టీ20 ప్రపంచ కప్ 2026.. 100 మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ తిరస్కరణ
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:24 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లా విషయంలో ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కవరేజీ కోసం అప్లై చేసుకున్న ఏకంగా వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమీ తెలియరాలేదు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే భారత్‌లో మ్యాచులు ఆడబోమని తేల్చి చెప్పడంతో బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఐసీసీ(ICC) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగక ముందే ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ(T20 World Cup 2026) కవరేజీ కోసం అప్లై చేసుకున్న ఏకంగా వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమీ తెలియరాలేదు.
అయితే బీసీబీ(BCB) మీడియా కమిటీ ఛైర్మన్ అంజద్ హుస్సేన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈసారి సుమారు 130 నుంచి 150 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులు అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఒక్కరికి కూడా అనుమతి లభించలేదని ఆయన తెలిపారు. ‘మాకు తెలిసినంత వరకు బంగ్లాదేశ్‌కు చెందిన జర్నలిస్టులందరి దరఖాస్తులను తిరస్కరించారు. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు’ అని అంజద్ వ్యాఖ్యానించారు.
అప్రూవల్.. తర్వాత క్యాన్సిల్
మరోవైపు.. జనవరి 20, 21 తేదీలో ఐసీసీ మీడియా విభాగం నుంచి అప్రూవల్ పొందిన కొందరు ఫోటో జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను కూడా తర్వాత రద్దు చేసినట్లు సమాచారం. ‘ఐసీసీ నుంచి అప్రూవల్ మెయిల్, వీసా సపోర్ట్ లెటర్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా దరఖాస్తు తిరస్కరించినట్లు మరో మెయిల్ వచ్చింది’ అని బంగ్లాకు చెందిన ఓ జర్నలిస్టు వాపోయారు. 1996 వరల్డ్ కప్ నుంచే ఐసీసీ ఈవెంట్లను కవర్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఆరిఫుర్ రెహమాన్ బాబు కూడా ఈసారి అక్రిడేషన్ పొందలేకపోయారు. ‘జట్టు పాల్గొనకపోయినా అసోసియేట్ దేశాల జర్నలిస్టులకు సాధారణంగా అనుమతి ఇస్తారు. అందరినీ తిరస్కరించడానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని ఆయన అన్నారు.
వరల్డ్ కప్ టోర్నీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై ఐసీసీ ఇంకా మౌనం వీడలేదు. బంగ్లాను టోర్నీ నుంచి తప్పించడమే కాకుండా జర్నలిస్టుల అక్రిడేషన్‌ను తిరస్కరించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్
బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు