కొలిక్కిరాని షాబాద్ నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 09:16 PM
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు హంతకుడు రాజ్‌కుమార్ మృతదేహం కొత్తూరు సమీపంలో లభ్యమైంది.
రంగారెడ్డి జిల్లా, జులై 13 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు హంతకుడు రాజ్‌కుమార్ మృతదేహం కొత్తూరు సమీపంలో లభ్యమైంది. నిందితుడు మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో అంత్యక్రియలపై సందిగ్ధత నెలకొంది. ఈ కేసులో మృతురాలు సరిత తల్లిదండ్రులు కీలక డిమాండ్లు చేస్తున్నారు. తమ గ్రామంలోనే రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతున్నారు.
అయితే ఈ ప్రతిపాదనను రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. మరోవైపు రాజ్‌కుమార్ స్వగ్రామమైన షాబాద్‌లో కూడా అంత్యక్రియలు నిర్వహించవద్దని అతని తల్లిదండ్రులు, గ్రామస్థులు నిరాకరిస్తున్నారు. అతని మృతదేహాన్ని సరిత కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులు నేరుగా చేవెళ్ల శ్మశానవాటికలోనే దహనం చేయాలని నిందితుడి తల్లిదండ్రులు, సోదరుడు కోరుతున్నట్లు సమాచారం.
నిందితుడు రాజ్‌కుమార్ భార్య సరిత తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తన కుమార్తె, ఇద్దరు మనవళ్లను రాజ్‌కుమార్ దారుణంగా హత్య చేశాడని తెలిపారు. పోలీసులు జేసీబీతో గుంతలు తీసి వారిని ఖననం చేశారని చెప్పారు. అదేవిధంగా రాజ్‌కుమార్‌ను కూడా తమ కుమార్తె, మనవళ్ల సమాధుల కాళ్ల వైపు ఖననం చేయాలని కోరారు. వేరే ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు న్యాయపరమైన, శాంతిభద్రతల అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోస్టుమార్టం నివేదిక అనంతరం అంత్యక్రియలపై తుది నిర్ణయం వెలువడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News