మేడారం వెళ్లొద్దాం!
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:15 AM
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ‘తెలంగాణ కుంభమేళ’గా పిలిచే మేడారం మహాజాతర జోరు అనధికారికంగా నెల రోజుల ముందే మొదలయ్యింది. ఈసారి జాతర అందరికీ సరికొత్తగా కనిపించనుంది.
అక్కడ గుడి ఉండదు... విగ్రహాలు కనిపించవు... వేద మంత్రాలు వినిపించవు... హోమాలు, యాగాల సందడే ఉండదు.. అయినా లక్షలాది మంది భక్తుల శరణు ఘోషతో జంపన్నవాగు శిగమూగుతుంది. వన దేవతల రాక కోసం లక్షల కళ్లు నిరీక్షిస్తాయి. అడవి నుంచి తల్లులను తీసుకొచ్చే గిరిజన పూజారుల కాళ్లు తాకేందుకు పొర్లు దండాలు పోటెత్తుతాయి. ఎదురుకోళ్లు గాలిలోకి ఎగురుతాయి. ప్రకృతి దేవతల కొలువైన ‘మేడారం’ ఈసారి సరికొత్త రూపు సంతరించుకుంది. ఆదివాసీ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలా కనిపించే... తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలోకి ఓసారి వెళ్లొద్దాం...
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ‘తెలంగాణ కుంభమేళ’గా పిలిచే మేడారం మహాజాతర జోరు అనధికారికంగా నెల రోజుల ముందే మొదలయ్యింది. ఈసారి జాతర అందరికీ సరికొత్తగా కనిపించనుంది. రాబోయే 200 ఏళ్లు చెక్కు చెదరకుండా గ్రానైట్‌పై ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలిసేలా శిల్పాకళా సంపదతో మేడారం గద్దెలు, ప్రాంగణం ముస్తాబయ్యింది. గద్దెల విస్తరణ, ఆలయ ప్రాంగణం చుట్టూ గ్రానైట్ రాతి ప్రాకార నిర్మాణం, ఎత్తయిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పాలరాతి శిలలతో గద్దెలు, జంపన్నవాగు సుందరీకరణ, నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ, క్యూలైన్లు, సత్రాలు, వాచ్ టవర్లు, గ్రీనరీ... అభివృద్ధి నిధులతో మేడారం రూపురేఖలే మారిపోయాయి.
స్తంభాలపై సంస్కృతిని చెక్కారు...
‘మేడారం’లో ఒకప్పుడు ఇరుకుగా ఉండే ప్రాకారం ఇప్పుడు భారీగా విస్తరించారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఒకవైపు... పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు దక్షిణం వైపు ఉండేవి. ప్రస్తుతం ఒకే వరుసలో సమ్మక్క, సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను కూడా నిర్మించారు. గద్దెలు ఒకే వరుసలో రావటంతో వన దేవతలకు మొక్కులు చెల్లించుకునే భక్తులు లోపలికి రావడానికి నాలుగు ద్వారాలు... మొక్కుల అనంతరం బయటకు వెళ్లేలా నాలుగు ద్వారాలు ఏర్పాటు చేశారు. అంటే... అష్టదిక్కుల్లో అష్ట ద్వారాలను ఏర్పాటు చేశారు.
గద్దెల చుట్టూ నిర్మించిన 32 గ్రానైట్ స్తంభాలపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను చెక్కారు. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7 వేలకు పైగా శిల్పాలను ఏర్పాటు చేశారు. 930 ఏళ్ల కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్పాలకు రూపకల్పన చేశారు. గద్దెల ముందు తెల్లని గ్రానైట్ స్తంభాలతో చిలుకలగుట్టకు వెళ్లే దారిలో తూర్పు దిశగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం ఆకర్షణీయంగా ఉంది. ఈ స్వాగత తోరణ శిలలపై సమ్మక్క-సారలమ్మ పూర్వీకులతో పాటు, కోయల జీవనశైలి తెలిసేలా బొమ్మలు చెక్కారు. తెలుపు రంగు రాళ్లను ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు తరలించారు. అక్కడి శిల్పులతో చెక్కించాక మేడారానికి తీసుకొచ్చారు. ఆళ్లగడ్డలో దాదాపు 450 మంది కళాకారులు నె లల తరబడి రేయింబవళ్లు శ్రమించి, మేడారం చరిత్రకు కొత్త రూపునిచ్చారు.
గద్దెల చుట్టూ 8 రాతి స్తంభాలు...
మేడారం జాతరలో ప్రధానమైన గద్దెలను పునర్నిర్మించారు. వృత్తాకారంలో ఉండే నలుగురు వనదేవతల గద్దెల చుట్టూ 25 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో 8 గ్రానైట్ రాతి స్తంభాలు ఏర్పాటు చేశారు. వీటి మధ్యలో... వెదురు బొంగుల రూపంలో ఉన్న వన దేవతలను ప్రతిష్టించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు... కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఉడుము, ఏనుగు, నెమలి, మొసలి, ఎద్దు, ఖడ్గమృగం, సింహం, మనుబోతు, నాగుపాము తదితర పశుపక్ష్యాదుల చిత్రాలను ఏర్పాటు చేశారు. కోయల జీవనశైలికి, ఆచార సాంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక , బండి చక్రాలు, కంకవనం, అడ్డ, నిలువు గీతలకు గ్రానైట్ రాతి స్తంభాలపై చోటు దక్కింది. అలాగే, సమ్మక్క-సారలమ్మ వంశస్తులైన దాదాపు 250 కోయలఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా ఈ గిరిజనుల చరిత్రను భావితరాలు తెలుసుకునే అవకాశం దక్కుతుంది.
ఒంటికొమ్ము దుప్పి... సమ్మక్కకు ఇష్టదైవం...
కోట్లాది మంది భక్తుల గుండెల్లో ఆరాధ్యదైవంగా నిలిచిన సమ్మక్క తన ఇంటి దైవంగా ఒంటికొమ్ము దుప్పిని కొలిచేవారు. చిలుకలగుట్ట వైపు నిర్మించిన ప్రధాన స్వాగత తోరణం మీద ఈ ఒంటికొమ్ము దుప్పి చిత్రాన్ని అగ్రభాగాన ఏర్పాటు చేశారు. ఒంటికొమ్ము దుప్పి పక్కనే అడవిదున్న కొమ్ములు, వాటిపై ఆరు నెమలీకలను చెక్కారు. కోయ తెగలో ముఖ్యమైన బేరంబోయిన రాజు (పశుపతి) ఆరో గొట్టు ప్రతిరూపంగా... ఇప్పటికీ గిరిజనులు నెమలీకలు ధరించి నృత్యం చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇక 3వ గొట్టు సారలమ్మ, కాకా ఆమడరాజు వంశ వృక్షం. ఆదివాసీల్లో వివాహాలు గొట్టు, గోత్రం ఆధారంగానే జరుగుతాయి.
గిరిజనులే పూజారులు
మేడారం మహాజాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో జరుగుతుంది. ఈ జాతరలో పూజారులంతా గిరిజనులే. జాతరలో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజు, గోవిందరాజులు ప్రధాన దేవతలు. ఈ నలుగురు ఆదివాసీ దేవతలకు వేర్వేరు ప్రదేశాల్లో గుడులున్నాయి. జాతర సందర్భంగా వీరంతా మేడారం గ్రామానికి చేరుకుంటారు. సమ్మక్క ప్రధాన ఆలయం మేడారం గ్రామంలోనే ఉంది. 1946కు పూర్వం సమ్మక్క ప్రధానం ఆలయం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో ఉండేది. ప్రతీ రెండేళ్ళకోసారి అక్కడ జాతర జరిగేది. మేడరాజుకు బయ్యక్కపేట సమీపంలోని అడవుల్లోనే సమ్మక్క దొరికిందని, ఆమె బయ్యక్కపేట వాస్తవ్యురాలేనంటూ ఆ గ్రామస్థులు నేటికీ ప్రగాఢంగా విశ్వసిస్తారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు 12వ శతాబ్దంలో బయ్యక్కపేటలో జాతరను ప్రారంభించారు. నాటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతర బయ్యక్కపేటలో కొనసాగింది.
1946 నుంచి మేడారంలో...
1944 తరువాత జాతరను నిర్వహించే చందా పరమయ్య, చందా భూపతయ్య, చందా జోగయ్య, చందా రామన్న మధ్య ఏర్పడిన విభేదాలతో... జాతరను బయ్యక్కపేటలో జరపడం నిలిపివేశారు. 1944 జనవరి 6న అప్పటి ములుగు తహసీల్దార్ బయ్యక్కపేట జాతర నిర్వాహణకు కమిటీ వేశారు. అయితే బయ్యక్కపేట జాతర నిర్వహించడానికి ఒప్పందం కుదరకపోవడంతో, మేడారానికి చెందిన సమ్మక్క పూజారులకు (వడ్డెలు) నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి సమ్మక్క పూజారులే జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. అలా 1946లో తొలిసారిగా మేడారంలో సమ్మక్క జాతర మొదలైంది. బయ్యక్కపేటకు చెందిన చందా వంశీయులు సమ్మక్కను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. కాగా ప్రస్తుతం సిద్ధబోయిన, కొక్కెర వంశాలకు చెందినవారు సమ్మక్క ప్రధాన పూజారులుగా కొనసాగుతున్నారు. వీరంతా గిరిజనులే. సమ్మక్కకు సంబంధించిన ప్రధాన పూజలన్నీ ఆదివాసీ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇక జాతరలో సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువచ్చే కీలకమైన బాధ్యతను సమ్మక్క వడ్డెగా ఉన్న కొక్కెర కృష్ణయ్య నిర్వర్తిస్తారు.
సారలమ్మ ప్రధాన ఆలయం ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కన్నెపల్లి గ్రామంలో ఉంది. మేడారం-కన్నెపల్లి మధ్య మూడున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాకా సారయ్య, సారలమ్మ ప్రధాన పూజారి. జాతర సందర్భంగా తొలిరోజు జరిగే వేడుకల్లో సారలమ్మ మేడారం ప్రయాణం ముఖ్యమైనది. హనుమంతుడి జెండా తోడు రాగా... సారలమ్మ మేడారం బయలుదేరుతుంది. మార్గమధ్యలో జంపన్నవాగు గుండా కాలినడకన నడుస్తూ ఆలయానికి చేరుకుంటారు. ఇక సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు ఆలయం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉంది.
పెనక బుచ్చిరాములు పగిడిద్దరాజు ప్రధాన పూజారి. పగిడిద్దరాజు తమ్ముడైన గోవిందరాజులు ఆలయం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో ఉంది. మేడారం- కొండాయి మధ్య పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదంతా అటవీమార్గం. జాతర జరిగే మొదటి రోజు బుధవారం ఉదయం నుంచి కొండాయిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం పడిగే రూపంలోని గోవిందరాజులుని తీసుకుని మేడారం బయలుదేరుతారు. నాలుగు గ్రామాల్లో ఉన్న ఈ నలుగురు వన దేవతలకు పూజారులంతా కూడా గిరిజనులే. పూజా విధానం కూడా ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది.
బెల్లం బంగారమాయే..!
సమ్మక్క జాతరలో బెల్లానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. జాతరలో బెల్లాన్ని ‘బంగారం’ అని పిలుస్తారు. ఇక్కడ ప్రసాదం కూడా బెల్లమే. అసలు బెల్లం ఎందుకు బంగారమయ్యింది? ఒకానొక సందర్భంలో మేడారం వైపు వచ్చిన కొందరు సంపన్నులు సమ్మక్కను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వారి కోర్కెలు నెరవేరడంతో మళ్లీ రెండేళ్ల తరువాత జాతరకు వచ్చి స్వర్ణాభరణాలు, విలువైన కానుకలు సమర్పించారట. దాన్ని చూసిన ఓ నిరుపేద భక్తుడు ‘‘మా ఇష్టదైవమైన నీకు ఏమీ సమర్పించుకోలేకపోతున్నాం. బతుకే బరువైన మేం అంత బంగారం ఎక్కిడి నుంచి తీసుకురావాలి? నీ అనుగ్రహం ఎలా పొందాలమ్మా’ అంటూ సమ్మక్కను వేడుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడట. సమ్మక్క ఆ భక్తుడికి కలలో కనిపించి ‘బిడ్డా... నీ దగ్గరున్న బెల్లమిస్తే చాలు... బంగారం ఇచ్చినట్లే. బెల్లాన్ని నైవేద్యంగా పెడితే నీ కోర్కెలు తీరుస్తా’ అని అమ్మవారు సెలవిచ్చారట. దాంతో ఆ పేదవాడు నిలువెత్తు బెల్లాన్ని తూకం వేసి తల్లికి సమర్పించుకుంటే అతడి కష్టాలు తీరినట్లు చెబుతారు. మేడారంలో సమ్మక్క, సారలక్కలకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. గద్దెల వద్ద తల్లుల పాదాల చెంత పడే బెల్లానికి ఎంతో పవిత్రత ఉంటుందని నమ్ముతారు.
తల్లులకు తీరొక్క మొక్కు..
గద్దెలపై కంక మొదల్లతో దర్శనమిచ్చే ఈ వన దేవతలకు బంగారం సమర్పణతో పాటు ఒడి బియ్యం, శివసత్తుల పూనకాలు, ఎదురుకోళ్లు ఇలా ఎన్ని మొక్కులో. ప్రకృతి ఒడిలో ఉన్న ఆ తల్లులను స్మరించుకుంటూ మొక్కే ప్రతీ మొక్కుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ మొక్కులలో ఒడి బియ్యం సమర్పణ ఒకటి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ ఇంటి నుంచే ఒడిలో బియ్యాన్ని తీసుకొస్తారు. నూతన వస్త్రంలో ఐదు సోరల బియ్యాన్ని పోసుకొని ముడుపుగా నడుముకు కట్టుకొని జాతరకు చేరుకుంటారు. ఈ బియ్యంలో పసుపు, కుంకుమతోపాటు రవిక ముక్కలు, కుడుకలు, చీరెలు కూడా ఉంచుతారు. సమ్మక్క సారలమ్మను తమ ఆడపడుచులుగా భావించి దర్శనం అనంతరం తల్లులకు ఈ బియ్యాన్ని మొక్కుగా చెల్లిస్తారు. ఈ మొక్కువల్ల తమ వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, కుటుంబం బాగుంటుందని భక్తులు విశ్వసిస్తారు.
మేడారానికి వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేయనిదే వెళ్లరు. కుంభమేళలో గంగానది వెంట ఇసుక వేస్తే రాలని జనం ఎలా ఉంటారో... జంపన్న వాగు వద్ద అదే పరిస్థితి కనబడుతుంది. అలాగే సంతానం లేని భక్తులు వచ్చే జారత నాటికి సంతానం కలగాలని వరం పడుతారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, వెదురు వనం, కొబ్బరికాయలతో పూజలు జరిపి ముడుపులు కడుతారు. అక్కడి నుంచి తడిబట్టలతో నేరుగా సారలమ్మ గుడికి చేరుకుంటారు. సారలమ్మను గద్దెకు తీసుకువచ్చే సమయంలో దారికి అడ్డంగా పడుకొని, సాష్టాంగ నమస్కారం చేస్తూ తమ కోర్కెను మనసులో తలుచుకుంటారు. సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి మేడారంలోని గద్దెపైకి వెళ్లేటప్పుడు పూజారులు వీరి పైనుంచి దాటుకుంటూ వెళ్తారు. అలా చేస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని, తమకు సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
సమ్మక్క సారలమ్మ జాతరలో ఎదురుకోళ్ల మొక్కు ప్రధానమైనది. సమ్మక్క సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తున్న క్రమంలో భక్తులు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు. తమ చేతిలో ఉన్న కోళ్లను తల్లులను తీసుకువస్తున్న సమయంలో ఎదురుగా ఎగరవేస్తూ మొక్కుకుంటారు. ఎగరేసిన కోడిని అనంతరం తల్లులకు బలిస్తారు. జాతరలో మేక పొట్టేలు, కోళ్లను బలివ్వడం ఆనవాయితీగా వస్తోంది. మరికొందరు భక్తులు తొట్టెలు కట్టి మొక్కు తీర్చుకుంటారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలో ఉన్న చెట్టు వద్ద తొట్టెలు (ఊయల) కట్టి మొక్కు చెల్లించుకుంటారు. జాతరలో మరో ప్రధానమైన మొక్కు తలనీలాలు. మేడారం జాతరకు ముందే చాలామంది వేములవాడకు వెళ్లి వస్తుంటారు. చిన్నపిల్లలకు వేములవాడలో తలనీలాలు ఇచ్చిన తర్వాత మేడారం జాతరలోనూ తలనీలాలు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. జంపన్న వాగు వద్ద మూడు చోట్ల తలనీలాల కోసం కల్యాణ కట్టలను ఏర్పాటు చేశారు.
ఆద్యంతం... ఉద్విగ్నభరితం...
జాతరపై ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నా... అన్నింట్లోనూ కాకతీయులతో యుద్ధం అనంతరం సమ్మక్క చిలుకలగుట్టకు వెళ్లి అదృశ్యమైందని చెబుతుంటారు. కోయ గిరిజనులు తమ ఇలవేల్పు అయిన సమ్మక్క కోసం వెతుకుతూ చిలుకలగుట్టపైకి వెళ్లగా... ఆ గుట్టపై కుంకుమభరిణె రూపంలో సమ్మక్క కనిపించిందని చెబుతుంటారు. అదే నమ్మకంగా మహాజాతరకు చిలుకలగుట్ట నుంచే గిరిజన పూజారులు సమ్మక్కను గద్దెకు తీసుకువస్తుంటారు. సమ్మక్క ఆగమనం జాతరలో మహాఘట్టం అయితే... సమ్మక్కను చిలుకలగుట్టపైన ఎక్కడి నుంచి గద్దెలకు చేరుస్తారనేది రహస్యమే.
చిలుకలగుట్ట.. సమ్మక్క కొలువైన క్షేత్రం. మాఘశుద్ధ పౌర్ణమి గురువారం రోజున సమ్మక్కను గద్దెకు చేర్చేందుకు డప్పుచప్పుళ్లతో గిరిజన నృత్యాలు, పాటలతో చిలుకలగుట్ట వద్దకు చేరుకుంటారు. గుట్ట పాదాల దగ్గర ఉన్న వాగు వద్ద అందర్నీ నిలిపివేస్తారు. గుట్ట పైకి మాత్రం సమ్మక్క పూజారి కొక్కెర కిష్టయ్యతోపాటు మరో నలుగురు గిరిజన పూజారులు రహస్య ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ సమ్మక్క తల్లే కుంకుమభరిణె రూపంలో కొలువై ఉందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలోనే సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భక్తులు ఉద్విగ్నానికి గురవుతారు.
కలెక్టర్ పర్యవేక్షణలో ఎస్పీ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. సమ్మక్కను గద్దెలపైకి తీసుకువచ్చే క్రమంలో లక్షలాది మంది భక్తులు ఎదురుకోళ్లు ఇవ్వడం, జంతు బలులు చేయడం, పొర్లుదండాలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. శివసత్తుల పూనకాలతో మేడారం జాతర మొత్తం మహా ఉద్విగ్నంతో సమ్మక్కకు జేజేలతో స్వాగతం పలుకుతారు. జాతరలో అత్యంత ఉద్విగ్నభరిత మహాఘట్టమిదే. తల్లి గద్దెల మీదకు చేరుకున్న మరుక్షణం నుంచే భక్తులు మొక్కులు చెల్లిస్తూ చేసే జయజయధ్వానాలతో మేడారం హోరెత్తుతుంది. జన జాతర తారాస్థాయికి చేరుకుంటుంది. ఆ భక్తి హోరులో తడిసి ముద్దయినప్పుడే... జాతర దివ్యత్వం ఎవరికైనా అనుభవంలోకి వస్తుంది.
- తడుక రాజనారాయణ, వరంగల్
ఫొటోలు: వీరగోని హరీష్
జాతరలో ముఖ్య ఘట్టాలు
- జనవరి 28: కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెకు వస్తారు.
- జనవరి 29: చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెకు చేరుతుంది.
- జనవరి 30: తల్లులు గద్దెలపై కొలువై ఉండటంతో భక్తజనం మొక్కులు చెల్లిస్తారు.
- జనవరి 31: సాయంత్రం వన దేవతలు వారివారి ప్రాంతాలకు తిరుగుముఖం పట్టడంతో జాతర ముగుస్తుంది.
1998లో రాష్ట్ర పండగగా గుర్తింపు...
రెండేళ్లకు ఒకసారి నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరను ‘తెలంగాణ కుంభమేళ’ అని పిలుస్తారు. 1889లో అప్పటి నిజాం ప్రభుత్వం మత వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఓ శాఖను ఏర్పాటు చేసింది. ఈ శాఖ ఆధ్వర్యంలోనే హిందు దేవాలయాలను పర్యవేక్షించడంతో పాటు మేడారం మహాజాతరను కూడా నిర్వహించేవారు. 1944 నుంచి ప్రభుత్వం జాతర కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. 1967లో మేడారం జాతరను దేవాదాయశాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మేడారం మహా జాతర జరుగుతూ వస్తోంది. కాగా, 1998లో మేడారం జాతరను రాష్ట్ర పండగగా గుర్తించారు. అప్పటి నుంచే జాతరకు భక్తులు పోటెత్తుతుండటంతో జాతీయ పండగగా గుర్తించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఆదివాసీల చరిత్ర... అందరికీ తెలిసేలా...
రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో జరుపుతున్న పునరుద్ధరణ పనులతో ఆదివాసీల చరిత్రకు శాశ్వత గుర్తింపు లభించింది. మేడారం జాతరలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయలు భవిష్యత్తు తరాలకు తెలిసేలా శిల్పాలు, చిత్రాలను ఏర్పాటు చేయటం అభినందనీయం. గిరిజనుల ఆచారాలు, విశ్వాసాలు కూడా భక్తులకు తెలిసేలా కొత్తరూపు బాగుంది. 930 ఏళ్ల కోయల చరిత్రకు, పునరుద్ధరణ పనులతో గుర్తింపు లభించింది.
- సిద్ధబోయిన అరుణ్‌కుమార్, సమ్మక్క పూజారి
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News