మిర్చి రాక.. మందగమనం
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:43 PM
మిర్చి ఆగమనాలు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి తగ్గాయి. దాదాపుగా 30 శాతం తక్కువగా పంట దిగుబడిని రైతులు విక్రయించడానికి తీసుకొస్తున్నారు.
యార్డుకు 30 శాతానికి పైగా తగ్గిన మిర్చి
ధర తగ్గడమే కారణమా..!
సీజన్‌లో మిగిలింది రెండు నెలలే
గుంటూరు: మిర్చి ఆగమనాలు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి తగ్గాయి. దాదాపుగా 30 శాతం తక్కువగా పంట దిగుబడిని రైతులు విక్రయించడానికి తీసుకొస్తున్నారు. రోజురోజుకు మిర్చి టిక్కీల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గుతుండటంపై మిర్చి యార్డులో పలు రకాలుగా చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో వాతావరణం సరిగా లేకపోవడం, పంట దిగుబడి తక్కువగా ఉండటం వల్లే అక్కడి నుంచి ఆశించినంతగా రైతులు మిర్చి టిక్కీలను తీసుకురావడం లేదని వ్యాపార వర్గాలు చెబుతోన్నాయి. అయితే పది రోజుల క్రితం ఉన్న ధర ఇప్పుడు లేకపోవడంతో రైతులు కొంత మేరకు సంశయిస్తున్నట్లు సమాచారం. ఈ వారం మొత్తంగా రోజుకు సగటున 70వేల మిర్చి టిక్కీలు మాత్రమే యార్డుకు వచ్చాయి.
ఏఎంసీ గుంటూరు(మిర్చియార్డు)లో ఫిబ్రవరి నెల వస్తూనే మిర్చి టిక్కీల ఆగమనాల సంఖ్య గణనీయంగా పెరిగేది. మార్చి, ఏప్రిల్ నెలల్లో అయితే ఉచ్ఛస్థితికి చేరుకొనేది. ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు. అన్ సీజన్ కంటే కొంచెం ఎక్కువగా రోజుకు 70 వేల టిక్కీల వరకు రైతులు విక్రయానికి తీసుకొస్తున్నారు. శనివారంతో ఫిబ్రవరి నెల ముగుస్తుంది. యార్డుకు శని, ఆదివారం సెలవు దినాలు కావడంతో సోమవారం తిరిగి ట్రేడింగ్ ప్రారంభం కానుంది. మార్చి నెలలో హోలి, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, మార్చి 31 ఆర్థిక సంవత్సరం చివరి రోజు యార్డులో మిర్చి కొనుగోళ్లు జరగవు. అలానే ప్రతి శని, ఆదివారం కూడా సెలవు దినాలు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే ఆ నెలలో 31 రోజుల్లో మిర్చియార్డులో ట్రేడింగ్ జరిగేది 17 రోజులు మాత్రమే. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే మొదటి వారంలో జరిగే అమ్మకాల పైనే అంతా ఆశలు పెట్టుకొన్నారు.
వ్యత్యాసం ఇలా...
ఈ నెల 23న సోమవారం 1,17,276 మిర్చి టిక్కీలను రైతులు యార్డుకు తీసుకొచ్చారు. దాంతో ఇక మిర్చి టిక్కీల ఆగమనాలు రోజుకు లక్షకు తగ్గకుండానే పెరుగుతూ పోతాయని అంతా అంచనా వేశారు. 24న 1,00,860 టిక్కీలకు ఆగమనాలు తగ్గాయి. 25న 72,040, 26 న 76,561, 27న 67,291 టిక్కీలు మాత్రమే వచ్చాయి. ఇలా హఠాత్తుగా మిర్చి రాక తగ్గడంపై వ్యాపార వర్గాలు ఆరా తీశాయి. కర్నూలు జిల్లా నుంచి ఆశించిన మోతాదులో రైతులు మిర్చి తీసుకురావడం లేదని తేలింది. ఈ నేపథ్యంలో మిర్చియార్డు పాలకవర్గం, అధికార యంత్రాంగం దీనిపై సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడొస్తున్న మిర్చి టిక్కీలు వచ్చేవారం నుంచి మరింత తగ్గకుండా రైతులను ఛైతన్యపరచాలి. అవసరమైతే ఒక బృందం కర్నూలు జిల్లా వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేయాలన్న అభిప్రాయం యార్డులో వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ..
Read Latest Telangana News and National News