Share News

జనగామలో పెద్దపులి సంచారం.. అటవీశాఖ హెచ్చరికలివే..

ABN , Publish Date - Feb 04 , 2026 | 09:57 AM

పెద్దపులి సంచారంతో జనగామ జిల్లాలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జనగామలో పెద్దపులి సంచారం.. అటవీశాఖ హెచ్చరికలివే..
Tiger Sighting

జనగామ, ఫిబ్రవరి 4: జనగామ జిల్లాలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో బచ్చన్నపేట మండలంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో దండోరా వేసి మరీ ప్రజలను అప్రమత్తం చేశారు అటవీశాఖ అధికారులు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పిల్లలను జాగ్రత్తగా ఉంచాలని సూచించారు. పులిని బంధించేందుకు సిద్ధంకి, చంపక్ హిల్స్ ప్రాంతాల్లో మూడు ట్రాప్ బోన్లు ఏర్పాటు చేశారు. గత 20 రోజులుగా యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ పెద్దపులి సంచరిస్తోంది. మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిన పులి.. ఇప్పుడు జనగామ జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు.


జనవరి 16న యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలో పులి పాదముద్రలు, ఆనవాళ్లు గుర్తించారు అటవీ అధికారులు. కొన్ని చోట్ల లేగదూడలు, జంతువులపై దాడులు జరిగాయి. రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల్ పరిధిలో పులి పాదముద్రలు కనిపించాయి. పీర్లపల్లి, ధర్మారం అడవుల్లో కూడా పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిన్న (మంగళవారం) రాత్రి ఆలేరు మండలం శ్రీనివాసపురం, కొలనుపాక ప్రాంతాల్లో పులి అడుగులను గుర్తించారు. ఆలేరు మండల సరిహద్దుగా ఉన్న జనగామ జిల్లాలోకి పులి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


పులిని బంధించేందుకు అటవీశాఖ ట్రాకింగ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 25 ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ కెమెరాలతో రాత్రి సమయంలో కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు మనుషులపై దాడి జరగలేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా అనుమానాస్పద కదలికలను గమనిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి..

8న భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన

వరంగల్ మున్సిపల్ బరిలో ప్రధాన పార్టీలు.. ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 11:43 AM