ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు మాజీ ఎంపీ.. స్టేట్‌మెంట్ రికార్డ్
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:17 PM
మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీని ప్రశ్నించనున్న సిట్ అధికారులు.. వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు(Former MP Joginapalli Santosh Rao) సిట్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని ఏసీపీ కార్యాలయానికి చేరుకున్న సంతోష్ రావు.. సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేయనున్నారు సిట్ అధికారులు.

సంతోష్ రావుకు ఇప్పటికే 160 సీఆర్పీసీ కింద సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లకు ఇచ్చిన విధంగానే సంతోష్ రావుకూ నోటీసులు పంపింది సిట్ బృందం. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు పదవీ విరమణ పొందిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కొనసాగించడం ఎవరి నిర్ణయం అనే దానిపై సంతోష్ రావును సిట్ విచారించనున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది.

ఫోన్ ట్యాపింగ్ కోసమే రిటైర్డ్ అయిన తరువాత కూడా ఎస్‌ఐబీ చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావును ప్రభుత్వం కొనసాగించినట్లు సిట్ అనుమానిస్తోంది. ఈ బాధ్యతలు అప్పగించడంలో నిర్ణయం, ఆదేశాలు ఎవరిచ్చారనే దానిపై సంతోష్ రావును సిట్ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌లో ఆయన కొన్ని నంబర్లను ఎస్‌ఐబీకి ఇచ్చి ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ నంబర్ ట్యాప్ చేయాలో సంతోష్ రావు నుంచి ఆదేశాలు అందినట్లు సిట్ ఆధారాలు సేకరించింది.
