బిహార్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరు నెలల చిన్నారి సహా ముగ్గురు సజీవ దహనం..
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:05 AM
బిహార్‌లోని బఖ్తియార్‌పూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పురానీ బైపాస్ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించి ఆరు నెలల చిన్నారి సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.
బిహార్: పాట్నా జిల్లా బఖ్తియార్‌పూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి పురానీ బైపాస్ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సజీవ దహనమవగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆరు నెలల చిన్నారి మృతిచెందగా.. తల్లికి తీవ్రగాయాలు కావడం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా మంటలు వ్యాపించడంతో తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతిచెందారు.
బఖ్తియార్‌పూర్‌లోని పురానీ బైపాస్ ప్రాంతంలో పంకజ్ కుమార్‌కు బైక్ విడిభాగాల దుకాణం ఉంది. దాని వెనుక ఉన్న ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి అతను నివాసం ఉంటున్నాడు. అయితే, శనివారం దుకాణం, ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. చూస్తుండగానే ఇల్లంతా మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్నవారికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో పంకజ్ భార్య రీమా దేవి (45), తల్లి గీతా దేవి (70), మేనకోడలు ఆరు నెలల సుందరి కుమారి సజీవ దహనమయ్యారు. మరోవైపు, చిన్నారి తల్లిదండ్రులు మోని కుమారి, శివం కుమార్ తప్పించుకునేందుకు ఇంటి పైకప్పు పైకి ఎక్కారు. అనంతరం అక్కడి నుంచి కిందకు దూకేశారు.
ఈ ఘటనలో మోని కుమారి కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. దీంతో ఇద్దరినీ స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, మోని కుమారి తన భర్త, కుమార్తెతో కలిసి తన అన్న పంకజ్‌ను కలిసేందుకు బఖ్తియార్‌పూర్‌కు వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక దళం, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేలోపే ఘోరం జరిగిపోయింది. అయితే, మంటలు ఏ విధంగా చెలరేగాయనే దానిపై కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ముగ్గురి మృతితో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
దారుణం.. మహిళను చంపి.. శరీర భాగాలతో బిర్యానీ!
ఐఫోన్ మోజు.. యువతపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే..