తల్లి చనిపోయినా రాని కొడుకు..
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:50 AM
కన్న తల్లి చనిపోతే తలకొరివి పెట్టడానికి కూడా రాని కుమారుడు.. ఐదు రోజుల తర్వాత గ్రామానికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు.. అతడికి దేహశుద్ధి చేసి, ఊరి పొలిమేర వరకు తరిమికొట్టారు.
ఐదు రోజుల తర్వాత గ్రామానికి
దేహశుద్ధి చేసి పొలిమేర వరకు తరిమిన గ్రామస్థులు
జనగామ జిల్లా తరిగొప్పులలో ఘటన
తరిగొప్పుల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కన్న తల్లి చనిపోతే తలకొరివి పెట్టడానికి కూడా రాని కుమారుడు.. ఐదు రోజుల తర్వాత గ్రామానికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు.. అతడికి దేహశుద్ధి చేసి, ఊరి పొలిమేర వరకు తరిమికొట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నాగబండి పుష్పనీల (83), రామచంద్రం దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రామచంద్రం, ఓ కుమార్తె గతంలోనే చనిపోగా.. వృద్ధాప్యంతో పుష్పనీల ఈనెల 24న మృతిచెందింది. ఈ విషయాన్ని గ్రామస్థులు హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె కుమారుడు ఉపేందర్‌తో పాటు నలుగురు కుమార్తెలకు సమాచారం ఇచ్చారు.
కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలు అంత్యక్రియలకు రాలేమని తేల్చిచెప్పారు. ఇద్దరు కుమార్తెలు అంత్యక్రియలకు హాజరైనప్పటికీ తలకొరివి పెట్టేందుకు నిరాకరించారు. చేసేదేమి లేక గ్రామస్థులే చేయిచేయి కలిపి పంచాయతీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి చనిపోయిన ఐదు రోజుల తర్వాత కుమారుడు శనివారం సాయంత్రం గ్రామానికి రావడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఎందుకు వచ్చావు.. ఆస్తి కోసమేనా అంటూ దేహశుద్ధి చేసి ఊరి పొలిమేర దాక తరిమికొట్టారు. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఉపేందర్.. ఆర్టీవో ఆఫీసులో ఏజెంటుగా పనిచేస్తున్నట్టు సమాచారం. కూతుళ్లకే తల్లి సేవ చేసిందని కుమారుడు, కుమారుడికే అన్నీ చేసిందని కుమార్తెలు ఒకరిపై ఒకరు అక్కసు పెంచుకోవడంతోనే వారు తల్లి అంత్యక్రియలకు కూడా రాలేదని స్థానికంగా చర్చించుకుంటున్నారు. పుష్పనీలకు గ్రామంలో చిన్న ఇల్లు, సుమారు రెండు గుంటల భూమి ఉంది. వాటిని అమ్ముకునేందుకే ఉపేందర్ గ్రామానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News