సిరులు కురిపించే సెరికల్చర్
ABN , Publish Date - Sep 09 , 2026 | 10:24 AM
పట్టు పరిశ్రమ ఒక వ్యవసాయానుబంధ గ్రామీణ కుటీర పరిశ్రమ. నీటి వనరులు తక్కువగా ఉన్న క్షామ పీడిత ప్రాంతాల్లోని ఉత్సాహవంతులైన రైతులకు మల్బరీ సాగుతో పట్టు పురుగుల పెంపకం చేపడితే తక్కువ వ్యవధిలో నిరంతరాదాయాన్ని సమకూరుస్తుంది.
సాగుకు భారీగా ప్రభుత్వ రాయితీలు
జనరల్ కేటగిరి రైతులకు 75 శాతం ఎస్టీ, ఎస్సీ లకు 90శాతం
గ్రామీణ నిరుద్యోగులకు జీవనోపాధి
వరంగల్: పట్టు పరిశ్రమ ఒక వ్యవసాయానుబంధ గ్రామీణ కుటీర పరిశ్రమ. నీటి వనరులు తక్కువగా ఉన్న క్షామ పీడిత ప్రాంతాల్లోని ఉత్సాహవంతులైన రైతులకు మల్బరీ సాగుతో పట్టు పురుగుల పెంపకం చేపడితే తక్కువ వ్యవధిలో నిరంతరాదాయాన్ని సమకూరుస్తుంది. గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులు పట్టు పురుగుల పెంపకం చేపట్టి జీవనోపాధిని పొందవచ్చు. పురుగులకు ఆహారంగా ఉపయోగపడే బహువార్షిక మల్బరీ మొక్క 10నుంచి 15 ఏళ్లవరకు ఆకులను ఇస్తుంది. దీనితో ఏటా 5 నుంచి 6 పంటలను క్రమంగా చేపట్టవచ్చు. ఈ పరిశ్రమలో 60 శాతం పాత్రను మహిళలే పోషిస్తారు.
నిరంతర ఆదాయం
సీజనల్ పంటల మాదిరిగా సంవత్సరానికి ఒకటి లేదా రెండు పర్యాయాలు మాత్రమే ఆదాయం లభించకుండా మల్బరీ సాగుతో పట్టు పురుగుల పెంపకం చేపడితే ఏటా 5 లేదా 6 పంటలు వస్తాయి. ఏడాదంతా నిరంతర ఆదాయ వనరు అందుబాటులో ఉంటుంది.
కరువును తట్టుకునే సామర్థ్యం
మల్బరీ మొక్క లోతనైన వేర్ల వ్యవస్థ కలిగిన దృఢమైన పంట కావడంతో తక్కువ నీటి అవసరంతో సాగు చేయవచ్చు. స్వల్ప వర్షాభావ పరిస్థితులను తట్టుకొని ప్రతికూల వాతావరణ పరిస్థితులో సైతం స్థిరమైన దిగుబడిని అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది.
నెల రోజుల్లోపే పంట చేతికి..
పట్టు పురుగుల పెంపకంలో వాటి జీవన చక్రం కేవలం 25 నుంచి 30 రోజుల వ్యవధిలో పూర్తవుతుంది. దీని వల్ల రైతులు ఏడాది అనేక పర్యాయాలు నిరంతర ఉపాధి అవకాశం, క్రమమైన నగదు ప్రవాహాన్ని పొందగలుగుతారు.
భారీ ఆర్థిక సహాయం
రైతులు పట్టు సాగును చేపట్టే విధంగా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీగా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. పరిశ్రమకయ్యే ఖర్చులో 50 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం 20 శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా రాయితీలు ఇస్తున్నాయి. రెండు ఎకరాలు యూనిట్‌గా మల్బరీ మొక్కల సాగుకు రూ.1లక్షా 20 వేలు, పట్టు పురుగుల పెంపకం చేపట్టే షెడ్ నిర్మాణానికి రూ.4లక్షల 50 వేలు, ఇతర సామగ్రికి రూ.75వేలు,
నీటిపారుదల సౌకర్యం కోసం రూ.1 లక్షా అంచనా వ్యయంతో పరిశ్రమను స్థాపించవచ్చు. అందులో జనరల్ కేటగిరి రైతులకు 75 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీగా ఇస్తున్నాయి. దీనిలో జనరల్ కేటగిరి రైతులు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులు 10 శాతం తమ వంతు వాటాగా భరించవలసి ఉంటుంది. రెండు ఎకరాల మల్బరీ సాగుతో పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు సుమారుగా రూ.6లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లుగా గమనించబడింది.
రైతులకు స్థిరమైన ఆదాయం, ఉపాధి భద్రత
అనసూయ జాయింట్ డైరెక్టర్, సెరి కల్చరల్ శాఖ హనుమకొండ
వర్షాభావంతో కరువు పరిస్థితుల నేపథ్యంలో సెరికల్చర్ సాగు చేపడితే రైతులకు స్థిరమైన ఆదాయంతో పాటు ఉపాధి భద్రత లభిస్తుంది. వ్యవసాయ వైవద్యీకరణను అందించగల సమర్థవంతమైన ప్రత్యామ్నాయ వ్యవసాయ కార్యకలాపంగా పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు సాగును పోత్సహించేందుకు ఇస్తున్న భారీ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఇందిరమ్మ’ లాటరీలో ఇళ్లురాని వారికి ధరావతు వాపస్
Read Latest AP News And Telangana News And International News And Telugu News