Share News

కల్తీ.. కెమికల్‌ నెయ్యి

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:47 AM

‘కల్తీ నెయ్యి’ కేసులో ఏడాదిపాటు దర్యాప్తు జరిపిన సీబీఐ సిట్‌ సంచలన సంగతులు వెలికి తీసింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో బడా కుట్ర జరిగినట్టు తేల్చింది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకూ ఎక్కడెక్కడ.....

కల్తీ.. కెమికల్‌ నెయ్యి

  • తిరుమల ‘నెయ్యి’ కేడీల గుట్టును విప్పిన సీబీఐ సిట్‌ చార్జిషీట్‌!

  • 10కిపైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు

  • ఐదు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ గుర్తింపు

  • చుక్క పాలు లేకుండా నెయ్యి తయారీ

  • ‘భోలేబాబా’ డెయిరీ కేంద్రంగా దందా

  • సహకార డెయిరీలను తప్పించడానికి టెండరు నిబంధనల్లో సవరణలు

  • సరఫరాదారులు, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం నిర్ధారణ

  • చార్జిషీట్‌లో సంచలన నిజాలు!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘కల్తీ నెయ్యి’ కేసులో ఏడాదిపాటు దర్యాప్తు జరిపిన సీబీఐ సిట్‌ సంచలన సంగతులు వెలికి తీసింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో బడా కుట్ర జరిగినట్టు తేల్చింది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకూ ఎక్కడెక్కడ, ఎవరెవరు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది పసిగట్టింది. 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డెయిరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, లాజిస్టిక్‌ ఆపరేటర్లు, హవాలా మధ్యవర్తుల నెట్‌వర్క్‌ గొలుసును పదికి పైగా రాష్ట్రాల పరిధిలో వెలికి తీసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, రాష్ట్ర పోలీసు అధికారులతో ఏర్పడిన ‘సిట్‌’ తన దర్యాప్తులో తేల్చిన అంశాలపై తుది చార్జిషీట్‌ను ఈనెల 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో సమర్పించిన సంగతి తెలిసిందే. నిజమైన ఆవు నెయ్యి కిలో రూ.319.80కు సరఫరా చేయడం సాధ్యం కాదని.. యూపీలోని భోలే బాబా డెయిరీ, దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ కూడా తిరుమలకు నాణ్యత లేని, కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు చార్జిషీట్‌లో తెలిపినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం చార్జిషీట్‌లో ఏమున్నదంటే.. టీటీడీ బోర్డు సిఫారసుల మేరకు 2020 జనవరిలో ప్రొఫెషనల్‌ కమిటీ ఏర్పాటు చేసి టెండర్‌ నిబంధనలను సడలించారు. రోజుకు 4లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉండాలనే నిబంధన తొలగించారు. డెయిరీ నిర్వహణ అనుభవం మూడేళ్ల నుంచి ఏడాదికి కుదింపు, రోజుకు ఆవు పాల కొవ్వు సామర్థ్యం 12 టన్నుల నుంచి 8టన్నులకు తగ్గింపు, వార్షిక టర్నోవర్‌ రూ.250కోట్ల నుంచి రూ.150కోట్లకు తగ్గించడంతో సహకార డెయిరీలకు టెండర్లు దక్కకుండా పోయాయి. ప్రైవేటు డెరు ురీలకు లాభం చేకూరింది. పాలు సేకరించని, కనీస అనుభవం లేని డెయిరీలు టెండర్లలో పాల్గొనడంతో నెయ్యి నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడింది. ఫిబ్రవరి 2020లో ఇచ్చిన ఈ సడలింపులపై 2023లో బోర్డు సమీక్షించి చిన్న డెయిరీల నెయ్యివల్లే లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు పెరిగాయని గుర్తించింది. కల్తీలేని నెయ్యి కోసం నిబంధనలను కఠినతరం చేయడంతో పరిస్థితి మెరుగుపడింది.


కుట్ర జరిగిందిలా..

భోలే బాబా సంస్థ డైరెక్టర్లు పోమిల్‌ జైన్‌(ఏ3), విపిన్‌ జైన్‌ (ఏ4)తో పాటు సారిక జైన్‌(ఏ 21), పూనమ్‌ జైన్‌(ఏ 22) 2019 నుంచి 2024 మధ్యలో టీటీడీకి నెయ్యి సరఫరాలో క్రిమినల్‌ కుట్రకు పాల్పడినట్లు సిట్‌ గుర్తించినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కొందరు టీటీడీ అధికారులు, ఇతర డెయిరీ సంస్థలతో కలిసి కల్తీనెయ్యి తయారీకి తెగబడింది. తమ సంస్థలైన హర్ష ట్రేడింగ్‌ కంపెనీ, హర్ష ఫ్రెష్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా కోల్‌కతాకు చెందిన బుజే బుజే రిఫైనరీస్‌ లిమిటెడ్‌, మరికొన్ని సంస్థల నుంచి పామోలిన్‌ కొనుగోలు చేశారు. ఈ సంస్థ కీలక ఉద్యోగులు హరి మోహన్‌ రాణా (ఏ 12), సంజయ్‌ చౌహాన్‌ (ఏ 13), ఆశిశ్‌ రోహిల్లాతో (ఏ 140) కలిసి పాలు లేదా వెన్న సేకరించకుండానే భోలే బాబా డెయిరీలో రిఫైన్డ్‌ పామ్‌ ఆయిల్‌, కర్నెల్‌ ఆయిల్‌, రిఫైన్డ్‌ ఓలీన్‌ను అతి తక్కువ పరిమాణంలో ఉన్న నెయ్యితో కలిపి, ల్యాబ్‌ పరీక్షలను మేనేజ్‌ చేసేందుకు, సువాసన నిలిపేందుకు బీటా క్యారోటిన్‌, అసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌, ఫుడ్‌ గ్రేడ్‌ లాక్టిక్‌ యాసిడ్‌, మోనో గ్లిసరైడ్‌, నెయ్యి ఫ్లేవర్‌ వంటి రసాయనాలు ఉపయోగించి నెయ్యి లాంటిది తయారు చేసినట్లు సిట్‌ పేర్కొంది. ఇదే విషయాన్ని 2025 మార్చిలో గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ సీఏఎల్‌ఎఫ్‌, ఆనంద్‌ నివేదిక నెయ్యి ప్రమాణం చాలా తక్కువగా ఉన్నట్లు ధ్రువీకరించినట్లు తెలిపింది. భోలే బాబా డెయిరీలో 68లక్షల కిలోలకు పైగా కెమికల్‌ నెయ్యి తయారు చేసినట్లు సిట్‌ ఆధారాలతో తేల్చింది. టీటీడీ నెయ్యి టెండర్లకు అర్హులు కాకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించి పాల్గొంది. పామిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, అపూర్వ చావ్డా, శ్రీ వైష్ణవీ డెయిరీ, రాజేశ్‌ మన్సుఖ్‌ లాల్‌ చావ్డా, మచింద శాంతారామ్‌, రాజు రాజశేఖరన్‌లు గ్రూపుగా ఏర్పడి కుట్ర చేసినట్లు పేర్కొంది. భోలే బాబా డైరెక్టర్లయిన నలుగురు జైన్‌లు, అజయ్‌ కుమార్‌ సుగంధ్‌, మహేశ్‌ రోహిరా రసాయనాలతో రిఫైన్డ్‌ పామాయిల్‌, కర్నెల్‌ ఆయిల్‌, పామ్‌ఓలిన్‌ను కొబ్బరినూనెగా చూపుతూ తప్పుడు ఇన్వాయి్‌సలు చూపారని వెల్లడించింది. రవీంద్ర శర్మ(ఏ23) కూడా నెయ్యి నివేదికల్ని తారుమారు చేసి ల్యాబ్‌ రిపోర్టులు సృష్టించినట్లు తెలిపింది. టీటీడీ ప్లాంట్‌ తనిఖీ సభ్యులు, ఉద్యోగులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి సరైన తనిఖీలు చేయకుండా తప్పుడు నివేదికలు సమర్పించారు. ఫలితంగా నాణ్యతలేని నెయ్యి టీటీడీకి 60లక్షల కిలోలు సరఫరా అయింది. సుమారు రూ.235 కోట్ల మేర టీటీడీకి నష్టం కలిగించారని, అంతకుమించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని చార్జిషీట్‌లో సిట్‌ పేర్కొన్నట్లు తెలిసింది.


కల్తీ నెయ్యిని నిర్ధారించిన 500 ఆధారాలు

టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సహాయకుడు కుందూరు చిన్నప్పన్న(ఏ24)తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కిలోకు రూ.25 చొప్పున లంచం డిమాండ్‌ చేయగా సరఫరా దారులు నిరాకరించారు. దీంతో టెండర్‌ అర్హతను ప్రభావితం చేసినట్లు సిట్‌ తేల్చింది. అనంతరం మరో సంస్థకు అధిక రేటుకు టెండర్‌ ఇప్పించి 50లక్షలు తీసుకున్నట్లు అభియోగ పత్రంలో తెలిపినట్టు తెలిసింది. ఏ-16అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ నుంచి ఏ36 జయరాజ్‌ వరకూ నిందితులందరూ సాక్ష్యాల్ని నాశనం చేయడం, నెయ్యి కల్తీ చేయడం, హనికరమైన ఆహార పదార్థాల విక్రయం, నమ్మక ద్రోహం, టీటీడీకి నష్టం కలిగేలా తెలిసి మోసం చేయడం, నకిలీ పత్రాల తయారీ, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభావితం చేయడం, వాణిజ్యసంస్థల ద్వారా అనుచిత లబ్ధి పొందడం, అధికార దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడినట్లు చార్జిషీట్లో సిట్‌ వివరించినట్టు సమాచారం. 2024లో నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో నాణ్యత ప్రమాణాల లోపాలు వెలుగులోకి రావడంతో నమూనాలను ఎన్‌డీడీబీ ప్రయోగశాలకు పంపారు. అందులో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. దీంతో క్రిమినల్‌ కేసు నమోదు చేసిన సిట్‌ ... ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, ఢిల్లీలోని పలు డెయిరీ సంస్థలు సమన్వయంతో కుట్ర పన్నినట్లు తేల్చింది. ఖాళీ రసీదులు ముందే వాట్సా్‌పలో పంపడం, ఒకే వాహన నెంబర్లు పదేపదే సరఫరాలో చూపడం సరుకు తరలించకుండానే రికార్డులు సృష్టించినట్లు తేలింది. చార్జిషీట్‌లో పేర్కొన్న ల్యాబ్‌నివేదిక ప్రకారం బ్యూటరిక్‌ ఆమ్లం పరిమాణం తక్కువగా ఉండటం వల్ల నిజమైన పాల కొవ్వు బాగా తక్కువగా ఉందని, బీటా సిటోస్టెరాల్‌ అనే వృక్ష స్టెరాల్‌ ఉనికితో ఈ నమూనాల్లో పామాయిల్‌, పామ్‌ స్టిరిన్‌, పామ్‌ కర్నెల్‌ మిశ్రమం ఉన్నట్లు నిపుణుల నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. డబ్బు మొత్తం హవాలా మార్గంలో బ్యాంకుల బయట ఢిల్లీ, గ్వాలియర్‌, బీకనేర్‌, ఘాజియాబాద్‌, సహరాన్‌పూర్‌, విజయవాడ, హైదరాబాద్‌లో మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరిగినట్లు ఆధారాలు సమర్పించింది. ప్రతి ట్యాంకర్‌ నెయ్యికి కమీషన్‌ తీసుకున్నారని, ప్రొక్యూర్మెంట్‌, ఇంజనీరింగ్‌, టెక్నికల్‌ విభాగాల సిబ్బంది ఇందులో ఉన్నారని వివరించింది. నిందితుల మధ్య సంభాషణలు, చాటింగ్‌ తదితర ఆధారాలు తొలగించినా డిజిటల్‌ ఫోరెన్సిక్‌ వెలికి తీసిందంటూ సుమారు 500 ఆధారాలు సమర్పించింది.

Updated Date - Jan 29 , 2026 | 05:52 AM