దిగి వచ్చిన పౌల్ట్రీ కంపెనీలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 10:56 AM
చికెన్ సెంటర్ల బంద్ విజయవంతమైంది. బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చా యి. బర్డ్ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి.
బర్డ్ ధర రూ.185 నుంచి రూ.125 వరకు తగ్గింపు
మార్జిన్ సైతం రూ.15కు పెంపు
బంద్‌లో పాల్గొన్న 80 శాతం చికెన్ సెంటర్లు
తెరుచుకోనున్న చికెన్ సెంటర్లు
హనుమకొండ: చికెన్ సెంటర్ల బంద్ విజయవంతమైంది. బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చా యి. బర్డ్ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్‌ను గతంలో మాదిరిగానే కిలోకు రూ.15, ఆ పైన మార్జిన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చికెన్ సెంటర్ల నిర్వా హకులు బంద్‌ను విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు తెలిపారు. బంద్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. బంద్‌ను విజయవంతం చేసినం దుకు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నాటుకోడికి డిమాండ్
చికెన్ సెంటర్ల బంద్‌తో నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది. బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు లేకపోవడంతో మాంసం ప్రియులు నాటు కోళ్లను ఎక్కువగా కొనుగోలు చేయడం కనిపించింది. నాటు కోడి రేటు ఎక్కువగా ఉం టుంది కనుక సాధారణ రోజుల్లో వీటి అమ్మకాలు తక్కువగా ఉంటాయి. నాటు కోళ్లను ఇష్టపడేవారు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తా రు. బంద్‌తో నాటు కోళ్ల పెంపకం దారులు వీటిని మార్కెట్‌కు తరలించారు. సాధారణ ధరకన్నా కాస్త ఎక్కువైనా కొనుగోలు చేశారు.
పెరిగిన మాంసం విక్రయాలు
చికెన్ సెంటర్ల బంద్‌తో మాంసం విక్రయాలు కూడా 20 నుంచి 25 శాతం పెరిగినట్టు మాంసం విక్రయదారులు తెలిపారు. బుధవారం నుంచి చికెన్ సెంటర్ల బంద్ జరుగుతున్న దృష్యా ముందే మేల్కొన్న మాంసం విక్రయదారులు కాస్త ఎక్కువగానే జీవాలను కోసి ఉదయం నుంచే సిద్ధంగా ఉంచారు. చికెన్ అమ్మకాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా మాంసం కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు.
ధర్నాకు..
చికెన్ సెంటర్ల బంద్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహా ధర్నాలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి చికెన్ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని నినాదాలు చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసు కోవాలని, విధాన పరంగా చికెన్ ధరలు, కమీషన్ మార్జిన్ ధరలు నిర్ణయించాలని, చిల్లర చికెన్ వ్యాపారులు లేకుండా చేయాలని పౌల్ట్రీ కంపెనీలు చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు.