వంటలు: అవిసె పూల కూర
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:43 AM
అవిసె మొక్కని అగస్త్య అని పిలుస్తారు. అగము అంటే కొండ. కొండల్లో పెరిగేదని భావం కావచ్చు.
అవిసె మొక్కని అగస్త్య అని పిలుస్తారు. అగము అంటే కొండ. కొండల్లో పెరిగేదని భావం కావచ్చు. అగస్త్య నక్షత్రంలో దీని పూలు వికసిస్తాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చిందని మరో వివరణ ఉంది. తెలుగులో అగిసె, అతసి, అవిచి అని కూడా పిలుస్తారు.
‘అవిసె పూలని వండుకుని తింటే అన్నీ శుభశకునాలే కలుగుతాయి’ అన్నాడు క్షేమ కుతూహలం అనే పాకశాస్త్ర గ్రంథంలో క్షేమ శర్మ. గంజాయి మొక్కల్ని పెంచే వారి చేత అవిసె మొక్కలు సాగు చేయిస్తే, రైతులకూ లోకానిక్కూడా అంతా మంచే జరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. పత్తి మొక్క లాగానే అవిసె నార లైనెన్ వస్త్ర పరిశ్రమలో ఇవ్వాళ ఆదాయవనరుగా మారింది. అవిసె గింజలకు పోషకాలుగా ప్రసిద్ధి ఎక్కువ. ఆహార పదార్థాలు వండుకోవటానికి అవిసె పూలు ఉపయోగకరంగా ఉంటాయి.
అవిసె పూలు రేచీకటిని, మైగ్రేన్ తలనొప్పిని, జ్వరాల్ని, విడవకుండా వచ్చే జలుబుని తగ్గిస్తాయని భావప్రకాశ అనే వైద్యగ్రంథం చెప్తోంది. అవిసె పూలు చలవ చేస్తాయని, చిరు చేదుగా వగరుగా ఉంటాయని, పడిశ భారాన్ని, కఫాన్ని, పైత్యాన్ని, వాతాన్ని తగ్గిస్తాయని ఈ వైద్యగ్రంథం పేర్కొంది. విరేచనం అయ్యేలా చేస్తాయి. కడుపులో నులిపురుగులు పోతాయి.
జుత్తుని పెరిగేలా చేసే బయోటిన్ పదార్థం ఈ పూలలో ఎక్కువగా ఉంటుంది. బయోటిన్ అనేది ‘బి’ విటమిన్లలో ఒకటి. ఇది పోషక పదార్థం. చిక్కిపోయేవారిని బలసంపన్నుల్ని చేస్తుంది. బరువు తగ్గిపోవటాన్ని నివారిస్తుంది. వెంట్రుకల కుదుళ్లను బలపరుస్తుంది. షుగరు మీద పనిచేస్తుంది. మానసిక ఆందోళనల్ని నివారిస్తుంది.
అవిసె పూలతో మనం వండుకోదగిన వంటకాలు అనేకం ఉన్నాయి. తమిళనాడులో అగత్తి కీరై, అగత్తి పూ పొరియల్ ప్రసిద్ధమైన వంటకాలు. థాయిలాండ్‌లో డాక్ ఖీ పేరుతో అవిసెపూల పులుసు కూర వండుకుంటారు. ఇండోనేషియా, మలేషియాలో కూడా ఈ పువ్వులు ఆహారంగా వాడుకలో ఉన్నాయి.
అవిసె పూల కూర: అవిసె పూల లోపలి పచ్చని కాడ, కేసరాలను తొలగిస్తే చేదు రుచి కొంత తగ్గుతుంది. రేకుల్ని విడదీసి కడిగి మజ్జిగలో వేసి కొద్దిసేపు మరిగించి మజ్జిగని వార్చేయాలి. ఒక భాండీలో నెయ్యి వేసి ఇంగువను వేగించి అందులో ఉడకబెట్టిన అవిసె పూరేకుల్ని, కోరిన సుగంధ ద్రవ్యాలను చేర్చి కొద్దిసేపు మగ్గనివ్వండి. అవిసె పూల కూర సిద్ధం అయినట్టే! ఈ కూరని వడ్డిస్తే ‘‘ఇన్నాళ్లు ఈ కూరని ఎందుకు చెయ్యలేదు?’’ అనడుగు తాడు మీ ఆయన..’’ అంటాడు క్షేమశర్మ.
అవిసె పూల సూపు: అవిసె పూల రెక్కల్ని విడదీసి, నీళ్లలో వేసి, పసుపు, మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర తగుపాళ్లలో వేసి సగం నీళ్లు మరిగేంత వరకూ కాచి సుగంధ ద్రవ్యాలు కలుపుకుని వడగట్టి ఆ నీటికి తాలింపు పెట్టుకుంటే అవిసె పూల సూపు తయారవుతుంది. ఇష్టమైన వారు చింతపండు, బెల్లం కొద్దిగా కలుపుకోవచ్చు. దీన్ని అన్నంలో చారులా కలుపుకొని తినవచ్చు. లేదా వేడిగా తాగవచ్చు. ‘అగస్తి పుష్ప సారం’ అంటారు దీన్ని. వాత వ్యాధుల్ని, కఫ వ్యాధుల్ని నివారిస్తుంది. కడుపులో గ్యాసు, ఉబ్బరం, నొప్పిని తగ్గిస్తుంది.
అవిసె పూలతో ‘టీ’: అవిసె పూలను సేకరించుకుని ఎండించి భద్రపరచుకోవచ్చు. అర చెంచాపొడిని కప్పునీళ్లలో వేసి బాగా మరిగించి టీ లాగా తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, ఆయాసాలు తగ్గుతాయి. స్త్రీల వ్యాధుల్లో మేలు చేస్తాయి.
అవిసె పూల వెన్న: ఈ పూలని మెత్తగా నూరి చిక్కటి గేదె పాలలో కలిపి తోడుపెట్టి చిలికిన వెన్నని రాస్తే చర్మం గరుకుదనం తగ్గి మృదువుగా అవుతుంది. అరికాళ్ల పగుళ్లు పోతాయి.
రుచిని, శరీరాన్ని సమతుల్యం చేసే ఔషధగుణాలను అందించే అరుదైన ఆహారపుష్పం అవిసె. ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే ఆహార ద్రవ్యాలు, సంప్రదాయ సంపూర్ణ ఆహారాలు, బలవర్ధక పదార్థాలు, ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ ఉత్పత్తులు వీటిని ఫంక్షనల్ ఫుడ్స్ అంటారు. అవిసె పువ్వు వీటిలో ఒకటి! వాడకంలోకి తెచ్చుకోవాల్సిన విలువైన ద్రవ్యం ఇది!
డా. జి వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News