టీమిండియాలోకి సారాంశ్.. అరంగేట్రంతోనే అరుదైన రికార్డు!
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:07 AM
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా టీమిండియా తరఫున సారాంశ్ జైన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు తరఫున సారాంశ్ జైన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కాగా 21వ శతాబ్దంలో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుడిగా జైన్ నిలిచాడు. ప్రస్తుత వయస్సు అతడి 33 ఏళ్ల 145 రోజులు.
ఈ నేపథ్యంలో 2000లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సబా కరీం(32 ఏళ్ల 362 రోజులు) పేరిట ఉన్న రికార్డును సారాంశ్ అధిగమించాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడ రాణిస్తున్న సారాంశ్ జైన్‌కు ఎట్టకేలకు టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే అతడి స్థానంలో సారాంశ్ జైన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్ టెస్టు క్యాప్ అందుకున్నాడు.