ఓ కన్ను కనిపించదు.. అయినా కుటుంబం కోసం ఎలుగుబంటితో పోరాడి..
ABN , Publish Date - Apr 02 , 2026 | 10:20 AM
న్యూ మెక్సికోలో మనసుకు హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క తన కుటుంబసభ్యులు, కోళ్లను కాపాడటం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. ఓ కన్ను కనిపించకపోయినా, వయసు సహకరించకపోయినా ఎలుగుబంటితో భీకర పోరాటం చేసింది. దాన్ని ఇంటినుంచి దూరంగా తరిమి కొట్టింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ కుక్క తన కుటుంబసభ్యులు, కోళ్లను కాపాడటం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. ఓ కన్ను కనిపించకపోయినా, వయసు సహకరించకపోయినా ఎలుగుబంటితో భీకర పోరాటం చేసింది. దాన్ని ఇంటినుంచి దూరంగా తరిమి కొట్టింది. ఈ సంఘటన న్యూమెక్సికోలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కార్డోవా ప్రాంతానికి చెందిన డెనిస్ మార్టినెజ్.. హనీ అనే కుక్కను పెంచుకుంటోంది. దాని వయసు ప్రస్తుతం 12 సంవత్సరాలు. హనీకి ఓ కన్ను సరిగా కనిపించదు.
డెనిస్ ఇంటి దగ్గర డజన్ల కొద్దీ కోళ్లను కూడా పెంచుకుంటోంది. రాత్రి వేళల్లో హనీ ఆ కోళ్లకు కాపలాగా పడుకునేది. మార్చి 3వ తేదీన రాత్రి ఓ ఎలుగుబంటి ఇంటి కాంపౌండ్‌లోకి ప్రవేశించింది. నేరుగా కోళ్లు ఉన్న చోటుకు వెళ్లింది. కోళ్లను చంపి తినడానికి ప్రయత్నించింది. అయితే, అక్కడే ఉన్న హనీ ఎలుగుబంటిని అడ్డుకుంది. ఈ నేపథ్యంలోనే రెండింటి మధ్య భీకరపోరు జరిగింది. హనీకి ఓ కన్ను కనిపించకపోయినా.. వయసు సహకరించకపోయినా ఎలుగుబంటితో పోరాడింది. ఎలుగుబంటిని అక్కడినుంచి తరిమికొట్టింది.
ఎలుగుబంటి దాడిలో హనీ తీవ్రంగా గాయపడింది. ఇంటి ముందు గాయాలతో స్పృహలేకుండా పడిపోయింది. ఉదయం దాన్ని చూసిన డెనిస్ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స అనంతరం హనీ కోలుకుంది. డెనిస్.. ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరా దృశ్యాలను చూసి షాక్ అయింది. హనీ చాలా సార్లు ఎలుగుబంటిని ఇంటి వైపు, కోళ్ల వైపు వెళ్లకుండా అడ్డుకుంది. అది దారుణంగా దాడి చేస్తున్నా హనీ వెనక్కు తగ్గలేదు. ఎలుగుబంటిని అక్కడినుంచి తరిమి కొట్టింది. ఈ సంఘటనపై డెనిస్ మాట్లాడుతూ.. ‘ఎలుగుబంటితో గొడవపెట్టుకోవటం హనీ పనికాదు. కానీ తన కుటుంబం కోసం ప్రాణాలకు తెగించింది. ఎలుగుబంటితో పోరాడి తరిమికొట్టింది’ అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
లివర్‌ను కాపాడుకోవాలంటే ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి