రికార్డు స్థాయిలో పసుపు ధర
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:19 AM
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు గరిష్ఠ ధర రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.16,159గా నమోదైంది.
కేసముద్రంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.16,159
ఐదేళ్ల తర్వాత మళ్లీ అత్యధిక రేటు
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పసుపు గరిష్ఠ ధర రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.16,159గా నమోదైంది. ఈ మార్కెట్‌లో 2009, 2021లో పసుపు ధర రూ.16వేల మార్కు దాటగా, తాజాగా మళ్లీ ఆ స్థాయితో ధర రావడం విశేషం. మార్కెట్‌కు 21 మంది రైతులు 232 బస్తాల్లో కాడీ రకం పసుపు తీసుకురాగా, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ-నామ్) విధానంలోని ‘ఈ-వేలం’లో క్వింటాకు గరిష్ఠంగా రూ.16,159, కనిష్ఠంగా రూ.10,300,
సగటున రూ.14,312, గోళ రకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా రూ.15,500, కనిష్ఠంగా రూ.11,011, సగటున రూ.13,350ధరలతో వ్యాపారులు ఖరీదు చేశారు. మూడు వారాలుగా పసుపు ధర ఈ మార్కెట్‌లో పెరుగుతూ వస్తోంది. గత నెల 16న పసుపు సగటుధర క్వింటాకు రూ.11,059 ఉండగా తాజాగా క్వింటాకు సగటు ధర రూ.14,500పైనే వస్తోంది. నెల్లికుదురుకు చెందిన రైతు కోల అనిల్ సింగి ల్ పాలీష్ చేసి తీసుకువచ్చిన పసుపునకు రూ.16,159 ధర రావడం విశేషం. అయితే పాలిష్ చేయని పసుపునకు గరిష్ఠంగా రూ.15,889 ధర నమోదైంది.
15 రోజులుగా పెరుగుతున్న ధర
రెండు నెలల క్రితం పసుపు సీజన్ ఆరంభంలో క్వింటాకు రూ.13,500 నుంచి రూ.13,700 వరకు ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు 80 శాతం పసుపు ఈ ప్రాంతం నుంచే పరోక్షంగా ఎగుమతి అవుతుంటుంది. ఇరాన్, అమెరికా యు ద్ధం ఆరంభం కాగానే క్రమంగా మార్కెట్‌లో పుసుపు ధరలు పడిపోయాయి. క్వింటాకు రూ.11,000 నుంచి రూ.11,500 మధ్యలో ఖరీదులు సాగాయి. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల అంచనాలతో గత 15 రోజులుగా పసుపు ధర క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు వారాల కిందట రూ.12,500 నుంచి రూ.13వేలు ఉన్న సగటు ధర తాజాగా బుధవారం సగటు ధర రూ.14,500లకు పైగా రావడం విశేషం. పసుపు ధర గరిష్ఠంగా క్వింటాకు రూ.16వేలు దాటడం మాత్రం 2009 సంవత్సరం తర్వాత 2021లో రాగా మళ్లీ తాజాగా అదే ధర రావడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
20 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News