గ్రేటర్ ఎన్నికలకు సన్నద్ధం
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:37 AM
జీవీఎంసీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.
ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశం
పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి
120 వార్డుల్లో 19,990 పోలింగ్ కేంద్రాలు
18,37,901 మంది ఓటర్లు
ఏయూ ఇంజనీరింగ్ కళాశాలో ఓట్ల లెక్కింపు
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో కలిసి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు.
జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన, వార్డుల వవారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా, సిబ్బంది నియామకం, ఎన్నికల విధులపై శిక్షణ, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, ఎన్నికల వ్యయం పర్యవేక్షణ వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, సమర్థంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రతకు సంబంధించిన అంశాలను పరీక్షించి ముందుగానే సరిదిద్దుకోవాలని సూచించారు. ఎన్నికల విధులపై ప్రతి అధికారి, ఉద్యోగి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని స్పష్టంచేశారు. వివిధ శాఖల మధ్య నిరంతరం సమన్వయం కొనసాగాలని సూచించారు. జీవీఎంసీ ఎన్నికల విధులకు సిబ్బందిని విశాఖ రూరల్, అనకాపల్లి జిల్లా పరిధి నుంచి తెచ్చుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవడంతోపాటు పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలన్నారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని 120 వార్డుల్లో 19,990 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆయా కేంద్రాల్లో 18,37,901 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి అధికారులు, సిబ్బందిని నియమించడంతోపాటు 20 శాతం సిబ్బందిని రిజర్వులో సిద్ధంగా ఉంచుతామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 4,800 బ్యాలెట్ పెట్టెలు అవసరమని ప్రతిపాదనలు పంపించామన్నారు. ఎన్నికల అనంతరం సామగ్రి స్వీకరణ, భద్రపరచడం, ఓట్ల లెక్కింపు వంటివి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో చేపట్టనున్నట్టు వివరించారు. సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు, డిప్యూటీ కలెక్టర్ గోవిందు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్లు రమణమూర్తి, వర్మ, నల్లనయ్య, సత్యవేణి, ఎస్టేట్ ఆఫీసర్ దయానిధి, సీసీపీ ప్రభాకరరావు, డీసీపీ హరిదాసు, జోనల్ కమిషనర్లు, ఏసీపీలు, ఎన్నికల సెల్ అధికారులు పాల్గొన్నారు.