ప్రత్యేక పూజలతో మేడారానికి పగిడిద్దరాజు
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:00 PM
పూనుగొండ్ల నుంచి మేడారం దిశగా పగిడిద్దరాజు ప్రయాణం ఘనంగా ప్రారంభమైంది. కోయ పూజారులు సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పగిడిద్దరాజును మేడారం తీసుకొస్తున్నారు. మేడారం జాతరకు ముందుగా జరిగే ఈ కార్యక్రమం గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
మహబూబాబాద్: మేడారం మహాజాతర నేపథ్యంలో గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం వైపు బయలుదేరారు. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కోయ పూజారులు పగిడిద్దరాజును ఘనంగా మేడారం తీసుకొస్తున్నారు. పూనుగొండ్ల గ్రామంలో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించగా, కోయ గిరిజనులు సంప్రదాయ వేషధారణలో పగిడిద్దరాజుకు పూజలు చేశారు. పూజల అనంతరం భక్తుల నినాదాల మధ్య ఊరేగింపుగా పగిడిద్దరాజును మేడారం దిశగా తీసుకువస్తున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిందని, ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు.
కాగా, ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర వైభవంగా జరుగనుంది. ఈ జాతర కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన జాతర ప్రారంభానికి ముందే గత కొన్ని రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం జాతరకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Also Read:
ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కస్టమర్లకు ఇక్కట్లు
టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!
For More Latest News