Share News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:11 AM

భారత పౌర విమానయాన రంగానికి నూతన దిశను అందించడంతో పాటుగా కొత్త ఆవిష్కరణలు, ఒప్పందాలు, అవకాశాల పట్ల అవగాహన కల్పించడమే ధ్యేయంగా హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా-2026 ప్రదర్శన ప్రారంభమైంది.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

  • వింగ్స్‌ ఇండియా-2026ను ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

  • అబ్బురపరిచిన జెఫ్రీస్‌, సూర్యకిరణ్‌ బృందాల విన్యాసాలు

  • ఆకట్టుకున్న డ్రైవర్‌రహిత ఎయిర్‌ ట్యాక్సీ నమూనాలు!

  • ప్రపంచ విమానయాన కేంద్రంగా భారత్‌: ప్రధాని మోదీ

హైదరాబాద్‌ సిటీ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): భారత పౌర విమానయాన రంగానికి నూతన దిశను అందించడంతో పాటుగా కొత్త ఆవిష్కరణలు, ఒప్పందాలు, అవకాశాల పట్ల అవగాహన కల్పించడమే ధ్యేయంగా హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా-2026 ప్రదర్శన ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు బేగంపేట విమానాశ్రయం వేదికగా జరిగే ఈ షోను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు బుధవారం ఉదయం ప్రారంభించారు. పౌరవిమానయాన శాఖతో కలిసి ఫిక్కీ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలు సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. ఇది ఆసియాలోనే అతి పెద్ద పౌర విమానయాన ప్రదర్శన.. ఇందులో వివిధ దేశాలకు చెందిన విమానయాన సంస్థలు 30కు పైగా హెలికాప్టర్లు, విమానాలు, ఎయిర్‌ క్రాప్ట్స్‌ను ప్రదర్శిస్తున్నాయి. మార్క్‌ జెఫ్రీస్‌ బృందం, సూర్యకిరణ్‌ బృందాలు చేసిన వైమానిక విన్యాసాలు తొలిరోజు సందర్శకులను అబ్బురపరిచాయి. విమానయాన సంస్థల కొత్త ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి.

డ్రైౖవర్‌ లేకుండానే ఎగిరే ఎయిర్‌ ట్యాక్సీ...!

ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన అనుబంధ సంస్థ విస్క్‌ కొత్త రకం ఎయిర్‌ క్రాప్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. వింగ్స్‌ ఇండియా-2026 ప్రదర్శనలో ఈ కొత్త ఎయిర్‌ ట్యాక్సీ నమూనాను ప్రదర్శించింది. డ్రైవర్‌ లేకుండానే విహరించేలా.. నలుగురు ప్రయాణికులు ప్రయాణించేలా దీన్ని డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని.. త్వరలో మరింత అభివృద్ధి చేసి వినియోగంలోకి తెస్తామని విస్క్‌ ప్రతినిఽధి తెలిపారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తేవడమే తమ కంపెనీ లక్ష్యమని వెల్లడించారు. ‘వినూ త్న డిజైన్‌తో పాటు విద్యుత్తుతోనే పనిచేసేలా దీన్ని రూపొందిస్తున్నాం. డ్రైవర్‌ లేకుండానే స్వయంచాలక విధానంలో పనిచేసేలా తయారు చేస్తున్నాం.. ఇది రానున్న కాలంలో నగర రవాణా ముఖచిత్రాన్నే మార్చే అవకాశముంది’ అని వ్యాఖ్యానించారు.


ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయమార్కెట్‌: ప్రధాని

ప్రపంచ విమానయాన కేంద్రంగా భారత్‌ మారుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్‌ పరిణామం చెందిందని, గత దశాబ్ద కాలంలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. వింగ్స్‌ ఇండియా షో ప్రారంభం సందర్భంగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. విమానయాన పరిశ్రమ ఎన్నో ఆకాంక్షలతో నిండి ఉందని, భారత్‌ ఒక కీలక మార్కెట్‌ శక్తిగా ఎదుగుతోందన్నారు. విమానాల తయారీ, పైలట్‌ శిక్షణ, అధునాతన ఎయిర్‌ మొబిలిటీ, విమానాల లీజింగ్‌లో భారత్‌ అందించే విస్తారమైన అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రయాణికుల రద్దీ మేరకు భారత విమానయాన సంస్థలు సేవలు విస్తరిస్తున్నాయని.. ఇటీవలి కాలంలో 1500కు పైగా విమానాలను ఆర్డర్‌ చేశాయని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు సులభంగా విమాన ప్రయాణం చేయడానికి వీలుగా.. టైర్‌ 2, టైర్‌ 3 నగరాలు విమానాశ్రయాలతో అనుసంధానించినట్లు తెలిపారు. 2014 నాటికి దేశంలో 70 విమానాశ్రయాలుంటే నేడు ఆ సంఖ్య 160కి పైగా పెరిగిందన్నారు.

3.jpg4.jpg2.jpg

Updated Date - Jan 29 , 2026 | 06:11 AM