ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:46 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ నందన్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఢిల్లీ, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని తన పిటిషన్‌లో ఆరోపించాడు. ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాలో తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని పిటిషన్‌లో పేర్కొన్నాడు అకీరా. ఏఐ సినిమాతో పాటు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లలో పెద్ద సంఖ్యలో తన పేరుతో నకిలీ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయని, వాటిని తొలగించాలని హైకోర్టును అకీరా నందన్(Akira Nandan) అభ్యర్థించాడు. అతడి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఏఐ సాయంతో తీసిన ఓ లవ్ స్టోరి సినిమాపై హైకోర్టు(Delhi High Court) నిషేధం విధించింది. కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకీరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వక్రీకరించిన కంటెంట్‌ను రూపొందించడం అతని గోప్యతా హక్కును ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది.
ఈ వీడియోకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు(Fake social media profiles) తొలగించాలని, ఐపి వివరాలను బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్, ఇన్ స్ఠాగ్రామ్, ఫేస్ బుక్ , ఎక్స్ సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ముందు జరిగింది. అకీరా నందన్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. గూగుల్ తరఫున ఆదిత్యా గుప్తా, మెటా తరఫున వరుణ్ పాఠక్ న్యాయవాదులు కోర్టులో హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే