బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:54 AM
రావణాసురుడు ఉండటం వల్లే రాముడికి, శకుని ఉండటం వల్లే కృష్ణుడికి గుర్తింపు దక్కిందని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికరంగా స్పందించారు.
25న కొత్త పార్టీని ప్రకటిస్తాం.. ఆ రోజు చేరికలుండవు
మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మావోయిస్టులు కూడా చేరతారు
కేసీఆర్ రావణుడైతే.. మరి శకుని ఎవరో రేవంత్ చెప్పాలి
సీఎం బీఆర్‌ఎస్ భుజాన తుపాకీ పెట్టి పొంగులేటిని కాల్చారు: కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రావణాసురుడు ఉండటం వల్లే రాముడికి, శకుని ఉండటం వల్లే కృష్ణుడికి గుర్తింపు దక్కిందని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికరంగా స్పందించారు. కేసీఆర్‌ను రావణుడిగా చెప్పిన రేవంత్, శకుని ఎవరో మాత్రం చెప్పలేదని పేర్కొన్నారు. జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనను తాను మహాభారతంలోని బర్బరీకుడి పాత్రతో రేవంత్ పోల్చుకున్నారని, ఇది తనకు నవ్వు తెప్పిస్తోందని, బర్బరీకుడి మాదిరిగా రేవంత్ చేసిన త్యాగం ఏమిటో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఈనెల 25న కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పారు. పార్టీ ఎజెండా, ప్రజలకు ఏం చేయదల్చుకున్నామో అదేరోజు వివరిస్తామని చెప్పారు. ఆ రోజు పార్టీలో చేరికలు ఉండవని పేర్కొన్నారు. ఇప్పటికే బీఅర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్నారని.. వారి పేర్లు సమయం వచ్చినప్పుడు తానే వెల్లడిస్తానని చెప్పారు. మాజీ మావోయిస్టులు కూడా పార్టీలోకొచ్చి సేవలందిస్తారని పేర్కొన్నారు. కొత్తపార్టీ ప్రకటనకు ముందు ఉమాభారతి లాంటి కొందరు జాతీయస్థాయి నేతలను కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని వెల్లడించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందని, ఒకరి అవినీతిని మరొకరు బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ బీఆర్‌ఎస్ పార్టీ భుజాన తూపాకీ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని కాల్చారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరగనుందని, ఆ మేరకు మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలనే డిమాండ్‌తో పోరాటం చేస్తామని చెప్పారు. కల్వకుర్తి పరిధిలోని కుర్మిద్దలో ప్రభుత్వం పెద్ద భూస్వాములకు చెందిన వందల ఎకరాల భూములను వదిలిపెట్టి.. ఎకరం, అర ఎకరం ఉన్న పేద గిరిజనుల భూములు టీజీఐసీసీ ద్వారా లాక్కునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
దీన్ని అడ్డుకునేందుకు బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని కవిత వెల్లడించారు. కాగా ప్రభుత్వం జారీచేసిన జీవో (నెంబరు 4) ప్రకారం గ్రూప్ -1 తరహాలో డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులను తమవారికి కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీహెచ్డీ చేసిన వారికి 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూలో పది మార్కులంటూ నిబంధనలను తమ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. వెంటనే జీవో 4ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి జీవో 104, గ్రూప్స్‌కోసం జీవో 29, పోలీసు ఉద్యోగాలకు జీవో 46, గురుకులాలకు జీవో 81 తెచ్చారని, ఇలా ఉద్యోగ నియామకాలకు అడ్డంకిగా ఉన్న జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందని విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఏరివేత కార్యక్రమం ద్వారా 15 లక్షల రేషన్ కార్డులు తీసేయాలని చూస్తోందని ఆరోపించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో రేషన్ కార్డులు ఏరివేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.