Share News

టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!

ABN , Publish Date - Jan 27 , 2026 | 02:06 PM

టీ20 ప్రపంచ కప్ 2026.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ నిర్ణయాల వల్ల రోజుకో వివాదం తెరమీదకి వస్తోంది. ఈ టోర్నీలో పాక్ ఆడటంపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ చెప్పింది. ఒకవేళ పాక్ ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.

టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!
Pakistan

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ నిర్ణయాల వల్ల రోజుకో వివాదం తెరమీదకి వస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో ప్రపంచ కప్ ఆడబోమంటూ మొండి వైఖరి ప్రదర్శించిన బంగ్లాను ఈ టోర్నీ నుంచే ఐసీసీ తప్పించింది. ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్‌ను ప్రకటించింది. అయితే దీనికి నిరసనగా పాకిస్తాన్ కూడా ఈ టోర్నీకి దూరంగా ఉండాలనే ఆలోచనలోనే ఉంది. ఇప్పటికే జట్టును ప్రకటించినప్పటికీ.. తమ ప్రభుత్వ తుది నిర్ణయాన్ని బట్టే వరల్డ్ కప్ ఆడాలా? వద్దా? అనే దానిపై స్పష్టతనిస్తామని పీసీబీ ఛైర్మన్ నఖ్వి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నఖ్వి.. పాక్ పీఎంతో భేటీ అయ్యాడు.


కాగా పాక్ పీఎం షరీఫ్.. ఈ విషయంపై వారంలోగా తమ తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం. నఖ్వి వ్యాఖ్యల ప్రకారం ఒకవేళ ప్రభుత్వ అనుమతి లేకపోతే పాక్.. ప్రపంచ కప్ ఆడదు. ఈ విషయంపై ఇప్పటికే ఐసీసీ.. పీసీబీ హెచ్చరించింది. అయినప్పటికీ పాక్ అదే ధోరణి ప్రదర్శిస్తోంది. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆడకపోతే కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తాను తీసిన గోతిలో తానే పడి ఆత్మహత్య చేసుకోవడం లాంటిది! పాక్ ఆడకపోతే ఏ ఏ శిక్షలు ఎదుర్కొంటుందంటే..


1. ఐసీసీ ఒప్పందం ఉల్లంఘన

ఐసీసీలోని ప్రతి మెంబర్ బోర్డు ఈ మెగా టోర్నీకి ముందే టోర్నమెంట్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ (TPA)పై సంతకం చేస్తుంది. చివరి నిమిషంలో సరైన కారణం లేకుండా వైదొలిగితే ఇది చట్టపరమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీని ఫలితంగా పాకిస్తాన్‌కు వచ్చే ఐసీసీ వార్షిక ఆదాయ వాటా సుమారు 34.5 మిలియన్ డాలర్లు (రూ.316 కోట్లు) నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పీసీబీకి ఇది తట్టుకోలేని దెబ్బ. ఐసీసీ మొత్తం ఆదాయంలో దాదాపు 6 శాతం కోల్పోతే బోర్డు కోలుకోవడం అసాధ్యం.


2. ఐసీసీ శిక్షలు

ప్రభుత్వ జోక్యం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటే.. ఐసీసీ దీనిని రాజకీయ జోక్యంగా పరిగణించే ప్రమాదం ఉంది. అప్పుడు విధించే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్, ఆసియా కప్ నుంచి బహిష్కరణ, భవిష్యత్తులో పాకిస్తాన్‌లో జరిగే టోర్నీల హోస్టింగ్ హక్కుల రద్దు వంటి పలు శిక్షలు అమలవుతాయి. ఇప్పటికే 2028 మహిళల టీ20 ప్రపంచ కప్‌న‌కు పాకిస్తాన్‌ ఆతిథ్య హక్కులు పొందింది. కానీ బహిష్కరణ జరిగితే అవి కూడా గాలిలో కలిసిపోతాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్నది కూడా నఖ్వినే!


3. పీఎస్ఎల్‌కు ‘నో ఆబ్జెక్షన్’

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) అనేది పీసీబీకి ప్రాణం లాంటిది. కానీ అది విదేశీ ఆటగాళ్ల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తే ఐసీసీ ఆదేశాలతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బోర్డులు తమ ఆటగాళ్లకు NoCలు ఇవ్వకుండా అడ్డుపడే అవకాశం ఉంది. అలా అయితే PSL విలువే పడిపోతుంది.


4) ద్వైపాక్షిక క్రికెట్‌పై ప్రభావం

క్రికెట్ ఆర్థిక వ్యవస్థ మొత్తం ద్వైపాక్షిక సిరీస్‌లపైనే ఆధారపడి ఉంటుంది. ఐసీసీకి అత్యధిక ఆదాయం తెచ్చే ప్రపంచ కప్‌లో ఆడకపోతే పాక్‌కు మిగతా బోర్డుల మద్దతు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు టూర్లు రద్దు చేస్తే పీసీబీకి స్వతంత్ర ఆదాయం పూర్తిగా క్షీణిస్తుంది.


ఇవి కూడా చదవండి:

ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్

బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

Updated Date - Jan 27 , 2026 | 02:06 PM