ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కస్టమర్లకు ఇక్కట్లు
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:12 PM
ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. వారానికి ఐదు రోజులు పని, వేతనాల పెంపు, పెన్షన్ సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తిగా అమలు కావాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. అయితే బ్యాంకు ఖాతాదార్లు కొందరు సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 27: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మె జరుగుతోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఈ సమ్మెకు దిగాయి.
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లలో ప్రధానంగా.. వారానికి ఐదు రోజుల పని దినాలు(ఇప్పటికే రెండు శనివారాలు సెలవులు ఉన్నాయి), వేతనాల పెంపు, పెన్షన్ సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం(Bipartite Settlement) పూర్తిగా అమలు కావాలన్నవి ఉన్నాయి. అంతేకాదు, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసన, ఆటోమేషన్, ఔట్‌సోర్సింగ్ వల్ల ఉద్యోగాలపై వస్తున్న ముప్పు, పని ఒత్తిడి తగ్గించాలని, మెరుగైన వర్కింగ్ కండిషన్స్ ఉండాలని, సిబ్బంది కొరత తీర్చాలని, పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణ లేదా మెరుగైన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు.
ఈ డిమాండ్లపై జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఇవాళ ఒక రోజు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. సమ్మె కారణంగా దేశంలోని దాదాపు అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల శాఖలు (SBI, PNB, Canara Bank, Indian Bank etc.,) మూసివేశారు. దీంతో బ్యాంకు ఖాతా దార్లకు పరిమిత సేవలు మాత్రమే ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ATMలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, UPI వంటివి సాధారణంగా పనిచేస్తున్నాయి.
కానీ కౌంటర్ సేవలు (క్యాష్ డిపాజిట్/విత్‌డ్రా, డ్రాఫ్ట్‌లు, లోన్ ప్రాసెసింగ్ మొదలైనవి) జరగడం లేదు. ఫలితంగా దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యాపారులు, పెన్షనర్లు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్
బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు