Share News

లాభమెంత వాటా ఎంత...?

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:22 AM

సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం వార్షిక లాభాలను ఇప్పటికి ప్రకటించలేదు. దసరా పండుగకు నెల రోజుల ముందే వచ్చిన లాభాలను ప్రకటించి, అందులో కార్మికులకు లాభాల వాటా శాతాన్ని తెలియజేసేది. దసరా కంటే ముందు కార్మికులకు వాటా పంపిణీ జరిగేది.

లాభమెంత  వాటా ఎంత...?

గోదావరిఖని, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం వార్షిక లాభాలను ఇప్పటికి ప్రకటించలేదు. దసరా పండుగకు నెల రోజుల ముందే వచ్చిన లాభాలను ప్రకటించి, అందులో కార్మికులకు లాభాల వాటా శాతాన్ని తెలియజేసేది. దసరా కంటే ముందు కార్మికులకు వాటా పంపిణీ జరిగేది. కానీ దసరా 15 రోజులు కూడా లేని ప్రస్తుత పరిస్థితిలో ఇప్పటికి 2025-26 ఆర్థిక సంవత్సర లాభాలను సంస్థ ప్రకటించలేదు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి సుమారు 1753 కోట్ల లాభాలు వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే యాజమాన్యం లాభాల విషయమై అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నది. లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించాల్సి ఉండడంతో ప్రకటన విషయంలో సింగరేణి ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తర్వాతే లాభాలను ప్రకటించే యోచనలో సింగరేణి ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సర లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా చెల్లించాలని, కనీసం 36 శాతం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

లాభాల వాటా వివరాలు ఇలా..

2023-24 ఆర్థిక సంవత్సర లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటా ప్రకటించి రూ. 8002 కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించారు. సరాసరిగా ఒక్కో కార్మికుడికి రూ. 2లక్షల పంపిణీ జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1783 కోట్ల లాభాలు ఆర్జించగా దీనిలో 35 శాతం వాటా కార్మికులకు ఇచ్చినా రూ.613.55 కోట్లు సింగరేణి కార్మికులకు లాభాల వాటా కింద రానున్నాయి. సింగరేణిలోని 40 వేల మంది కార్మికులకు సగటున రూ.1,50,000 లాభాల వాటా కింద వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇప్పటికి సింగరేణి సంస్థ లాభాలను ప్రకటించలేదు. దసరా పండుగ సమీపిస్తుండడంతో కార్మికుల్లో లాభాల వాటా విషయమై ఉత్కంఠ నెలకొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్‌ టన్నుల వార్షిక లక్ష్యానికి గాను 58 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. 12 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గినప్పటికి పన్నులు పోను రూ.1753 కోట్ల లాభాలు రావడం గమనార్హం. ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి పెరగడం, జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌, సోలార్‌ పవర్‌ల ద్వారా విద్యుత్‌ అమ్మకాలతోపాటు ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించడం అనేక కారణాలతో సింగరేణి లాభాలను గడించడానికి కారణంగా తెలుస్తున్నది. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగియడంతో త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. దీంతో లాభాల వాటా ప్రభావం కార్మిక వర్గంపై ఉంటుంది. గతేడాది కంటే కార్మికులకు వాటా పెంచితే అధికార పార్టీ అనుబంధ యూనియన్‌కు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి.

కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం వాటా చెల్లించాలి

యైుటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో 10 శాతం వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో శనివారం ఆర్జీ-2 జీఎం ఆఫీస్‌ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. అనంతరం జీఎంను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సింగరేణి కాలరీస్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు బీ అశోక్‌ మాట్లాడారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాలను దసరా వస్తున్నా ఇప్పటికీ ప్రకటించ లేదని, ఆలస్యం చేయకుండా వాస్తవ లాభాలను ప్రకటించి, పర్మినెంట్‌ కార్మికులతో పాటు కాంట్రాక్టు వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం 35,000 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని, వీరికి చట్టబద్దంగా రావాల్సిన వేతనాలను ఇవ్వడం లేదన్నారు. 10 శాతం వాటా చెల్లిస్తే ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అశోక్‌ తెలిపారు. ధర్నాలో బుచ్చమ్మ, రాజనర్సు, ప్రేంకుమార్‌, రమ, మల్లికార్జున్‌, గట్టయ్య, రాజబాబు, కుమారస్వామి పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:22 AM