ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య!
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:58 AM
తనను, ఇద్దరు పిల్లలను వదిలేసి భర్త, మరో వివాహితతో వెళ్లిపోడాన్ని జీర్ణించుకోలేకపోతున్న భార్య, ఆ మహిళే తన ఇంటిమీదకొచ్చి తీవ్ర దుర్భాషలాడటాన్ని తట్టుకోలేకపోయింది.
భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆవేదన
పైగా ఆ మహిళ ఇంటికొచ్చి తిట్టడంతో తీవ్ర మనస్తాపం
ఐదేళ్లలోపు ఇద్దరు బిడ్డలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య
వరంగల్ జిల్లాలో విషాదం
ఖానాపురం, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): తనను, ఇద్దరు పిల్లలను వదిలేసి భర్త, మరో వివాహితతో వెళ్లిపోడాన్ని జీర్ణించుకోలేకపోతున్న భార్య, ఆ మహిళే తన ఇంటిమీదకొచ్చి తీవ్ర దుర్భాషలాడటాన్ని తట్టుకోలేకపోయింది. ఐదేళ్లలోపు వయసున్న తన ఇద్దరు బిడ్డలతో కలిసి నీళ్లలోకి దూకి ప్రాణాలు తీసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు, బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన ఈరెల్లి సుమన్, హనుమకొండ జిల్లా బైరాన్‌పల్లికి చెందిన మమత (30) ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎలుకుర్తిహవేలి మమత అమ్మమ్మ గారి ఊరే! అక్కడే ఆమె పాఠశాల విద్య పూర్తిచేసిందది. ప్రస్తుతం నర్సంపేటలోని ప్రైవేట్ కంటి ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. సుమన్ ఊర్లోనే కూలి పనులు చేస్తున్నాడు. ఈ దంపతులకు కూతుళ్లు హర్షిణి (4), కావ్యశ్రీ (3) ఉన్నారు. కొంతకాలంగా సుమన్ అదే గ్రామానికి చెందిన పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం ఇంట్లోంచి బయటకొచ్చి ఆ మహిళతో కలిసి వెళ్లిపోయాడు.
ఈ విషయమై గీసుగొండ పోలీసులకు మమత ఫిర్యాదు చేసింది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. భార్య మమతతోనే సుమన్ ఉండాలని వారు తీర్మానించారు. అనంతరం పిల్లలతో కలసి సుమన్-మమత కొన్ని రోజులు నర్సంపేట మండలం ముగ్ధుంపురంలోని బంధువుల ఇంట్లో ఉన్నారు. అయితే రెండ్రోజుల క్రితం సుమన్ ఇంట్లోంచి బయటకొచ్చి మరోసారి ఆ మహిళతో వెళ్లిపోయాడు. ఇది తెలిసి మమత ఎలుకుర్తి హవేలికి వచ్చేసింది. శుక్రవారం రాత్రి సదరు వివాహిత.. తన భర్తను, మరో ముగ్గురు బంధువులను వెంటేసుకొని మమత ఇంటిమీదకొచ్చింది. అందరూ కలిసి మమతను ఇష్టంవచ్చినట్లు తిట్టారు.
దీన్ని తీవ్ర అవమానంగా భావించిన మమత.. శనివారం ఉదయం నర్సంపేటకు డ్యూటీకి వెళుతున్నానంటూ ఇంట్లో చెప్పి తన కూతుళ్లను వెంటబెట్టుకొని పాకాల చెరువు వద్దకు వెళ్లింది. పిల్లలతో కలిసి తాను చనిపోతున్నానని చెబుతూ హైదరాబాద్‌లో ఉన్న బంధువులకు వాట్స్‌పలో లొకేషన్ షేర్ చేసింది. తన బ్యాగ్, సెల్‌ఫోన్‌ను కట్టపై కుటీరంలో పెట్టింది. అనంతరం తన చున్నీతో ఇద్దరు పిల్లలను నడుముకు కట్టుకొని సరస్సులో దూకింది. కాసేపటికి సెల్‌ఫోన్ మోగుతుండటంతో సిబ్బంది వచ్చి ఫోన్‌లిఫ్ట్ చేశారు. ఆవలి వైపు నుంచి బంధువులు విషయం చెప్పి వారిని అప్రమత్తం చేశారు. సిబ్బంది నీళ్లలో గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై కేసు నమోదైంది. కాగా కుమార్తె, మనుమరాళ్లు చనిపోయారని తెలిసినా మమత తల్లిదండ్రులు ఘటనాస్థలికి రాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News