యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 09:51 AM
యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్‌తో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు.
అమరావతి, జనవరి 27: యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సంబరాలు చేసుకున్నారు టీడీపీ నేతలు. మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ నేతలు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. యువగళం పాదయాత్ర మూడేళ్ల సందర్భాన్ని గుర్తుచేస్తూ లోకేశ్‌తో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని ఆ పార్టీ నేతలు కొనియాడారు.
ప్రజాచైతన్యమే లక్ష్యంగా..
రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువగళం సాగిందని గుర్తుచేసుకున్నారు. 2023 జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మున్సిపాలిటీలు/మండలాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర కొనసాగింది. లోకేశ్ పాదయాత్ర నిర్వహించిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఈ యాత్ర విజయానికి నిదర్శనంగా నిలిచింది.
శుభాకాంక్షలు తెలిపిన నేతలు..
లోకేశ్‌కు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్లు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, సోమిరెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, ఉగ్ర నరసింహారెడ్డి, గణబాబు, ఆదిరెడ్డి వాసు, ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి, వేపాడ, గ్రీష్మ, కార్పొరేషన్ ఛైర్మన్లు, తదితరులు అభినందనలు తెలియజేశారు.
లోకేశ్‌కు మహిళా మంత్రుల శుభాకాంక్షలు
పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మహిళా మంత్రులు అనిత, సవిత. ఈ సందర్భంగా పాదయాత్ర ప్రారంభం నాటి స్మృతులను నేతలు గుర్తుచేసుకున్నారు. నేడు ప్రజలు సంతోషంగా, ప్రశాంతంగా ఉండటానికి యువగళం పాదయాత్రది ప్రధాన పాత్ర అని మంత్రులు అన్నారు. ఎన్నో నిర్బంధాలు, ఆటంకాలను తట్టుకుంటూ, ప్రభుత్వ అవమానాలను భరిస్తూ.. ప్రజల కోసం నాడు లోకేశ్ పాదయాత్ర కొనసాగించారని తెలిపారు. నేడు తమకు పదవులు వచ్చాయంటే అందుకు కారణం కూడా యువగళం పాదయాత్రే అని మంత్రులు వెల్లడించారు.
యువత గుండెచప్పుడుగా యువగళం: మంత్రి మండిపల్లి
నారా లోకేష్ యువగళం పాదయాత్ర యువత గుండెచప్పుడుగా నిలిచి మూడేళ్లు పూర్తి చేసుకుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలకు స్వరం ఇచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశ చూపిన చారిత్రాత్మక పాదయాత్ర అని కొనియాడారు. ఆశయం, అభివృద్ధి సంకల్పానికి ప్రతీకగా నిలిచి రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసిన పాదయాత్ర అని చెబుతూ.. యువత, రైతులు, మహిళలకు యువగళం అండగా నిలిచిందన్నారు మంత్రి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన యువగళం మూడేళ్ల తర్వాత కూడా ప్రజల్లో ప్రతిధ్వనిస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
చిక్కినట్టే చిక్కి.. తప్పించుకున్న పులి
బొబ్బిలి సమీపంలో గజరాజుల స్వైరవిహారం
Read Latest AP News And Telugu News