రైతుకు కరువు.. సీఎంకు కమీషన్లు
ABN , Publish Date - Nov 30 , 2026 | 03:14 AM
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్క అర టీఎంసీ సామర్థ్యం గల సాగునీటి ప్రాజెక్టు నిర్మించిందా? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ప్రశ్నించారు.
మూడేళ్లలో అర టీఎంసీ ప్రాజెక్టు ఐనా నిర్మించారా?
గ్లోబల్ సమ్మిట్ కాదు.. అది గోబెల్స్ సమ్మిట్
జనగామ, సిద్దిపేట దీక్షా దివస్‌ల్లో హరీశ్ విమర్శలు
జనగామ/సిద్దిపేట క్రైం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్క అర టీఎంసీ సామర్థ్యం గల సాగునీటి ప్రాజెక్టు నిర్మించిందా? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం జనగామ బీఆర్‌ఎస్, సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నవంబరు 29కి సిద్దిపేటతో అవినాభావ సంబంధం ఉందని, తెలంగాణ ఉద్యమ గతిని మలుపు తిప్పి.. చరిత్ర పుటల్లో నిలిచిపోయిన మహోన్నత రోజన్నారు. నవంబరు 29 లేకుండా డిసెంబరు 9 లేదని, డిసెంబరు 9 లేకుండా జూన్ 2 లేదని, జూన్ 2 లేకుండా తెలంగాణ లేదన్నారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బిక్ష వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. తెలంగాణ రాకుంటే చంద్రబాబు అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగే వాడని, ఆంధ్రోళ్ల కాళ్ల దగ్గర పడి ఉండేవాడన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో సగం సగం అనుమతులొచ్చిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా వెనక్కి వచ్చాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క డీపీఆర్ కూడా వెనక్కి రాలేదన్న హరీశ్.. తమ హయాంలో 48.76 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తే.. గత మూడేళ్లలో కొత్త ఆయకట్టుకు నీరే ఇవ్వలేదని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికి ప్రజల నెత్తిన రేవంత్ రెడ్డి రుద్దిన కరువు అని ఆరోపించారు. దేవాదుల ద్వారా 30 టీఎంసీల నీరు ఎత్తిపోసే అవకాశమున్నా.. 15 టీఎంసీలే ఎత్తిపోసి.. మిగతా తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా వదిలాడన్నారు. జూన్‌లో దేవాదుల మోటార్లను నడిపిస్తే ఉమ్మడి వరంగల్‌లో ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోయేది కాదన్నారు. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు బ్యారేజీ గేట్లు తీసి ఉన్నా నీటి ఎత్తి పోయొచ్చని, ఇదే విషయం చెప్పిన రిటైర్డు ఇంజనీరును బెల్టులతో కొట్టి జైల్లో వేయాలని రేవంత్‌రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు.
గేట్లు తెరిచి ఉంచినా నీటిని ఎత్తి పోసుకోవచ్చని సెంట్రల్ వాటర్, పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) చెప్పిందని గుర్తు చేశా రు. రేవంత్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో హైదరాబాద్‌లో కరువు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని 78 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే మరమ్మతు చేపట్టడానికి రెండేళ్లు సరిపోలేదా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయడం, మోటార్లు ఆన్ చేసి సాగునీరివ్వడం చేతగాని రేవంత్ రెడ్డి కమీషన్ల కోసమే గ్లోబల్ సమ్మిట్, మూసీ సుందరీకరణ అని ఆరోపించారు. రైతులకు కరువొస్తే సీఎంకు కమీషన్ల పంట పండుతోందన్నారు.
ఏడాది కాలంగా పరిశ్రమలు, ఐటీ శాఖకు కార్యదర్శే లేరని, గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే కంపెనీల ప్రతినిధులతో ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదని తన అబద్ధాలను ప్రచారం చేసుకోవడానికి నిర్వహిస్తున్న గోబెల్స్ సమ్మిట్ అని విమర్శించారు. కరువు మండలాలకు ఒక్క రూపా యి కూడా ఇవ్వని సీఎం.. ఒక్కో సభకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయన్న హరీశ్.. రాముడి పాలన పోయి రాక్షసుల పాలన వచ్చిందన్నారు. రాక్షస పాలనను అంతమొందించి రామరాజ్యం తెచ్చుకోవడానికి మరోసారి దీక్ష పూనాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!