వృద్ధులకూ ఉచిత బస్సు ప్రయాణం? సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రేవంత్ ప్రభుత్వం
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:01 AM
‘మహాలక్ష్మి’ పథకంతో ఇప్పటికే మహిళలకు ఉచితబస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వృద్ధులకూ ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.
సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రేవంత్ ప్రభుత్వం
ఏపీలో 60 ఏళ్లు దాటిన వారికి 25 శాతం రాయితీ
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘మహాలక్ష్మి’ పథకంతో ఇప్పటికే మహిళలకు ఉచితబస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వృద్ధులకూ ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది. దీనిపై ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. గ్రామీణ ప్రాంతాల వృద్ధులు ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజారవాణానే ప్రధాన ఆధారం. ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తే.. ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పింఛన్‌దారులు, ఒంటరిగా జీవించే వృద్ధులు.. తరచూ వైద్య సేవల కోసం పల్లె నుంచి మండల, జిల్లా కేంద్రాలకు, పట్టణాలకు రాకపోకలు సాగించేవారికి ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏసీ సర్వీసులతో సహా అన్ని బస్సుల్లో టిక్కెట్ చార్జీలో 25 శాతం రాయితీ కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వృద్ధులకు ఉచిత ప్రయాణం అమలు చేయాలని సర్కారు భావిస్తే.. వయో పరిమితిని ఎంతగా నిర్ణయించాలన్నది కీలకంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 60 ఏళ్లు దాటిన వారిని సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. సీనియర్ సిటిజెన్లకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. వయో పరిమితి (60 ఏళ్లు దాటినవారికా? లేక 65 ఏళ్లు దాటినవారికా? అనే విషయం), పల్లె వెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు వర్తింపజేయాలా? ఇతర జిల్లాలకు ప్రయాణించినప్పుడు ఈ సౌకర్యం ఉంటుందా? తదితర అంశాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.
ఆర్టీసీపై అదనపు భారం..
మహాలక్ష్మి పథకంతో టీజీఎ్‌సఆర్టీసీపై ఇప్పటికే ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో వృద్ధులకు కూడా ఆ అవకాశం కల్పిస్తే సంస్థపై అదనంగా ఎంత భారం పడుతుంది? ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుంది? అన్నది కీలకంగా మారింది. మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్న తరహాలోనే సీనియర్ సిటిజెన్ల ప్రయాణానికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరం: భట్టి విక్రమార్క
రామ జన్మభూమి ఉద్యమం నుంచి సామాజిక సమరసత వరకు
Read Latest Telangana News And Telugu News