Masab Tank Drugs Case: అమన్ ప్రీత్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 08:40 PM
సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ వేసిన పిటిషన్ పై గురువారం నాడు హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈనెల 19కి వాయిదా వేసింది.
హైదరాబాద్, జనవరి 08: మాసబ్ ట్యాంక్ పీఎస్‌లో తనపై నమోదైన డ్రగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ ప్రముఖ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అతడి పిటిషన్‌పై ఇవాళ(గురువారం) హైకోర్టులో వాదనలు ముగిశాయి. అమన్ డ్రగ్స్ వినియోగదారుడిగానే ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తునకు సహకరించడానికి అమన్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) జితేందర్.. కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. అమన్, డ్రగ్స్ విక్రేతలకు మధ్య నగదు లావాదేవీలు జరిగాయని ఏపీపీ తెలిపారు.
గతేడాది జూన్ నుంచి పలు లావాదేవీలు జరిగాయని కోర్టు దృష్టికి ఏపీపీ తెచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా అమన్ ప్రీత్ లావాదేవీలు నిర్వహించారని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. అయితే అమన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. అమన్ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. న్యాయస్థానం తీర్పును 19వ తేదీకి వాయిదా వేసింది. గతేడాది డిసెంబర్ 19 హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో పోలీసులు జరిపిన దాడుల్లో కొకైన్, MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా.. అమన్ పేరు బయటకు వచ్చింది. ఈ కేసులో అమన్‌ను ఏ-7గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర: సీఎం రేవంత్
ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు