Share News

కనిపెట్టకుండా కనికట్టు

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:19 AM

నగరంలో కొందరు ఆకతాయిలు వాహనాల నంబర్‌ ప్లేట్లు మార్చేస్తున్నారు. ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకునేందుకు ఇలాంటి దుశ్చర్యల కు పాల్పడుతున్నారు.

కనిపెట్టకుండా కనికట్టు

  • వాహన నెంబర్‌ ప్లేట్లను మార్చేస్తున్నారు..

  • ట్రాఫిక్‌ పోలీసుల చలానాలు తప్పించుకునే ఎత్తుగడ

  • ముందు ఒక నెంబర్‌, వెనుక మరొకటి

  • నగరంలో వందల సంఖ్యలో ఫేక్‌ నంబర్లు

వరంగల్: నగరంలో కొందరు ఆకతాయిలు వాహనాల నంబర్‌ ప్లేట్లు మార్చేస్తున్నారు. ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకునేందుకు ఇలాంటి దుశ్చర్యల కు పాల్పడుతున్నారు. కొంతమంది మరో వాహన నెంబరును అమర్చుతుండగా.. మరికొందరు అసలు నంబర్‌ ప్లేట్‌ లేకుండానే నడుపుతున్నారు. ఇంకొందరైతే వాహనం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్‌ లేకుండానే రోడ్ల పై తిరుగుతున్నారు. ఇలాంటి వాహనాలు నగరంలో వందల సంఖ్యలో తిరుగుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు, లాఅండ్‌ఆర్డర్‌ పోలీసులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఫేక్‌ నెంబర్లకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి తీరుమారడం లేదు.


కారణాలు అనేకం..

వాహనదారులు వివిధ కారణాలతో మోసాలకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా వెళ్లేవారు, త్రిపుల్‌ రైడ్‌, రాష్‌డ్రైవ్‌ చేసేవారు, హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపేవారు, ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంపింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ పార్కింగ్‌ చలాన్లు తప్పించుకోవడం కోసం కొందరు చేస్తుంటే.. మరికొందరు ఈఎంఐ వాయిదాలు చెల్లించక ఫైనాన్షియర్‌ ఎక్కడ వాహనం లాక్కొ ని పోతారనే భయంతో, ఇంకొందరు చోరీ చేసి న వాహనాలకు వేరే నెంబర్‌ ప్లేట్‌ పెట్టుకొని తిరుగుతున్నారు.


పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీలు చేస్తున్నా.. ఎలా తప్పించుకోవాలని కొందరు వాహనదారులు ఎత్తుగడలు వేస్తున్నారు. రవాణాశాఖ జారీ చేసిన నెంబర్లు ట్రాఫిక్‌ పోలీసుల వద్ద ఉండే ట్యాబ్‌లో చూసుకునే వీలు కల్పించడంతో కొందరు దొంగలు దొరికిపోతున్నారు. రిజిస్ట్రేషన్‌ నెంబరుతోపాటు వాహనానికి సంబంధించిన ఛాసిస్‌ నెంబర్‌ ట్యాబ్‌లో నమోదు చేయడంతో వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తున్నాయి. దీంతో నెంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌ జరిగినట్లు పోలీసులు నిర్ధారించుకుంటున్నారు. అలాంటి వారి వాహనాలు స్వాధీనపర్చుకొని చీటింగ్‌ కేసులు నమోదు చేస్తున్నారు.


నంబర్ల తికమకలు

నగరంలో కొందరు ద్విచక్ర వాహనానికి కారు నంబర్‌ పెట్టుకొని తిరుగుతున్నారు. పోలీసులకు పట్టుబడ్డ సమయంలో ఆ నెంబరుపై కారు రిజిస్ట్రేషన్‌ అయి ఉండటంతో పోలీసులు అవాక్కవుతున్నారు. ఇలా కొందరు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల నంబర్లను వేరే వాహనాలకు పెట్టుకొని తిరుగుతున్నారు. కొన్నిసార్లు అసలు వాహన యజమానికి తప్పుడు చలానాలు నమోదు అవుతున్నాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల నగరంలో ఒక ద్విచక్రవాహనానికి కారు నెంబరు వేసుకొని తిరుగుతుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరికొందరు అతి తెలివిగా ఆలోచించి ఒక నెంబరు తొలగించి.. అది పొరపాటున తొలగిపోయిందనే భ్రమను కల్పించే విధంగా ఎత్తులు వేస్తున్నారు. ఇంకొందరు ముందు ఒక నెంబరు వెనుక మరో నెంబరు వేసుకొని తిరుగుతున్నారు. ఇటీవల పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌లో ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి. దీంతో పోలీసులు నిఘా పెట్టారు.


నెంబర్‌ ప్లేట్‌ మార్చడం నేరం..

  • కె.సుజాత, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, వరంగల్‌

వాహనదారులు నెంబర్‌ ప్లేట్లను మార్చడం నేరం. అలాంటివారికి జరిమానాలు విధించడమే కాకుండా కేసులు నమోదు చేస్తాం. తప్పుడు చలాన్‌ నమోదు అయినా.. వాహన నంబర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతీ వాహనదారుడు వాహనానికి విధిగా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ పెట్టుకోవాలి. రోడ్డు భ్రదత నిబంధనలు పాటించాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

పాతబస్తీలో హైడ్రా ఆపరేషన్‌

దిగి వచ్చిన పౌల్ట్రీ కంపెనీలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2026 | 11:19 AM