రక్తదాతలు... ప్రాణదాతలు...
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:07 AM
మనదేశంలో ప్రతీ రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
మనదేశంలో ప్రతీ రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఆపరేషన్లు, యాక్సిడెంట్లు... కారణమేదైనా కావొచ్చు, రక్తం దొరక్క చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి రక్తదానం ఒక్కటే పరిష్కారం. నేడు (జూన్ 14) ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ సందర్భంగా రక్తదానంపై ఓ అవగాహన కోసం...
రక్తదాతల దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో సంస్థ ప్రతీ ఏడాది ఒక థీమ్‌ను ఎంచుకుంటుంది. ఈ ఏడాది నినాదం.. ‘ఒక్క చుక్క మానవత్వం... రక్త దానం చేయండి. ప్రాణాలు కాపాడండి.’
1901లో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని రక్తదాన దినోత్సవాన్ని జరుపుతారు. తొలిసారి 2004లో ‘రక్తదాతల దినోత్సవాన్ని’ అన్ని దేశాల్లో నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఏటా 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుండగా.. 40 లక్షల యూనిట్ల రక్తం మాత్రమే లభిస్తోంది. దీంతో 70 శాతం మంది రక్తం దొరక్క మరణిస్తున్నారు.
18 నుంచి 60 ఏళ్ల లోపు ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులే! ఒక వ్యక్తి తన జీవితకాలంలో సుమారు 168 సార్లు రక్తదానం చేయొచ్చు.
రక్తదానానికి ఆసక్తి కనబరిచే వారి కోసం జాతీయ ఆరోగ్యమిషన్ ‘ఈ-రక్తకోష్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎవరైనా ఈ యాప్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.
88 ఏళ్ల పాటు జీవించిన జేమ్స్ హ్యారిసన్, తాను జీవించి ఉన్నంత వరకూ దాదాపు 1,173 సార్లు రక్తదానం చేశారు. ఆయన రక్తదానం వల్ల 24 లక్షల మంది నవజాత శిశువులు హీమోలిటిక్ వ్యాధి నుంచి బయటపడ్డారు.
ఆర్‌హెచ్‌ఎన్‌ఎల్ అరుదైన బ్లడ్‌గ్రూప్‌లో ఒకటి. దీన్ని గోల్డెన్ బ్లడ్ అంటారు. ప్రపంచం మొత్తంలో 50 మంది మాత్రమే ఈ రక్తాన్ని కలిగి ఉన్నారు.
గతేడాది బెంగళూరుకి చెందిన ఒక మహిళలో అరుదైన బ్లడ్ ఉందని గుర్తించారు. ఈ బ్లడ్‌గ్రూప్‌నకు సీఆర్‌ఐబీ (క్రోమర్ ఇండియా బెంగళూరు) అని పేరు పెట్టారు.
బాంబే బ్లడ్ గ్రూప్ కూడా ఒక అరుదైన రక్తమే! ప్రతీ పది లక్షల మందిలో సుమారు నలుగురిలో ఈ రక్తం క నిపిస్తుంది. ఇప్పటికి భారతదేశంలో 179 మందికి మాత్రమే ఈ రక్తం ఉంది.
మీది ఒ గ్రూపు రక్తమా? అయితే మీరు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. ఈ గ్రూపు వ్యక్తులకు గుండె, రక్తనాళాల వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉండడమే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచంలో.. ఒ పాజిటివ్ రక్తం ఉన్నవాళ్లు 42%, ఎ పాజిటివ్ 31%, బి పాజిటివ్ 15%, ఎబి పాజిటివ్ 5%, ఒ నెగిటివ్ 2.5%, బి నెగిటివ్ 1శాతం, ఎబి నెగటివ్ 0.5% మంది ఉన్నారు.
రక్తం ప్రతీరోజూ మానవ శరీరంలో 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే.. ఒక రక్త కణం గుండె నుంచి శరీరం మొత్తం చుట్టి రావడానికి కేవలం 20 నుంచి 60 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది.
మానవ శరీరంలో రక్త పరిమాణం మొత్తం శరీర బరువులో 7% నుంచి 8% ఉంటుంది.
అందరిలో రక్తం ఒకే పరిమాణంలో ఉండదు. పురుషుల కన్నా స్త్రీలలో అర లీటరు రక్తం తక్కువగా ఉంటుంది.
ఎ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో కార్టిసాల్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మిగతా గ్రూప్ రక్తం ఉన్నవారి కన్నా వీరి శరీరంలో ఒత్తిడి మరింత పెరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News