Share News

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:06 PM

భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కామ్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సెటిల్‌మెంట్ అయిన తర్వాత నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు
Harish Rao

జనగామ, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు (Former Minister Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ భూభారతి పేరుతో భారీ స్కామ్ చేస్తోందన్నారు. నిషేధిత భూముల జాబితాను పెంచుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. సెటిల్‌మెంట్ అయిన తర్వాత నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని అన్నారు. విలువైన భూములను నిషేధిత జాబితాలో చేర్చి అక్రమ వసూళ్లు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. భూభారతి స్కామ్‌లో అసలు నిజాలను బయటకు రానివ్వట్లేదని విమర్శించారు.


35 మండలాల్లో ఈ స్కామ్ జరిగిందని, భూభారతి పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ ఆపరేటర్లకు ఎలా దొరికిందని మాజీ మంత్రి ప్రశ్నించారు. అమాయక రైతులకు నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారని మండిపడ్డారు. లక్ష ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. ఎన్నికల ముందు పట్టాలిస్తామని చెప్పి, ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారని మాజీ మంత్రి విమర్శించారు. ‘మా మీద సిట్‌లు వేసే బదులు ఈ స్కామ్‌పై సిట్, సిఐడీ విచారణ చేయాలి’ అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


కాజీపేటలో నిర్మిస్తున్నది కోచ్ ఫ్యాక్టరీనా లేక వ్యాగన్ ఫ్యాక్టరీనా అనే దానిపై స్పష్టత లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే కేంద్రం వెంటనే గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర లాథూర్‌కు ఒక న్యాయం, కాజీపేటకు మరొక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, లేకపోతే ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు వచ్చే బీజేపీ మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాజీపేటను రైల్వే జోన్‌గా మార్చాలన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలని, లాథూర్ తరహాలో రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో ఈ అంశాలపై బీఆర్ఎస్ కొట్లాడుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

పులి సంచారం.. ఆవులపై దాడులు.. భయాందోళనలో ప్రజలు

కోకాపేటలో రాజశ్యామల ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు యత్నం.. హరీశ్ ఆగ్రహం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 05:09 PM