Share News

అన్నదానానికి మోకాలడ్డు!

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:36 AM

గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు సేవ చేసేందుకు ముందుకువచ్చే సంస్థలకు సింహాచలం దేవస్థానం అధికారులు తగిన అనుమతులు, సహకారం అందివ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అన్నదానానికి మోకాలడ్డు!

గిరి ప్రదక్షిణ సందర్భంగా 20 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తామంటూ చోడవరం మండలవాసి దరఖాస్తు

అనుమతులు నిరాకరించిన సింహాచలం దేవస్థానం అధికారులు

విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు సేవ చేసేందుకు ముందుకువచ్చే సంస్థలకు సింహాచలం దేవస్థానం అధికారులు తగిన అనుమతులు, సహకారం అందివ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది గిరి ప్రదక్షిణలో పనిచేయడానికి వచ్చిన ఉద్యోగులకు టిఫిన్లు, భోజనాల ఖర్చు రూ.83.83 లక్షలు అయిందని, కేవలం ఇడ్లీ, టమాటా రైస్‌ పంపిణీ చేశారని ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలపై పలువురు స్పందించారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గజపతినగరం నుంచి మాచిరాజు అనే వ్యక్తి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. గిరి ప్రదక్షిణ సమయంలో గత దశాబ్దకాలంగా తాము భక్తులకు కొత్త గోశాల సమీపాన అన్నదానం చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది 20 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తామని, ఎప్పటిలాగే అనుమతి, టెంట్లు వేసుకోవడానికి తగిన వసతి సౌకర్యం కల్పించాలని దేవస్థానం అధికారులను కోరామన్నారు. అయితే అధికారులు ఏకపక్షంగా తమ దరఖాస్తును తిరస్కరించి, అన్నదానం చేసే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, అప్పట్లో శ్రీనివాసరాజు అనే ఇంజనీర్‌ పూర్తి సహకారం అందించేవారని, గజపతినగరం నుంచి 200 మంది సేవకులు సింహాచలం వెళ్లి సేవ చేసేవారమన్నారు. ఈసారి ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదన్నారు.

ఐదు వేలు కాదు పది వేల మందికి భోజనాలు: దేవస్థానం

గిరి ప్రదక్షిణ సందర్భంగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు పెట్టిన టిఫిన్లు, భోజనం, చేసిన ఖర్చుపై గత రెండు రోజులుగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురిస్తున్న కథనాలపై దేవస్థానం అధికారులు ఎట్టకేలకు శనివారం స్పందించారు. తాము ఆ మూడు రోజుల్లో మొత్తం పది వేల మందికి ఆహారం అందించామని చెప్పుకొచ్చారు. వారిలో పోలీసులు, వలంటీర్లు 6,674 మంది ఉన్నారని పేర్కొన్నారు. పది వేల మందికి మూడు పూటల టిఫిన్లు, ఐదు పూటల భోజనం పెట్టామన్నారు. కేటరింగ్‌కు ప్రకటన ఇచ్చామని, ఆ విషయం ట్రస్టు బోర్డుకు తెలుసునని పేర్కొన్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన సిబ్బందికి ఆడిట్‌ అనంతరం టీఏ, డీఏలు చెల్లించామన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:36 AM