వరంగల్‌లో అల్లరిమూకల అరాచకం.. పాదచారుడిపై బండరాయితో కిరాతక దాడి
ABN , Publish Date - Apr 11 , 2026 | 10:40 AM
వరంగల్ నగరంలో అల్లరిమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా లేబర్ కాలనీ పరిధిలో ‘కల్యాణ్ గ్యాంగ్’ అనే అల్లరిమూక ఓ సామాన్య పాదచారుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు.
వరంగల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నగరంలో అల్లరిమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. వరుస ఘటనలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా లేబర్ కాలనీ పరిధిలో ‘కల్యాణ్ గ్యాంగ్’ అనే అల్లరిమూక ఓ సామాన్య పాదచారుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. లేబర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని కల్యాణ్ గ్యాంగ్‌కు చెందిన సభ్యులు తమ బైక్‌తో ఢీకొట్టారు.
బండరాయితో దాడి..
ప్రమాదవశాత్తు జరిగిందేమోనని అనుకునే లోపే, ఆ గ్యాంగ్ సభ్యులు సదరు వ్యక్తిని బలవంతంగా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. అక్కడ వారు దారుణంగా ప్రవర్తించారు. బాధితుడిపై బండరాయితో దాడి చేశారు. తీవ్రంగా కొడుతూ బాధితుడిని చిత్రహింసలకు గురిచేశారు. అల్లరిమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆయన ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శాంతిభద్రతలపై ఆందోళన
వరంగల్ నగరంలో గత కొన్ని రోజులుగా అరాచక శక్తులు బరితెగిస్తున్నాయి. ఇటీవల మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ ఏకంగా ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌పైనే దాడికి తెగబడ్డారు. పోలీసులపైనే దాడులు జరుగుతుంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కిరాతక దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి బ్యాచ్‌లు, అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో వరుసగా జరుగుతున్న ఈ దాడులు పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారాయి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే రోడ్లపైకి రావడానికే భయపడాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News