Share News

రాత్రి మందు పార్టీ.. పోలీసులను చూసి పరుగులు..

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:06 AM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగారంలో స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా చేసుకున్న మందు పార్టీ ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలు తీసింది.

రాత్రి మందు పార్టీ.. పోలీసులను చూసి పరుగులు..
Sai Charan, Yashwanth

  • కరెంటు షాక్‌తో ఇద్దరు విద్యార్థుల మృతి

  • పంటల రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలే కారణం

  • రంగారెడ్డి జిల్లా పెద్దమంగారంలో ఘటన

మొయినాబాద్‌, రాజేంద్రనగర్‌/అమీర్‌పేట, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగారంలో స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా చేసుకున్న మందు పార్టీ ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలు తీసింది. అర్థరాత్రి సమయంలో పంటపొలాల్లో మందు పార్టీ చేసుకుంటుండగా పోలీసుల పెట్రోలింగ్‌ వాహనం రావడంతో విద్యార్థులు భయపడి పరుగులు తీశారు. ఓ రైతు తన పొలం చుట్టూ అడవి పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను ఉప్పర్‌పల్లికి చెందిన మోక్ష సాయిచరణ్‌(19), సనత్‌నగర్‌ డివిజన్‌లోని జయప్రకాష్‌ నగర్‌కు చెందిన యశ్వంత్‌(20)గా గుర్తించారు.


ప్రాణస్నేహితులైన వీరిద్దరూ చిలుకూరు రెవెన్యూలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీద్దరితో పాటు మరో 8మంది కలిసి స్నేహితుడి పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. అనంతరం మద్యం సేవించేందుకు బీర్లు తీసుకుని పెద్దమంగారం రోడ్డులోని పద్మావతి ఫంక్షన్‌హాల్‌ వెనుకకు వెళ్లారు. మద్యం సేవిస్తుండగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఫంక్షన్‌ హాల్‌ పక్కనుంచి వెళ్తూ రోడ్డుపై ఆగింది. పోలీసులు తమ వద్దకు వస్తున్నారని భయపడిన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇద్దరు విద్యార్థులు పక్కనే ఉన్న చేనులోకి వెళ్లేందుకు యత్నించారు. చేనుకు కంచెగా వేసిన జీఐ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతిచెందారు.


మిగతా స్నేహితులు అటు వెళ్లకుండా ఆగిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం తర్వాత బంధువలకు అప్పగించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఉప్పర్‌పల్లికి వచ్చి మోక్ష చరణ్‌ మృతదేహానికి నివాళులర్పించారు. మోక్ష చరణ్‌ తల్లిని ఓదార్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పెద్దమంగారం రెవెన్యూలో బి.పెంటారెడ్డికి చెందిన 2 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన బి.రాజిరెడ్డి కౌలుకు తీసుకుని పందుల నుంచి పంట రక్షణ కోసం జీఐ వైర్‌తో కంచె ఏర్పాటు చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 05:06 AM