మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..
ABN , Publish Date - Jan 29 , 2026 | 09:12 AM
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. గురువారం మేడారం చేరుకోనున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సైతం నేడు మేడారంలో వనదేవతలను దర్శించుకోనున్నారు.
ములుగు, జనవరి 29: ఆసియాలోనే అతి పెద్ద జాతరైన మేడారంలో వరుసగా కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. సారలమ్మ బుధవారం గద్దెపైకి చేరుకోగా.. నేడు సమ్మక్క గద్దెనెక్కనున్నారు. ఇందుకోసం చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తజనం పులకించనుంది. సమ్మక్క రాకతో ఈ జాతర పరిపూర్ణం కానుంది. గురువారం అర్ధరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ జాతర సందర్భంగా మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది.
నేడు పలువురు ప్రముఖులు..
జాతర సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. గురువారం మేడారం విచ్ఛేయనున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకోనున్నారు. ఈ జాతర ఏర్పాట్లు, భక్తుల కోసం సౌకర్యాలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం వనదేవతలను డిప్యూటీ సీఎం భట్టి దర్శించుకుని.. మొక్కులు చెల్లిస్తారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సైతం నేడు మేడారంలో వనదేవతలను దర్శించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో మేడారంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక రాష్ట్ర రెవెన్యు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. జాతర ఏర్పాట్లను స్వయంగా బైక్ నడుపుతూ పరిశీలించారు. జనవరి 28న ప్రారంభమైన ఈ జాతర.. 31న ముగియనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకునే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది మేడారం తరలిరానున్నారు.
వనదేవత సమ్మక్క.. గురువారం గద్దెపైకి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లపై జిల్లాకు చెందిన మంత్రి సీతక్క ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవదహనం
For More TG News And Telugu News