అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా, నలుగురు మహిళల మృతి
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:15 AM
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరిన సుమారు 52 మంది ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ..
20మందికి గాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం
గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్ దిగ్ర్భాంతి
బాధితులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శ
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం ప్రకటన
వికారాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి)/ధారూరు: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరిన సుమారు 52 మంది ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డు చివరి మలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో నారాయణరెడ్డి అనే వ్యక్తి శుక్రవారం పురుగు మందు తాగి మరణించాడు. నారాయణరెడ్డి స్వగ్రామం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.
నారాయణరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామం నుంచి అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కలిసి దాదాపు 52 మంది శనివారం ఉదయం 9.30 గంటలకు ఓం నమఃశివాయ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులో చింతకుంట బయలుదేరారు. బస్సులోని వారంతా నారాయణరెడ్డి మరణం కోసం చర్చించుకుంటూ విషాదంలో ఉన్నారు. అయితే, వారు ప్రయాణిస్తున్న బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డులో చివరి మలుపు వద్ద అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు బస్సులో నుంచి ఆర్తనాదాలు పెట్టారు. ఆ రోడ్డు చివరన మక్కబుట్టలు విక్రయించే ఇద్దరు యువకులు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. బస్సు అద్దాలు పగులగొట్టి లోపల ఉన్నవారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు.
ఈ ప్రమాదంలో క్యాసారం గ్రామానికి చెందిన అత్తెల్లి యాదమ్మ(55), అత్తెల్లి పద్మమ్మ(55), మాల పద్మ (50), రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మునిసిపల్ పరిధి సింగాపురం ప్రాంతానికి చెందిన ప్రమీల (52) మృతి చెందారు. యాదమ్మ, పద్మమ్మ, పద్మ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమీలను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. మృతుల్లో యాదమ్మ, పద్మ అక్కాచెల్లెళ్లు, భర్త అనంతరెడ్డికి వీరిద్దరు భార్యలు. ప్రమాదంలో గాయపడ్డ అనంతరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహమెహ్రా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. 42మంది క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారైనట్టు స్థానికులు తెలిపారు.
తుప్పు పట్టిన స్ట్రెచర్.. పడిపోయిన మహిళ!
వీల్ చైర్‌లు లేక ఆస్పత్రిలోకి నడిచి వెళ్లిన బాధితులు
వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సరైన స్ట్రెచర్‌లు, వీల్ చైర్లు అందుబాటులో లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు సిబ్బంది తుప్పుపట్టిన స్ట్రెచర్‌ను ఉపయోగించారు. బాధితురాలు స్ట్రెచర్‌పై ఉండగా... ముందు భాగం ఒరిగిపోవడంతో ఆ మహిళ స్ట్రెచర్‌పై నుంచి కిందికి జారిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది మహిళ పూర్తిగా కిందికి పడిపోకుండా ఆపి అదే స్ట్రెచర్‌తో ఆమెను లోపలికి తీసుకెళ్లారు. ఇక, వీల్ చైర్‌లు లేకపోవడంతో కొందరు క్షతగాత్రులు గాయాల బాధతోనే నడుచుకుంటూ ఆస్పత్రి లోపలికి వెళ్లారు. దీంతో ఆస్పత్రి వద్ద సౌకర్యాల లేమీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గవర్నర్, సీఎం దిగ్ర్భాంతి
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం చేస్తామన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్న రియాజ్, సద్దాంను మంత్రి సత్కరించి అభినందించారు. ఇక, విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
వృద్ధులకూ ఉచిత బస్సు ప్రయాణం? సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రేవంత్ ప్రభుత్వం
రామ జన్మభూమి ఉద్యమం నుంచి సామాజిక సమరసత వరకు
Read Latest Telangana News And Telugu News