రామ జన్మభూమి ఉద్యమం నుంచి సామాజిక సమరసత వరకు
ABN , Publish Date - Oct 04 , 2026 | 01:29 AM
భారతావనిలో ఒక నవయుగం ప్రభవిస్తోంది. దేశమంతా కొత్త ఆత్మవిశ్వాసంతో అద్భుతమైన సమాజ నిర్మాణంలో నిమగ్నమయింది....
భారతావనిలో ఒక నవయుగం ప్రభవిస్తోంది. దేశమంతా కొత్త ఆత్మవిశ్వాసంతో అద్భుతమైన సమాజ నిర్మాణంలో నిమగ్నమయింది. ఎందరో ఉదాత్తులు దశాబ్దాల పాటు అంకితభావంతో శ్రమించి ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. మాన్యులు అశోక్ సింఘాల్ అటువంటి మహానుభావులలో అగ్రగణ్యులు. విశ్వహిందూ పరిషత్‌కు దేశమంతటా చుక్కానిలా నిలిచిన మహనీయుడు ఆయన. అందుకే సింఘాల్‌ను ‘హిందూ హృదయ సమ్రాట్’ అని, ‘రామ జన్మభూమి ఉద్యమకర్త’ అని, ‘హిందూ పునరుజ్జీవన నాయకుడు’ అని, ‘రాష్ట్ర జాగరణ్ అభియాన్ సేనాపతి’ అని పిలుస్తుంటారు. కానీ, అశోక్ జీ వ్యక్తిత్వాన్ని కేవలం ఒక్క పదంలో పరిచయం చేయాల్సి వస్తే, ఆ పదం–కర్మయోగి.
అశోక్ సింఘాల్ నిష్కామ భావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించేవారు. ఏదైనా పనిలో విజయం సాధిస్తే దాని క్రెడిట్ తాను తీసుకోవడానికి బదులుగా ఈశ్వరునికి సమర్పించేవారు. ఆ విజయంతో లభించే ప్రచారానికి ప్రాధాన్యమివ్వకుండా ప్రశాంతంగా ఉండేవారు. కీర్తి శిఖరాలకు చేరుకున్న తర్వాత కూడా ఆయన ఎన్నడూ ప్రచారం కోరుకోలేదు. జయాపజయాలకు అతీతంగా సమభావంతో నడవడం అనేది ఒక కర్మయోగి అయిన స్వయంసేవక్ లక్షణం. ఇది అశోక్ జీ (Ashok Singhal) జీవితంలో స్పష్టంగా కనిపించేది.
అశోక్ జీ అసాధారణ ప్రతిభాశాలి. తన మేధస్సును దేశ అభ్యున్నతి కోసం అంకితం చేశారు. ఒక ఉన్నత కుటుంబంలో సింఘాల్ జన్మించారు. ఆయన సోదరుడు ఐపీఎస్ ఆఫీసర్. ఉత్తరప్రదేశ్‌కు డీజీపీగా సేవలు అందించారు. ఇతర సోదరులు విజయవంతమైన పారిశ్రామికవేత్తలు. అశోక్‌జీ కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి మెటలర్జికల్ ఇంజినీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. ఈ నేపథ్యంతో కోటీశ్వరుడు అయ్యేందుకు అవకాశాలు ఉన్నా ఆయన తన జీవితాన్ని దేశం కోసమే పూర్తిగా అంకితం చేశారు. అశోక్ జీ స్వతస్సిద్ధంగా ఆధ్యాత్మిక స్వభావుడు. స్వామి వివేకానంద లాగే ఆయన కూడా తానేదో ఒకటి పొందాలని ఆశించకుండా, సమాజ శ్రేయస్సుకు తన జీవితాన్ని అర్పించారు.
అశోక్ జీ విద్యార్థి దశలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)తో పరిచయం కలిగి ఉన్నారు. ఆ తొలిదశలో, పూజ్యులు ప్రొఫెసర్ రాజేంద్రసింగ్ (‘రజ్జు భయ్యా’) మార్గదర్శకత్వాన్ని ఆయన పొందారు. మాన్యులు దేవరస్ ఒక నిపుణుడైన శిల్పిలా సింఘాల్ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. ఆయనకు పూజ్య గురూజీ మార్గదర్శకత్వం నిరంతరం లభిస్తూ వచ్చింది. అంకితభావం, కష్టపడే తత్త్వం, దృఢ సంకల్పం, నిర్వహణ నైపుణ్యం, సంఘటన కుశలతతో అద్భుతమైన నాయకుడుగా అశోక్ జీ రాణించారు. ఇంజనీరింగ్ విద్య పూర్తికాగానే ఆయన సంఘ్ ప్రచారక్ అయ్యారు. ఆయనకు ఏ బాధ్యత అప్పగించినా దానిని పూర్తి నిబద్ధతతో నిర్వహించారు. ఆ బాధ్యత కోసమే సింఘాల్ పుట్టారేమో అనిపించేది. (Ashok Singhal)
అశోక్ జీ ఢిల్లీ ప్రాంత్ ప్రచారక్‌గా ఉన్న సమయంలో, మీనాక్షిపురం మతమార్పిడి ఘటన సంభవించింది. హిందూ సమాజ సమగ్ర జాగృతి అవసరం ఎంతైనా ఉందని పెద్దవాళ్లంతా భావించారు. ఢిల్లీలో విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహించే బాధ్యతను అశోక్ జీకి అప్పగించారు. సమాజంలోని వివిధ వర్గాలను అనుసంధానిస్తూ ఆ సమ్మేళనాన్ని ఆయన విజయవంతం చేశారు. ఆ తర్వాత, ధార్మిక, సామాజిక రంగంలో విస్తృత జాగృతికి అంకితమైన విశ్వ హిందూ పరిషత్ సారథ్య బాధ్యత లభించింది. ఆయన ఈ బాధ్యతను కూడా అదే అంకితభావంతో నిర్వర్తించారు. సమాజ పరిస్థితులను అర్థం చేసుకోవడం, దానికి తగినట్లుగా ఆలోచించడం, ప్రణాళికలు రూపొందించడం, వాటిని ఆచరణలో పెట్టడం... ఇది ఆయన కార్యశైలి.
హిందూ సమాజంలో అస్పృశ్యత అనే దురాచారం శతాబ్దాలుగా ఒక సామాజిక సవాలుగా ఉంటూ వస్తోంది. అస్పృశ్యత తొలగిపోకుండా సమరస సమాజం సాధ్యం కాదు. ఈ విషయాన్ని కేవలం సామూహిక భోజనాలు లేదా నామమాత్రపు కార్యక్రమాలకే అశోక్ జీ పరిమితం చేయలేదు. హిందూ ధర్మపు ప్రాథమిక ఆదర్శాలకు అస్పృశ్యత విరుద్ధమని చాటి చెప్పారు. ఇందుకు సాధుసంతుల సహకారం తీసుకున్నారు. అశోక్ జీ ప్రోద్బలంతో షెడ్యూల్డ్ కులాల బస్తీలలో సన్యాసులు పర్యటించడం ప్రారంభించారు. తర్వాత కాలంలో ఇది పెద్ద ఉద్యమంగా మారింది. 1989 నవంబర్ 9న అయోధ్యలో రామ జన్మభూమి మందిర శంకుస్థాపన షెడ్యూల్డ్ కులానికి చెందిన కామేశ్వర్ చౌపాల్ చేతుల మీదుగా నిర్వహించారు. ఇందులో అనేకమంది పూజ్య సన్యాసులు ధర్మాచార్యులు పాల్గొన్నారు. సామాజిక భేదాలను తొలగించి సమరస హిందూ సమాజాన్ని నిర్మించవచ్చుననే నమ్మకాన్ని సమాజంలో బలపరచడంలో ఈ ప్రయత్నాలు తోడ్పడ్డాయి.
రామ జన్మభూమి ఉద్యమం స్వతంత్ర భారతదేశ ధార్మిక ఉద్యమాలలో ప్రధానమైనది. 1980 నుంచి 2019 సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత మందిర నిర్మాణం వరకు అందులో అనేక దశలు ఉన్నాయి. రామ–జానకీ రథయాత్ర, శిలా–పూజ, చరణ–పాదుక పూజ, రామజ్యోతి వంటి అనేక ఉద్యమ ఘట్టాలు ఉన్నాయి. ఈ మొత్తం ఉద్యమంలో అశోక్ జీ పాత్ర అత్యంత కీలకమైనది. అయోధ్య ఉద్యమం సమయంలో విశ్వహిందూ పరిషత్‌కు అశోక్ జీ నాయకత్వం బాగా ఉపయోగపడింది. ఆయన నమ్మకం ఏమిటంటే... ‘ఇది రాముని పని, రాముడే ఈ పనిని కచ్చితంగా పూర్తి చేస్తాడు’. సింఘాల్ జీవించి ఉన్న సమయంలో మందిర నిర్మాణం పూర్తి కాలేదు. తర్వాత కాలంలో ఆ ఆశయం సాకారమయింది. ఫలితంగా అయోధ్యలో భవ్యమైన రామమందిరం నెలకొంది.
రామ జన్మభూమి ఉద్యమ ప్రధాన నాయకుడిగా అశోక్ జీ గుర్తింపు పొందారు, అయితే ఆయన కార్యక్షేత్రం అంతకంటే చాలా విస్తృతమైనది. రామసేతు రక్షణ, అమర్‌నాథ్ యాత్ర, గో–పరిశోధన, గోవంశ సంవర్ధన, సామాజిక సమరసత వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మెటలర్జీ నిపుణుడు కాబట్టి నిజ జీవితంలో కూడా సమాజ స్వభావాన్ని, దాని సామర్థ్యాలను, లోతుగా అర్థం చేసుకున్నారు. అందుకే, ఆయన కార్యశైలిలో శాస్త్రీయ దృష్టి, సంస్థాగత నైపుణ్యం, ఆధ్యాత్మిక ఆస్తికత, దేశభక్తి బలంగా కనిపించేవి.
అశోక్ జీ వ్యక్తిత్వంలో సమున్నత విశేషం ఏమిటంటే, ఆయన ఏ ఒక్క అంశం దగ్గరా ఆగిపోయేవారు కాదు. ఒక లక్ష్యం సాధించగానే తదుపరి లక్ష్యం వైపు అడుగులు వేసేవారు. సమాజం ఎదుట ఉన్న ప్రతి సవాలునూ స్వీకరించి, దానిని పరిష్కరించడంలో నిమగ్నమయ్యేవారు. ఆయనకు సంఘటనే సాధన, సమాజమే సాధ్యం, దేశసేవే జీవిత పరమార్థం.
భారతదేశ ప్రస్తుత పునరుజ్జీవన నిర్మాతలలో అశోక్ జీ అగ్రగణ్యులు. హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, సామాజిక సమరసతను ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన తన జీవితాన్ని అర్పించారు. కనుక ఆయన కేవలం రామ జన్మభూమి ఉద్యమ మహా నాయకుడు మాత్రమే కాదు. భారతదేశ పునర్ వైభవం కోసం కృషి చేసిన నవ యుగద్రష్ట. అశోక్ సింఘాల్ నిజంగానే ఒక కర్మయోగి. అవును, రాబోయే తరాలకు ఎప్పటికీ నిరంతరం ప్రేరణనిస్తూ ఉండే ఒక కర్మయోగి.
దత్తాత్రేయ హోసబాళే
సర్‌కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
(అశోక్ సింఘాల్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా)
ఈ వార్తలు కూడా చదవండి..
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు
అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. అభిజిత్ దీప్కే క్షమాపణ చెప్పాలన్న రాందాస్ అథవాలే..