Share News

ఫిఫా ప్రపంచ కప్ 2026లో బ్రెజిల్‌కు నిరాశ..

ABN , Publish Date - Jun 14 , 2026 | 08:48 AM

ఫిఫా ప్రపంచకప్ టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్‌ను.. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన మొరాకో నిలువరించింది. గ్రూప్‌-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు ఎంత పోరాడినప్పటికీ చెరో గోల్‌ మాత్రమే సాధించాయి.

ఫిఫా ప్రపంచ కప్ 2026లో బ్రెజిల్‌కు నిరాశ..
Brazil vs Morocco

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ టైటిల్‌ ఫేవరెట్లలో బ్రెజిల్ జట్టు ఒకటి. అలాంటి దిగ్గజ జట్టుకు ఓ సాధారణ జట్టు గట్టి పోటీ ఇచ్చింది. అంతేకాక ఆ చిన్న జట్టు దెబ్బకు బ్రెజిల్‌కు నిరాశే మిగిలింది. ఫిఫా ప్రపంచకప్‌2022లో సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఆఫ్రికా జట్టైన మొరాకో జట్టు బ్రెజిల్ లాంటి పెద్ద జట్టును నిలువరించింది. గ్రూప్‌-సిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు ఎంత పోరాడినప్పటికీ చెరో గోల్‌ మాత్రమే సాధించాయి. దీంతోబ్రెజిల్, మొరాకో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.


ఆట ప్రారంభమైన 21వ నిమిషంలో మొరాకో ప్లేయర్ ఇస్మాయిల్‌ సైబారి గోల్‌ కొట్టి.. తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే కొన్ని నిమిషాల్లోనే బ్రెజిల్ కూడా గోల్ కొట్టింది. 32 నిమిషంలో బ్రెజిల్‌ ఆటగాడు వినీసియస్‌ జూనియర్ గోల్‌ కొట్టడంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి అర్ధభాగంలో మొరాకో జట్టు ఆధిపత్యం చెలాయించింది. పదేపదే బ్రెజిల్‌ గోల్‌పోస్ట్‌ వైపునకు దూసుకొచ్చింది. మొత్తంగా గోల్‌ కోసం ఇరు జట్ల ప్లేయర్లు హోరీహోరీగా పోటీపడ్డప్పటికీ సక్సెస్ కాలేకపోయారు.


ఈ మ్యాచ్‌లో బంతి ఎక్కువ సమయం(54 శాతం) బ్రెజిల్‌ నియంత్రణలోనే ఉన్నప్పటికీ అందివచ్చిన అవకాశాలను ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక గోల్ పోస్టు వైపు బ్రెజిల్‌ ఆటగాళ్లు 5 సార్లు, మొరాకో ప్లేయర్లు 4 సార్లు షాట్స్‌ కొట్టారు. బ్రెజిల్‌కు 6 కార్నర్స్‌ లభించినప్పటికీ ఉపయోగించుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌ డ్రా కావడం మొరాకోకు పెద్ద నష్టం జరగనప్పటికీ బ్రెజిల్‌కు మాత్రం బిగ్ షాక్‌గానే చెప్పవచ్చు.


1934 నుంచి జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆ జట్టు ప్రతి మ్యాచ్ నెగ్గింది. మొత్తం 17 సార్లు తన తొలి మ్యాచ్‌ల్లో ఆ జట్టు విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్‌కు బ్రెజిల్‌ స్టార్‌ ప్లేయర్‌ నెయ్‌మర్‌ దూరంగా ఉన్నాడు. బ్రెజిల్ రికార్డు స్థాయిలో 23వ సారి ఫిఫా ప్రపంచ కప్‌లో పోటీపడుతోంది. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రతి ఎడిషన్‌లో ఆడిన ఏకైక దేశం బ్రెజిల్ నిలిచింది.


ఇవి కూడా చదవండి:

తొలి వన్డేలో అఫ్ఘాన్‌పై భారత్‌ గెలుపు

అదిరిపోయే క్యాచ్ పట్టిన గిల్.. వీడియో వైరల్

Updated Date - Jun 14 , 2026 | 09:33 AM