మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:07 PM
తమపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ క్యాడర్‌తోపాటు అభిమానులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. టీవీలో ప్రసారం అవుతున్నవి ఊహాత్మక కథనాలని.. అవి అబద్ధమని తెలిపారు.
వరంగల్, సెప్టెంబర్ 13: తమపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ క్యాడర్‌తోపాటు అభిమానులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. టీవీలో ప్రసారం అవుతున్నవి ఊహాత్మక కథనాలని.. అవి అబద్ధమని తెలిపారు. తాము ఏ పార్టీలోకి వెళ్లబోమని ప్రకటించారు. కాంగ్రెస్‌లో పుట్టామని.. ఆ పార్టీలోనే కొనసాగుతామని చెప్పారు. ఆదివారం వరంగల్‌లో అభిమానులు, కార్యకర్తల సమావేశంలో భర్త కొండా మురళితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారని బాధపడలేదని అన్నారు. కానీ కారణం లేకుండా తొలగించారనే ఆవేదన మాత్రం తనకు ఉందని తెలిపారు.
ఇకపై మళ్లీ ప్రజల్లోనే ఉంటామని కొండా సురేఖ ప్రకటించారు. అవినీతి చేయకుండా మంత్రిత్వ శాఖ నిర్వహించానని ఈ సందర్భంగా వివరించారు. ఎంపీపీ నుంచి మంత్రి స్థాయికి తాను ఎదిగానని గుర్తు చేసుకున్నారు. పదవి అనేది అలంకారం మాత్రమేనని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే తాను గెలిచానని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ నుంచే పోటీచేసి గెలుస్తానని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి నూటికి నూరు శాతం కొండా సురేఖ గెలుస్తుందని.. మళ్లీ తాను మంత్రి పదవి చేపడతానని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే తనను బర్తరఫ్ చేయడం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇష్టం లేదని అన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి ఫోన్లు వచ్చాయని.. తన భర్త కొండా మురళీకి పదవి ఇస్తామనే సంకేతాలు వెలువడ్డాయని చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో మొట్టమొదటిసారిగా మాట్లాడింది తానేనని ఈ సందర్భంగా కొండా సురేఖ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తనకు మంత్రి పదవి వచ్చిందని అన్నారు. తనకు ఇచ్చిన మూడు శాఖల్లో ఎక్కడా అవినీతికి పాల్పడలేదని గుర్తు చేశారు. పదవి అనేది ఓ అలంకారం మాత్రమేనని చెప్పారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వరంగల్‌లోని 25 డివిజన్‌ల్లో విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు.
అయితే కొన్ని పరిస్థితుల వల్ల తాము పార్టీ మారామని చెప్పారు. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో చేరే అనైతిక రాజకీయాలు చేయలేదన్నారు. సోకాల్డ్ నేతలు.. విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై కొండా సురేఖ పరోక్షంగా విరుచుకుపడ్డారు. కార్పోరేటర్‌గా కూడా గెలువలేని సారయ్య తనను రాజీనామా చేయమంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ సారయ్యను ఈ సందర్భంగా హెచ్చరించారు. తనను బర్తరఫ్ చేసిన రోజు అల్లర్లు చేయాలా? అని అభిమానులు అడిగారని.. కానీ తాము వద్దన్నామని చెప్పారు. తమ ఆదేశాలు పాటించిన అభిమానులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు.
పదవులు వస్తాయి, పోతాయని కొండా సురేఖ చెప్పారు. తమకు అండగా ఉన్న కార్యకర్తలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. గతంలో ఓ నాయకుడిని నమ్ముకుంటే అండగా ఉండే వారని.. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో అలాంటి పరిస్థితి లేదని పెదవి విరిచారు. నమ్ముకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం తాను మంత్రిపదవికి రాజీనామా చేశానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఈ జిల్లా గుంటనక్కలు వెంటబడ్డాయని పేర్కొన్నారు. అప్పటి మంత్రి బస్వరాజు సారయ్యను ఓడించేందుకు కేసిఆర్ తమకు వరంగల్ టికెట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. సారయ్య కుటుంబం ఇంకా భూకబ్జాలు, వసూళ్లకు పాల్పడుతుందని విమర్శించారు. పరకాలను తాము విడిచిపెట్టగానే ఆ స్థానంలో బీఆర్ఎస్ నేత ధర్మారెడ్డి పాగా వేసి కోట్లాది రూపాయలు సంపాదించి.. నాయకులను కొన్నాడని మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టిమ్స్‌లో రాష్ట్రస్థాయి మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ప్రారంభం..
విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..
For More TG News And Telugu News