ప్రస్తుతం సైన్స్‌ బాగా అభివృద్ధి చెందింది. మనం ఎంతకాలం జీవించగలమనేది వివిధ సాధనాల ఆధారంగా తొందరగానే పసిగట్టవచ్చు. దాని ఆధారంగా ‘ఆర్థిక ప్రణాళిక’ చేసుకోవాలి. అలాగే కుటుంబానికంతా జీవిత బీమా చేయిస్తే, టెన్షన్‌ లేకుండా ఉంటుంది. ‘డైయింగ్‌ విత్‌ జీరో’ అనేది డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదు... సమయానికి సంబంధించింది కూడా. భూమ్మీద మీ సమయం, డబ్బు, జీవనశక్తిని సరిగా ఉపయోగించుకుంటేనే చివరి దశల్లో పశ్చాత్తాపం ఉండదు.


book6.5.jpg- ఎక్కువ అవసరం ఉన్నప్పుడే...: ‘జీవితమంతా కష్టపడి బాగా సంపాదించాను. పిల్లలు హాయిగా జీవించేంత ఆస్తులు కూడబెట్టాన’ని సంబరపడకండి. మీ తర్వాత వారసత్వంగా ఆ ఆస్తంతా పిల్లలకు చెందుతుంది. అంటే అప్పుడు మీ పిల్లలు 50ల్లోకి వచ్చి ఉండవచ్చు. వాళ్లకు వాళ్లే సొంతంగా ఇల్లు, కారు అన్నీ సమకూర్చుకొని, స్థిరపడి ఉండొచ్చు. అందుకే మీ తదనంతరం సంక్రమించే డబ్బువల్ల పిల్లలకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అదే వాళ్లు 30లలో ఉన్నప్పుడు మీరు ఇవ్వదలచుకున్న డబ్బు ఇస్తే పిల్లలు ఇల్లు కొనడానికి, వ్యాపారం చేయడానికి ఉపయోగపడి... వారి జీవితాలను మార్చేస్తుంది. అలాగే విరాళాలు కూడా. మరణానంతరం ఫలానా సంస్థకి ఇంత అని కాకుండా, మీరే స్వయంగా అక్కడికి వెళ్లి చెక్కు అందించండి. జీవితకాలంలోనే ఇవన్నీ చేయడం వల్ల చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తాయి. అంతేకాదు మరణించే నాటికి మీ పేరు మీద స్థిరాస్తులు ఉండవు.


  • ఆటోపైలెట్‌ మోడ్‌ కాదు: ఇరవై రెండేళ్లకు ఉద్యోగం, పాతికేళ్లకు పెళ్లి, అరవై ఏళ్లకు రిటైర్మెంట్‌... ఇదంతా మామూలే. మా నాన్నగారు కూడా ఇలాగే చేశారు, నేనూ అంతేనని ఫిక్స్‌ అవ్వకండి. మీ వయసు ఎంత? ఆరోగ్యస్థితి ఏమిటి? పదేళ్ల తరవాత ఆరోగ్యం ఎలా ఉండబోతోంది? ఇప్పటిదాకా మీకోసం మీరు ఏమి చేశారు? మీ ఇష్టాలు ఏమిటి? కొత్తగా డ్యాన్స్‌ నేర్చుకోవాలని ఉందా? సైక్లింగ్‌ క్లబ్‌లో చేరాలని అనుకుంటున్నారా? హిమాలయాలకు వెళ్లాలనే చిన్నప్పటి కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించారా? ఇవన్నీ మీతో మీరు కూర్చుని సంభాషించుకోవాల్సిన విషయాలు. ఇలా నచ్చిన పనులు చేయడం వల్ల జీవితం అందించే ఆనందం వేరు. అందుకే జీవితాన్ని ఆటోపైలెట్‌ మోడ్‌లో కాకుండా... నచ్చిన విధంగా మలచుకోవాలి.


book6.6.jpg

  • కాలాల వారీగా జీవితాన్ని విభజించండి: ఒకవేళ మీ వయసు 40 ఏళ్లు అయితే.. 40 - 45, 45 - 50, 50- 55.. ఇలా 70 ఏళ్ల వరకూ ఓ పట్టిక వేసుకోండి. ప్రతీ అయిదేళ్లనూ ఓ టైమ్‌బకెట్‌లా తీసుకుని ఆ సమయంలో మీరు చేయదలచుకున్న పనులను రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఏమి చేయదలచుకున్నారో స్పష్టంగా రాసిపెట్టుకుని, ఆయా దశల వారీగా వాటిని చేయడానికి సంకల్పించుకున్నట్టు అవుతుంది. హిమాలయాలకు వెళ్లాలనే లక్ష్యాన్ని నలభైలలో తీర్చేసుకుంటే, డెబ్బైలలో ఆ జ్ఞాపకాలతో హాయిగా బతికేయవచ్చు.


  • సంపద సృష్టిని ఎప్పుడు ఆపాలో తెలుసుకోవాలి: మనిషి జీవితంలో 45 నుంచి 60 ఏళ్ల కాలాన్ని ‘గోల్డెన్‌ ఇయర్స్‌’గా పేర్కొంటారు. మామూలుగా రిటైరయ్యే వరకు సంపదను సృష్టించడం మామూలే. అయితే బ్యాంక్‌ బ్యాలెన్స్‌లో అత్యున్నత స్థితికి వెళ్లినప్పుడు సంపదను పోగుచేయడం మానేసి, డబ్బును ఖర్చు పెడుతూ జ్ఞాపకాలను పెంచుకోవాలి. ఇదే గోల్డెన్‌ ఇయర్స్‌లో మన సంతోషం కోసం మనం పెట్టే పెద్ద పెట్టుబడి.

  • తక్కువ నష్టం ఉన్నప్పుడే పెద్ద రిస్కులు చేయాలి: మీ వయసు పాతికేళ్లు. ఓ బిజినెస్‌ మొదలుపెట్టారు. అనుకోని విధంగా నష్టం చేకూరింది. కానీ మళ్లీ వేరేది ప్రారంభించి, ఎదగడానికి మీకు చాలా సమయం ఉంది. ఇది వ్యాపారాలకే కాదు... కొత్త నగరాలకు వలస వెళ్లడానికి. జీవితానికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి చిన్న వయసు అన్నది కరెక్ట్‌ సమయం. అదే యాభై ఏళ్ల వయసులో ఆర్థికంగా రిస్క్‌ తీసుకోవడం సరైన నిర్ణయం కాదు.


book6.7.jpgబిల్‌ పెర్కిన్స్‌ సూచించే ‘డై విత్‌ జీరో’ వినడానికి బాగానే అనిపిస్తుంది. అయితే దీన్ని ఆచరించడం కూడా సులభమే. కానీ కొంతమంది ‘రేపు లేదు’ అనే ధోరణితో, ఈరోజే విచ్చలవిడిగా ఖర్చు పెడితే మొదటికే మోసం వస్తుంది. ఎంతకాలం బతుకుతామన్నది తెలియనప్పుడు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ జీరో చేసుకోవడం వల్ల, వృద్ధాప్యంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి కదా. అలాగే పిల్లలకి చిన్నప్పుడే అన్నీ పంచేస్తే ఇక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకుంటారా? ఇలా ‘డై విత్‌ జీరో’ లేవనెత్తే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ‘మనందరికీ చీమ, గొల్లభామ కథ తెలుసు.


వేసవిలో చీమ ఎంతో కష్టపడి ఆహారాన్ని పోగు చేసుకుని వానాకాలంలో హాయిగా గడుపుతుంది. అదే గొల్లభామ వేసవిలో సరదాగా గడిపేసి, వానల్లో ఆహారం లేక అల్లాడిపోతుంది. ఈ కథ నుంచి పనికీ, ఆటకీ కాలాలు ఉంటాయని... ముందు కష్టపడితే తరవాత హాయిగా బతకొచ్చు అనీ అర్థం అవుతుంది. కానీ చీమది చిన్న జీవితం, అదెప్పుడూ కష్టపడుతూనే ఉంది. ఎప్పుడు జీవించింది? మన జీవితమూ అలా కాకూడదు’ అని చెప్పే బిల్‌ పెర్సిన్స్‌ మాటలు అక్షర సత్యాలు. అయితే మరీ డబ్బును కూడబెట్టడమే కాకుండా... జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగితే రిటైర్మెంట్‌ తరవాత అనే దాటవేత ఉండదు. జీవితం సప్తవర్ణాల్లా... ఆద్యంతం అనుభూతులమయం అవుతుంది. కాదంటారా?


ఆలోచించాల్సిందే!

‘డై విత్‌ జీరో’ లో ఆలోచింపచేసే కొటేషన్లు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని...

  • జీవితం రోలర్‌కోస్టర్‌ రైడ్‌ లాంటిది. ఈ రైడ్‌ని చాలా ఉత్సాహభరితంగా, ఆత్మసంతృప్తి కలిగించేలా, ఉత్తేజకరంగా మలచుకునేలా ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి.

  • ప్రపంచంలోని సమయమంతా మనదగ్గరే ఉంటుందని జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటాం. జీవితం దగ్గర పడుతుంటే... మనలో ఆలోచనల అలజడి మొదలవుతుంది. నేను ఇంతకాలం ఏం చేశాను? ఇన్ని రోజులు ఎందుకు వృఽథా చేశాను? అనే ఆలోచనలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి.

  • చాలామంది తమకు ఇష్టమైన పనులను చేయకుండా వాయిదా వేస్తుంటారు. ఆఖరుకు సమయం మించిపోయిందని బాధపడతారు.


దృక్పథాన్ని మారుస్తుంది

అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బిల్‌ పెర్కిన్స్‌ను ‘లాస్ట్‌ కౌబాయ్‌’గా పేర్కొంటారు. అత్యంత విజయవంతమైన ఎనర్జీ ట్రేడర్స్‌లో బిల్‌ పెర్కిన్స్‌ ఒకరు. అంతేకాదు బిల్‌ సినిమా నిర్మాత, చక్కటి పోకర్‌ ఆటగాడు కూడా. 2020లో బిల్‌ రాసిన ‘డై విత్‌ జీరో: గెట్టింగ్‌ ఆల్‌ యూ కెన్‌ ఫ్రమ్‌ యువర్‌ మనీ అండ్‌ యువర్‌ లైఫ్‌’ పెను సంచలనమే సృష్టించింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. ఫైనాన్షియల్‌ బెస్ట్‌సెల్లర్‌ కూడా. ధనవంతుడిగా మరణించడం కన్నా కూడా ధనవంతుడిగా జీవించాలనే కొత్త సిద్ధాంతాన్ని ఈ పుస్తకం ప్రతిపాదిస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించి జీవిత దృక్పథాన్ని మార్చే పుస్తకంగా ‘డై విత్‌ జీరో’ పేరు తెచ్చుకుంది.

  • డి.పి.అనురాధ


ఈ వార్తలు కూడా చదవండి:

షారుక్‌ నా ఫస్ట్‌ క్రష్‌

బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 12:08 PM