చిల్లర పనులకు రాలేదు
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:37 AM
తాను చిల్లర పనులకు, చిల్లర కార్యకలాపాల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తనకు ఉన్నతమైన ఆలోచనలు, భావాలు ఉన్నాయని తెలిపారు.
నాకు ఉన్నతమైన ఆలోచనలున్నాయి.. రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి
సింగరేణిలో టెండర్లన్నింటిపైనా సిట్‌తో..విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తాను చిల్లర పనులకు, చిల్లర కార్యకలాపాల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తనకు ఉన్నతమైన ఆలోచనలు, భావాలు ఉన్నాయని తెలిపారు. తనది సుదీర్ఘ ప్రయాణమని, ఒక్క రోజులో రాలేదని, ఎన్నో ఒత్తిళ్లకు తట్టుకొని ఇక్కడిదాకా వచ్చానని చెప్పారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని, ఆయన రాసింది పొరపాటు అని పేర్కొంటూ వాస్తవాలను ప్రచురిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. శనివారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లోని జనహిత సమావేశమందిరంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టివిక్రమార్క విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాధాకృష్ణగారూ.. ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి. మీరు రాసిన కథనాలన్నీ తప్పు అని, వాటిని తిరిగి ప్రపంచానికి, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తారని ఆశిస్తున్నా. అలా జరగకపోతే నా పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగినట్లే. 40 ఏళ్లుగా పోగేసుకున్న నా వ్యక్తిత్వ హననం జరిగింది. ఇది తగదు. నేను చిల్లర పనులకు, చిల్లర కార్యకలాపాలకు రాలేదు. నాకు వేరే ఉన్నతమైన ఆలోచనలు, భావాలున్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి కాబట్టి నేను స్పష్టంగా చెబుతున్నా. నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్కరోజుతో, ఒక్క కలంతో కాలరాస్తా అంటే.. చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను. నేను వ్యక్తిగతంగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతున్నా. మీరు రాసింది పొరపాటు అని, తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని భావిస్తున్నా. మీ అవసరాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రంపై, సింగరేణిపై తప్పుడు ప్రచారం చే యొద్దు. మీకేమైనా అనుమానాలుంటే నా ఇంటి తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. ఏ సమయంలో వచ్చి తలుపు తట్టినా చాలు.. వాస్తవాలు బయట పెట్టడానికి సిద్ధం’’ అని భట్టివిక్రమార్క అన్నారు. తప్పుడు ప్రచారంతో రాష్ట్రంపై నిందలు మోపుతున్నారని, ఊహాగానాలతో కూడిన కథనాలు అల్లుకుంటూ రోజుకో కథనం వండి వారుస్తున్నారని ఆరోపించారు. సింగరేణి ఆస్తులను కాపాడే వ్యక్తిగా.. ఈ కథనాలు ఏ రాబందులు, గద్దలు, ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసం రాస్తున్నారని ప్రశ్నిస్తున్నానన్నారు.
ఎవరి ప్రయోజనాల కోసమో తెలియదు..
‘‘పెట్టుబడులు, కట్టుకథల విషపు రాధాకృష్ణ తొలి పలుకుతో లేపిన తెరతో ఈ కథనాలు వస్తున్నాయి. తొలి పలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియదు. తెలిసిన కొద్ది మంది వ్యక్తులకు నైనీ బొగ్గు బ్లాకును కట్టబెట్టడానికి సైట్ విజిట్ నిబంధన పెట్టి, ఎవరో వారికి సంబంధించిన వ్యక్తులకు కట్టబెట్టాలనే ఊహాగానాలతో కథనాలు రాశారు. సింగరేణిని దోచిపెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని రాశారు. వారు రాయగానే.. ఇంకో ఆయన (హరీశ్‌రావు) లేఖ రాశారు. ఇంకో ఆయన (కిషన్‌రెడ్డి) అక్కడి నుంచి వచ్చారు. అసలేంటి మీ ముగ్గురి మధ్య సంబంధం? రాధాకృష్ణ గారూ.. నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు.. పరవాలేదు. వాస్తవానికి ఈ టెండర్లు, ఈ వ్యవహారాలు, రోజువారీ కార్యక్రమాలు ఏ ఒక్క నిర్ణయం కూడా సంబంధిత మంత్రివద్దకు రాదు. ఒక్క ఫైలు కూడా రాదు. సింగరేణి పాలకమండలి బోర్డు 105 ఏళ్లుగా ఏర్పడిన అటానమస్ సంస్థ. నిర్ణయాలన్నీ ఆ సంస్థే తీసుకుంటుంది. విషయ పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరూ ఇది రాయరు. వారం రోజుల్లో రాసింది పొరపాటు అని మార్చుకుంటారని అనుకున్నా’’ అని భట్టివిక్రమార్క అన్నారు.
అన్ని టెండర్లపైనా విచారణకు సిద్ధం..
నైనీ బ్లాక్ టెండర్లపై మాత్రమే కాకుండా.. సింగరేణిలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల టెండర్లపైనా విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారని, హరీశ్‌రావు లేఖ రాస్తే.. సీఎంతిరిగి రాగానే తాను స్వయంగా ఆయనతో మాట్లాడి విచారణకు ఆదేశించేలా చూస్తానని అన్నారు. విచారణ జరిగితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. సింగరేణిపై ‘‘కొన్ని కట్టుకథలు, కొన్ని రాతలు, కొన్ని లేఖలు, కొన్ని రివ్యూలు.. అంతిమంగా 42 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసేలా అపవాదులు ప్రచారం చేస్తున్నారు. హరీశ్‌రావు లేఖ రాయడం మంచికే అయింది. నేనొక్కడినే వాస్తవాలు చెబితే ఎట్లా? లేఖ రాశారు.. వాళ్లు ఎగ్జామిన్ చేస్తున్నారు. దీనిని స్వాగతిస్తున్నా. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. కేవలం కొద్దిమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆస్తులను పెంచుకోవడానికి.. వ్యక్తులపై అడ్డగోలు ప్రచారం చేస్తున్నవారి వాస్తవరూపం బయటికి రావాలి’’ అని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు.
సైట్ విజిట్ నిబంధన పాతదే..
టెండర్లు దాఖలు చేసేవారు విధిగా సైట్‌ను సందర్శించి, ఆ సైట్‌ను సందర్శించినట్లు సర్టిఫికెట్లు పొందడం అనే నిబంధనలు పాతవేనని డిప్యూటీ సీఎం అన్నారు. కాంట్రాక్టు ఇచ్చేటప్పుడు సైట్ విజిట్ అనేది తాము కొత్తగా పెట్టిన నిబంధన కాదని, కోల్ ఇండియాతోపాటు ఎన్‌ఎండీసీ, ఆయిల్ కంపెనీలు ఇతర ప్రధాన కంపెనీల్లో ఇప్పటికే ఈ నిబంధన ఉందని చెప్పారు. ‘‘సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాకు కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్టర్లు ముందుగా సైట్ విజిట్ చేయాలని, ఆ మేరకు గని అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందితేనే కాంట్రాక్టు లో బిడ్డింగ్ చేయడానికి అర్హత కల్పిస్తూ నేనేదో కొత్త నిబంధన పెట్టినట్లు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ నిబంధన దేశంలో మరెక్కడా లేదని, కేవలం కొందరు భట్టి విక్రమార్కకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పగించడానికే ఇలా చేశారంటూ కట్టుకథలు, పిట్టకథలు అల్లి వార్త ప్రచురించారు’’ భట్టివిక్రమార్క విమర్శించారు. 2018, 2021, 2023లో కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్ (సెంట్రల్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్) రూపొందించిన సింగరేణి టెండర్ డాక్యుమెంట్‌లో, ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్‌ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, ఫైనాన్స్ విభాగం, డిఫెన్స్ విభాగం, గుజరాత్ రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర చాలా కంపెనీల్లో చాలా ఏళ్లుగా సైట్ విజిట్ నిబంధన ఉందన్నారు. ఈ మేరకు ఆయా కంపెనీలకు సంబంధించిన టెండర్ లేఖలను చూపించారు. సింగరేణిలో డీజిల్ సరఫరాను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వారా మరో కుంభకోణానికి తెరలేపారన్న హరీశ్‌రావు ఆరోపణలను డిప్యూటీ సీఎం ఖండించారు. డీజిల్ సరఫరా విధానంలో మార్పులు కూడా తమ హయాంలో జరగలేదని, 2022లోనే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ విధాన మార్పులు, డీజిల్ దొంగతనాలను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంట్రాక్టుల్లోనూ ఈ పద్ధతే అమలులో ఉందన్నారు.
సృజన్‌రెడ్డి కంపెనీకి, సీఎంకు సంబంధం లేదు
సింగరేణి సంస్థ టెండర్లను ముఖ్యమంత్రి బావమరిదికి కట్టబెడుతున్నట్లు కట్టుకథను ప్రచారం చేస్తున్నారని భట్టివిక్రమార్క ఆక్షేపించారు. వారు చెబుతున్న సుజన్‌రెడ్డి కంపెనీ శోధా కన్‌స్ట్రక్షన్స్‌కు ఎండీ దీప్తిరెడ్డి అని తెలిపారు. ఆమె బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కుమార్తె అని అన్నారు. ఆమె భర్తే సుజన్‌రెడ్డి అని, ఉపేందర్‌రెడ్డికి అల్లుడని వివరించారు. సింగరేణి వ్యాప్తంగా పలు కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న ఐదు ప్రముఖ కాంట్రాక్టర్లు కూడా బీఆర్‌ఎస్ నేతలకు బంధువులు లేదా సన్నిహితులు అని తెలిపారు.
25 టెండర్లలో 20 బీఆర్‌ఎస్ హయాంలో కట్టబెట్టినవే
సింగరేణిలో ఓవర్ బర్డెన్ తొలగింపునకు సంబంధించి 25 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తుండగా.. వారిలో 20 మంది బీఆర్‌ఎస్ హయాంలోనే టెండర్లు దక్కించుకున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. మిగిలిన ఐదింటిలో నాలుగు టెండర్లు తాము కేటాయించామని, వాటిలో ఒకటి వీకే ఓసీ-2 ప్రాజెక్టు 2022 అక్టోబరులో శోధా కంపెనీకి దక్కిందని, మందమర్రిలోని కల్యాణఖని ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్టు ఆర్.విద్యాసాగర్‌రావు కుటుంబానికి చెందిన ఎక్స్‌ప్రె్‌సవేకు దక్కిందని, దానికి ఎండీ దీక్షిత్‌రావు అని పేర్కొన్నారు. అది ప్రతిమా శ్రీనివాసరావు, వినోద్‌రావు (మాజీ ఎంపీ మేనల్లుడు)కు చెందినదని చెప్పారు. ఇక ఆర్‌జీ ఓసీ-2 ప్రాజెక్టు.. సీ5 ఇంజనీరింగ్ కంపెనీకి దక్కిందని, దీనికి డైరెక్టర్లుగా నిశాంత్‌రావు, మదన్‌మోహన్‌రావు (మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రావు కుమారుడు) ఉన్నారని, వీరు కేసీఆర్, హరీశ్‌రావుకు బంధువులని అన్నారు. ఇక ఎస్‌ఆర్‌పీ ఓసీ-2 ప్రాజెక్టు.. హర్ష కన్‌స్ట్రక్షన్స్ (మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, హరీశ్‌రావుతో సంబంధాలున్న కంపెనీ)కి దక్కిందని వెల్లడించారు.