తెలుగువారి నెచ్చెలి ‘బచ్చలి’
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:15 PM
బచ్చలి, పాలకూర, పుల్లబచ్చలి త్రయంలో బచ్చలి పాత్ర గొప్పదే! మంచి ఎండలో ఎక్కు వగా పెరుగుతుంది కాబట్టి, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న తెలుగువాళ్లకి బచ్చలాకు ప్రీతిపాత్రమైంది.
‘‘కోయక పెరుగదు బచ్చలి, మేయక పాలీయదు ఆవు మేదిని లోనన్’’ అని ఆర్యోక్తి. బచ్చలి మొక్క ఆకుల్ని రోజూ కోస్తుంటేనే ఆ మొక్క పెరుగుతుందట!
బచ్చలి, పాలకూర, పుల్లబచ్చలి త్రయంలో బచ్చలి పాత్ర గొప్పదే! మంచి ఎండలో ఎక్కు వగా పెరుగుతుంది కాబట్టి, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న తెలుగువాళ్లకి బచ్చలాకు ప్రీతిపాత్రమైంది. ఇరానులో పుట్టి ప్రపంచం అంతా మెట్టిన బచ్చలాకుల కథ చాలా ఉంది. పర్షియన్లు బచ్చలిని ఆకుకూరల్లో రారాజుగా భావిస్తారు. క్రీ.శ. 6వ శతాబ్దిలో ఇది ఇండియా నుంచి చైనా వెళ్లింది. 6-10 శతాబ్దాలలోనే ఇది భారతదేశం అంతా వ్యాపించింది.
దీని పండుని చిదిమితే ముదురు వంకాయ రంగు (పర్పుల్) రసం వస్తుంది. అచ్చ తెలుగులో బచ్చెన అంటే మంచి వర్ణం కలిగిన పండ్లు కలది కాబట్టి బచ్చలి అని తెలుగువాళ్లు పిలిచి ఉండవచ్చు. ఈ బచ్చలి పేరులోంచే ఈ మొక్కకు బసెల్లా అనే వృక్షనామం ఏర్పడింది.
బసెల్లా బచ్చలిలో తీగబచ్చలి (బేసెల్లా ఆల్బా-పాలబచ్చలి), ఎర్రబచ్చలి (బేసెల్లా రుబ్రా-రాచబచ్చలి). మట్టుబచ్చలి (బేసెల్లా లుసిడా-కాడబచ్చలి) అని మూడు రకాలున్నాయి. వీటి గుణాలన్నీ ఇంచుమించు సమానమే.
బచ్చలి కూర గురించి 9-10 శతాబ్దాల తరువాత వెలువడిన గ్రంథాల్లోనే కొంత సమాచారం దొరుకుతుంది. బహుశా, నలుడి పాకశాస్త్ర గ్రంథం పాకదర్పణంలోనే ఈ ఆకుకూర గురించి ఉంది.
బచ్చలికూర వగరు తీపి రుచులు కలిగి ఉంటుంది. మగతనాన్ని పెంచే కూరగా ఇది ప్రసిద్ధి. జీవకణాలను పెంచి, విషదోషాల్ని హరిస్తుంది. చలవ చేస్తుంది. మైగ్రేన్ తల నొప్పిని తగ్గిస్తుంది. సహజ నిద్ర పట్టించే గుణం దీనికుంది. బచ్చలి ఆకులూ, తీగకాడలు కూడా వండుకోదగినవే! వీటిలో ఉండే ఆహార పీచు, ఖనిజాలు, లవణాల సాంద్రత వలన షుగరువ్యాధిని పెరగకుండా చేస్తుంది. వాపుని తగ్గిస్తుంది. ఆలస్యంగా అరుగుతుంది.
క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ ఎ, బి, సి బచ్చలిలో ఎక్కువగా ఉంటాయి. లేత కాడల్లో ‘ఎ’ విటమిన్ బాగా ఉంటుంది. ఎర్ర కాడలున్న బచ్చలిలో అదనంగా బీటాకెరాటిన్ ఉంటుంది. అది మరింత నాణ్యమైనది.
బచ్చలి కూరలో ఆగ్జాలిక్ ఆమ్లం పెద్దగా ఉండదు. కాబట్టి, పాలకూర తినకూడనివారికి బచ్చలికూర సరిపడవచ్చు. మూత్రపిండాలకు, ఊపిరితిత్తులకు బలం ఇస్తుంది. వృద్ధాప్యం నివారిస్తుంది. బచ్చలాకులు జిగురుగా ఉంటాయి. ఈ జిగురు కూడా మంచిదే! విరేచనం అయ్యేలా చేస్తుంది. క్యాన్సరు నివారకాల్లో ఇది కూడా ఒకటి.
బచ్చలికూర పేరు చెప్పగానే ‘కంద-బచ్చలి’ కూర గుర్తుకొస్తుంది. కంద+బచ్చలిది మంచి జోడీ! బచ్చలితో కలిపి వండితే కందలో దోషాలు పోతాయంటారు. కందకి తోడుగా మరో కూర జోడీ కుదరకపోవచ్చు కూడా! కంద-బచ్చలిని ఆవపెట్టి వండిన కూర మూల వ్యాధులున్న వారికి మేలు చేస్తుంది. రక్తవృద్ధి కలిగిస్తుంది. వాత వ్యాధులు, కఫవ్యాధుల్లో మేలు చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. విరేచ నకారి. తృప్తి నిస్తుంది. తెలుగువారి పెళ్లిళ్లలో కందబచ్చలి కూర ఒక స్టేటస్ సింబల్.
బచ్చలాకులు, కాడలు, తీగని కూడామిక్సీలో వేసి రసం తీసి పచ్చిదిగా తాగవచ్చు. లేదా ఈ రసంలో పాలుపోసి పాయసం లాగా కాచుకో వచ్చు. రసంపొడి వేసి చారు కాచుకుంటే శక్తిదాయకమైన ఔషధంగా పనిచేస్తుంది.
బచ్చలాకుల్ని ఇష్టపడి తినండి. భయపడి అయిష్టంగా తినాల్సిన అవసరం లేదు. అది శరీరానికీ మనసుకూ రెండింటికీ మేలు చేసే గొప్ప ఆకుకూర!
డా. జి వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News