Share News

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:46 PM

మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు.

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
Telangana municipal elections

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి.

ELECTIONS.jpg


జనవరి 28వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి జనవరి 30 వరకు అవకాశం కల్పించారు. అలాగే 31వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించి.. 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన చైర్ పర్సన్స్, మేయర్ల ఎన్నిక ప్రక్రియ చేపడతారు.

రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 8203 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అమల్లోకి ఎన్నికల కోడ్..

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు సైతం ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు.


మున్సిపల్‌ ఎన్నికల ముఖ్య తేదీల వివరాలు సంక్షిప్తంగా..

  • జనవరి 28 - నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

  • జనవరి 30 - నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ

  • జనవరి 31 - నామినేషన్ల స్క్రుటినీ

  • ఫిబ్రవరి 03 - నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

  • ఫిబ్రవరి 11 - పోలింగ్‌

  • ఫిబ్రవరి 12 - అవసరమైన చోట రీపోలింగ్‌

  • ఫిబ్రవరి 13 - ఓట్ల లెక్కింపు

  • ఫిబ్రవరి 16 - మున్సిపల్ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక & కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

మున్సిపల్‌ ఎన్నికల్లో సుమారు 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


ఇవీ చదవండి:

ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కస్టమర్లకు ఇక్కట్లు

టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!

Updated Date - Jan 27 , 2026 | 04:41 PM